Gadiyaram Dhruva : అలుపెరుగని అక్షర యోధుడు
‘మైత్రేయ’ (అసలు పేరు ధ్రువకుమార్ శర్మ).. ఇంటి పేరు, కులం తోకను వద్దనుకుని ఎంచుకున్న కలం పేరు ‘మైత్రేయ’.. 60 ఏళ్ల వయసులోనూ అలుపెరుగని అక్షర యోధుడు ఆయన.. పత్రికా రంగంలో సుదీర్ఘ కాలం సేవలందించిన ఆయన పేరు తెలియని వారు ఉండరు.. దాదాపు మూడు తరాలతో పని చేసిన ఆయన సాధించిన విజయాలెన్నో.. ఎదుర్కొన్న ఒడిదుకులు ఎన్నో ఉన్నాయి. ఆయన తయారు చేసుకున్న శిష్యులూ ఎందరో ఉన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎందాకైనా వెళ్లడం.. అందులోనే ఓ ‘ధ్రువ నక్షత్రం’ లా (Gadiyaram Dhruva) వెలగడం తన నైజం. అగ్రవర్ణంలో పుట్టినా ఆ భావజాలం ఎప్పుడూ కనిపించని ధ్రువ మైత్రేయ గారు ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక స్వయం సేవకుడిగా (1977) ఆనాటి దివి సీమ ఉప్పెనలో పాల్గొన్నా.. ఆ తర్వాత 1980 నాటికి పీపుల్స్ వార్ పంథాను ఎంచుకోవడం ఆయనకే చెల్లింది.. ఎంతో విస్తృత జీవితం కలిగిన ఆ ‘మనిషి’ని ‘చౌరాస్తా’ లోకి తేవడం ఒకింత.. కత్తి మీద సామే అనిపించింది.. అయినా దైర్యం చేశా.. మరి ఆ విషయాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. పదండి మరి…
అలంపూర్ రిపోర్ట్ గా మొదలై..
1986లో ఆంధ్రజ్యోతి అలంపూర్ రిపోర్ట్ గా చేరాను. అప్పట్లో ప్రతి మండలానికి ఓ రిపోర్ట్ ఉండేవాడు కాదు. తాలుకాకు (నాలుగు మండలాలు) ఒక రిపోర్ట్ ఉండేవాడు. నేను అలా అలంపూర్ తాలుకా రిపోర్ట్‌గా చేరా.. రోజంతా జరిగిన మీటింగ్‌లను కవర్ చేసి వార్తల రూపంలో రాసి ఉదయం 5 గంటల వరకే కర్నూల్ వెళ్లే బస్సుకు ఇస్తే.. ఆ డ్రైవర్ కర్నూల్లో హైదరాబాద్ వెళ్లే బస్సుకు ఇచ్చే వాడు అతడు హైదరాబాద్ వెళ్లాక బస్టాండ్‌లో ఉన్న ఆంధ్రజ్యోతి బాక్స్ లో వేసేవాడు.. ఇదొక ఆంధ్రజ్యోతికే పరిమితమైన ఫెసలిటీ కాదు.. అన్ని పేపర్ల గ్రామీణ విలేకరులకూ అదే మార్గం.. అప్పట్లో ఆర్టీసీ డ్రైవర్స్ కూడా బాగా సహకరించే వారు. అలా మేం పంపిన వార్తలు ఆ పక్కరోజు తెల్లారగానే ప్రత్యక్ష మయ్యేవి.. (ఈరోజు లాగా 24×7 చానెల్స్ లేవు)
క్రైం కవరేజీకి ఉద్దెర ఫోన్లు..
