tamannaah kajal : ముద్దుగుమ్మలు.. దిష్టిబొమ్మలు..
నరదిష్టి తగలకుండా ఉండేందుకు సాధారణంగా దిష్టిబొమ్మలను వాడుతారు. కానీ.. ఓ రైతు ఏకంగా దర్శకుడు రాజమౌళి సినిమాల్లో నటించిన టాప్ హీరోయిన్ల ఫొటోలను దిష్టిబొమ్మలుగా చేశారు. ఆయన ఐడియాను చూసిన వారంతా ఒకింత ఆశ్చర్