ఇక ఏదైనా క్రైం జరిగితే ఫోన్లో వార్తలు చెప్పేవాళ్లం.. ఆ ఫోన్ చేసేందుకు అప్పట్లో డబ్బులు ఉండేవి కావు.. ఇప్పటిలాగా సెల్ ఫోన్ల సౌకర్యం లేని కాలం.. STD ల సౌకర్యం పట్టణాలకు వచ్చినా గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేని కాలమది.. అందుబాటులో ఉన్నా.. సంస్థలు ఫోన్ ఖర్చులు ఇచ్చేవి కావు. అందుకే ఆనాడు ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఉన్న పంచాయతీ, తహసీల్, పోలీస్ స్టేషన్లపై వాలి ఉద్దెర ఫోన్లను (నవ్వుతూ..) వాడుకునేటోళ్లం.. ఇది కాక అప్పట్లో రెహమాన్ అని ఓ మిత్రుడు టెలీఫోన్ ఎక్సేంజ్‌లో పని చేసే వాడు. ఆయన ఎవరి ల్యాండ్ లైన్ నో కలిపితే హాయిగా చాయ్ తాగుతూ వార్తలు చెప్పే వాళ్లం.. (బిల్లు వాళ్లకు పోతుందని వేరే చెప్పక్కర్లేదు)
1989లో డెస్క్ కు వచ్చా..
రిపోర్ట్ గా ఎంత పనిచేసినా ఓ గుర్తింపు ఉంటుందే తప్ప నెలసరి జీతం ఉండదు. అప్పుడు పబ్లిష్ అయిన వార్తకు సెంటీమీటర్ల కొలతలతో పారితోషికం. ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉండటం ఓ దురదృష్టం.. అలా ఓ మూడేళ్ల పాటు రిపోర్ట్ గా పని చేశాక నా మనసు డెస్క్ వైపు మళ్లింది. మొదటి నుంచి నాకు సాహిత్యం, పుస్తకాలు చదవడం అలవాటు. రిపోర్ట్ గా కేవలం వార్తలు మాత్రమే రాసుడు ఉంటది. డెస్క్ లోకి వెళితే వార్తలతో పాటు వ్యాసాలు రాసుకుంటూ హాయిగా ఉండొచ్చు అనేది నా భావన. అలా 1989లో డెస్క్ లోకి వచ్చాను. వాస్తవానికి నేను 1982లో ఏబీకే ప్రసాద్‌గారు ఎడిటర్‌గా ఉన్న ‘ఉదయం’లో చేరాల్సిన వాణ్ని.. కానీ ఆలస్యంగా 1986లో జ్యోతిలో చేరాను.. నేను చేరే వరకే కె.శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి ఎడిటర్) మొదలుకుని ఆనాటి ఉదయం జర్నలిస్ట్ మిత్రులెందరో ఆంధ్రజ్యోతిలో చీఫ్ సబ్ ఎడిటర్ హోదాలో ఉన్నారు. ఓ విధంగా వాళ్లు కూడా నేను డెస్క్ వైపు నా దృష్టి మళ్లడానికి ప్రేరేపించారనే చెప్పాలి. ఆనాడు అలా డెస్క్ లో చేరా.
నేను కలిసి పనిచేసిన వారి పేర్లు మచ్చుకు కొన్ని చెబుతా.. కె. శ్రీనివాస్ , వర్ధిల్లీ మురళి, సురేంద్రరాజు, వి. శ్రీనివాస్ , అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, శేఖర్ రెడ్డి, సి వెంకటేశ్ (సేల్స్ టాక్స్ జాయింట్ కమిషనర్ ), చంద్రమోహన్ (OSD to C.S.).. వాళ్లంతా ఇప్పుడు ఉన్నత పదవుల్లో, హోదాల్లో ఉన్నవారే.. ఆనాటి డెస్క్ మిత్రుల గురించి చెప్పుకుంటూ పోతే.. గొప్ప హోదాల్లో పనిచేసిన వారెందెరెందరో…! ఒకమాటలో చెప్పాలంటే.. వాళ్లను నేను మరిచిపోలేదు. వాళ్లూ నన్ను మరిచిపోలేదు.. ఈ నాటికీ…
రిపోర్ట్ గిరి వద్దనుకుని.. అలా డెస్క్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నా.. ఆత్మీయ మిత్రుడు కె.శ్రీనివాస్ నా అభిలాషను గుర్తించి డెస్క్ లోకి తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు.. కానీ.. అప్పట్లో ABK ప్రసాద్ గారు యాజమాన్యంతో తగాదాపడి ‘ఆంధ్రజ్యోతి’ ని వదలి ‘ఆంధ్రభూమి’ కి వెళ్లడం ఓ సంక్షోభమే.. ఈ నేపథ్యంలో రిపోర్టింగ్ మీద విరక్తి చెందిన నేను వేరే పేపర్లోనైనా సబ్ ఎడిటర్ కావాలనుకున్నా.
రాంప్రసాద్ ప్రోత్సాహంతో..
అదే సమయలంలో ఆంధ్ర పత్రికకు మళ్లీ రూపురేఖలు దిద్ది దాన్ని నడిపించాలనే ఉద్దేశంతో ఓ ప్రయత్నం జరిగింది. ఆ పత్రికలో పనిచేసేందుకు ‘సబ్ ఎడిటర్స్ కావాలని’ ప్రకటన వేశారు. అది చూసి నేను 1989 ఫిబ్రవరి2వ తేదీన ఆంధ్రపత్రిక రాత పరీక్ష కోసం విజయవాడ పోవాల్సి వచ్చింది. అప్పుడు శ్రీరాంమూర్తి గారు ఆ పత్రిక ఎడిటర్‌గా ఉన్నారు. ఆయన నాకు ‘ఆంధ్రప్రభ’ చీఫ్ సబ్ ఎడిటర్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం.. (అంటే 1980లో ) నా 21వ ఏటలోనే ఆయన ప్రోత్సాహంతో వ్యాసాలు రాశాను. ఆ పరిచయంతోనే ఆయనను కలుద్దామని విజయవాడకు వెళ్లాను. కానీ.. ఆంధ్రపత్రికలో చేరడం సరైంది కాదని శ్రీరాం మూర్తిగారు చెప్పాక ‘కిం కర్తవ్యం..?’ అయితే… ఏబీకే ప్రసాద్‌గారు 1988 చివరలో ‘ఆంధ్రజ్యోతి’ వదిలి ‘ఆంధ్రభూమి’ లో ఎటిటర్‌గా చేరారు. ఈ విషయం నాకు విజయవాడ వెళ్లాక తెలిసింది. దీంతో నేను ఆయనను కలిసి భూమి లో చేరుదామని ఆఫీస్‌కు పోయిన. కానీ ఆ టైంలో ఏబీకే గారు లేరు. అదే సమయంలో ఆర్టిస్టు మోహన్ తమ్ముడు ప్రకాశ్ అక్కడ న్యూస్ ఎడిటర్ గా ఉన్నాడు. ఎడిటర్‌గారు వచ్చాక కలుద్దాంలే అని చెప్పడంతో ఆ రెండు రోజులు ఆత్మీయ మిత్రుడు కె.ఎన్. చారి ఆంధ్రజ్యోతి సీనియర్ సబ్ (చనిపోయాడు) ఆయన ఇంట్లో ఉన్నా.. అదే సమయంలో ‘ఆంధ్రజ్యోతి’ ఆఫీసుకు వెళ్లి.. అప్పుడు స్పాట్ న్యూస్ నెట్వర్క్ ఇంచార్జిగా ఉన్న రాంప్రసాద్ గారిని కలిశాను. నేను భూమిలో చేరాలని అనుకుంటున్నానని మనసువిప్పి చెప్పాను. వెంటనే ఆయన స్పందిస్తూ.. నన్ను వారిస్తూ… ‘ఇన్ని రోజులు ఆంధ్రజ్యోతిలో ఉన్నావు.. ఇందులోనే ఉండాలి..’ అంటూ ఎప్పుడో సబ్ ఎడిటర్ అవకాశం కల్పించాలని కోరుతూ నేను పెట్టుకున్న అప్లికేషన్‌ను వెతికి తీసిశారు. దాన్ని వెంటనే ఎడిటర్‌కు పంపారు..
ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందోనని భయపడ్డా..
అప్పడు నండూరి రామ్మోహన్ రావు గారు ఆంధ్రజ్యోతి చీఫ్ ఎడిటర్..ఆయనతో ముఖాముఖి పరీక్షను ఫేస్ చేయాలి. రాంప్రసాద్ గారు ఎడిటర్ గారి క్యాబిన్ ముందు నన్ను కూర్చోబెట్టి వెళ్లారు. ఆ క్షణం నుంచి నా గుండెలో దడ మొదలైంది. నేను (Gadiyaram Dhruva) మొదటి సారిగా నా జీవితంలో భయపడిన క్షణాలు అవే.. రామ్మోహన్ రావు గారు మహా పండితులు. నేను బచ్చాగాడిగా ఉన్నప్పటికే చాలా పుస్తకాలు రాశారు. విశ్వరూపం, నరావతారం వంటి అనేక పుస్తకాలు నేను చదివాను. అలాంటి ఆయనను నేను ఇంటర్వ్యూలో ఫేస్ చేయగలనా?. నిజం చెప్పాలంటే.. ఆనాటికి నాకు పరిచయం కాని శాస్త్రం ఏదీ లేదు.. అయినా ఓ భయం, బుగులు వెంటాడుతూనే ఉంది. లోనికి వెళ్లాక నేను అనుకున్నదంతా తారు మారైంది. కారణం ‘గడియారం’..
నా అప్లికేషన్లో సన్ ఆఫ్ గడియారం రామకృష్ణ శర్మ చూడగానే.. రామ్మోహన్ రావు గారు ‘నాన్న గారు బాగున్నారా..’ అని అడిగారు. ‘బాగున్నారు సార్..’ అని ప్రతిగా ముక్తసరి సమాధానం.. ఆ వెంటనే ‘ఇల్లు సొంతంగా చేసుకున్నారా..’ అన్నారు.. ‘లేదు సార్..’ అన్నాను.. ‘మహానుభావులు చేసుకోరులే..’ సరేలే… ‘రాయడం అలవాటు ఉందిగా..’ అనగానే.. ‘వచ్చుసార్’ అన్నాను.. ‘సరే ఒకే వెళ్లండి…’ అన్నారు.
హైదరాబాద్ పోస్టింగ్..
ఎడిటర్ గారితో ఇంటర్వ్యూ పూర్తయిన మరుసటి రోజు అప్పటి ఆంధ్రజ్యోతి ఎండీ కానూరి జగదీశ్ ప్రసాద్ గారు నన్ను చూడాలనుకున్నారు. అందుకు ఏకైక కారణం.. నండూరి వారు నా అప్లికేషన్ పై పరమామోదంతో రాసిన నోట్.. అది చూసి ఎండీగారు ఒకింత ఆశ్చర్యానికి గురై.. అసలు క్యాండిడేట్ ఎవరో చూడాలని రమ్మని చెప్పడంతో తెల్లారి ఆఫీస్‌కు వెళ్లాను. వెళ్లగానే.. ఆయన నాతో చాలా సరదాగా మాట్లాడారు. ఎడిటర్‌గారు ఇప్పటిదాకా ఎవరి గురించీ ఇలా రాయలేదు అన్నారు. అలా మాటలు..మాటల్లో మాటగా.. విలేకరిగానే కాక ఇంకేమైనా చేశారా..? అంటూ.. ఆరా తీశారు.
ఆక్ట్ ట్యూటోరిల్స్..
నేను మొదట ఆర్ఎస్ఎస్లో పనిచేశా…1977 దివి సీమ ఉప్పెనలో 20 రోజుపాటు నేను నాస్నేహితులు అక్కడ ఉన్నాం. కళేబరాలు తీయడం వంటివి చేసే వాళ్లం. అట్లా ఉన్న వాణ్ని అప్పడి పరిస్థితులతో ఒక్కసారిగా పీపుల్స్ వార్ వైపు మళ్లాను. తర్వాత జ్యోతిలో రిపోర్ట్ గా చేరాను. ఊళ్లో ఏదైనా చైతన్య కార్యక్రమాలు ఉంటే నేనే ముందు ఉండేది. ఆ టైంలో ఉళ్లో ఉన్న కాలేజీకి సరైన లెక్చరర్లు లేకపోవడంతో అసోసియేటెడ్ క్యాండెట్ థింకర్స్ (ఆక్ట్) పేరు మీద ట్యూటోరియల్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఊళ్లో ఉన్న ఇంటర్ పిల్లలకు ట్యూషన్స్ చెప్పే వాళ్లం. ఒక్కో సబ్జెక్టుకు రూ.15 చొప్పున మూడింటికి రూ.45 తీసుకునే వాళ్లం. ఇందులో ఎస్సీ పిల్లలకు ఫ్రీ.. ఫీజులేదు.. రైతుల పిల్లలకు కొంత రాయితీ ఇచ్చి రూ.30కే మూడు సబ్జెక్టులు చెప్పేది. తల్లిదండ్రులు ఇద్దరూ ఎంప్లాయీస్ అయితే మాత్రం రూ.45 ఫీజు తీసుకునేది. అలా చిన్న రూంలో స్ట్రాట్ చేసిన ట్యుటోరియల్ మంచి సక్సెస్ సాధించింది. దాదాపు 200 మంది పిల్లలతో మొదటి ఏడాది మంచి రిజల్ట్ సాధించాం. దీంతో మా తాలూకా వడ్డెపల్లి మండలంలోని శాంతినగర్‌లో ఉన్న కమ్మ/ రెడ్డి కులాలకు చెందిన ధనిక రైతులు. ఓ రోజు నన్ను పిలిచి..
‘శాంతినగర్ లో మేం కాలేజీ కడతాం.. అది మీదే అయ్యగారు.. మీరు మా పిల్లలకు చదువు చెప్పండి చాలు..’ అన్నారు.
కానీ, సరస్వతిని అమ్ముకుని బతకాలా అనే భావనతో నేను సున్నితంగా ‘విలుకాదు’ అని తిరస్కరించాను. రూ.5 వేల సంపాదించే ట్యుటోరియల్ కు స్వస్తి చెప్పి.. రూ.800 లకు ఆంధ్రజ్యోతిలో ట్రైనీ సబ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యా.. విద్యను అమ్ముకుని బతకడం ఇష్టంలేక నేను దానిని వదిలేసి సబ్ ఎడిటర్ జాబ్ కోసం వచ్చానని చెప్పిన వెంటనే ఎండీ జగదీశ్ ప్రసాద్ గారు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి వారు కూడా ఉంటారా అన్నట్లుగా నన్ను చూశారు. ఆ తర్వాత హైదరాబాద్ ఫోన్ చేసి ‘ధ్రువ’ అనే సబ్ ఎటిటర్ వస్తున్నాడని చెబుతూ అపాయింట్ మెంట్ లెటర్ నాచేతికిచ్చారు..
ధ్రువ గారి డెస్క్ అనుభవాలు నెక్ట్స్ ఎపిసోడ్లో…
(రాధాకృష్ణ మాటలు నన్ను బాధ పెట్టాయ్)
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ధృవ మైత్రేయ గారూ! నమస్కారం .
నేను శివప్రసాద్, ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధం లో ఆర్టిస్టు గా పనిచేసేవాడిని.. “ చౌరాస్తా “ లో అక్షర యోధుడు ధృవ మైత్రేయ చదివి చాలా ఉద్వేగానికి గురయ్యాను. డాక్యుమెంటరీలా కళ్ల ముందు ఒక జర్నలిస్టు జీవన సమరం కదలాడింది . మంచి ప్రయత్నం !!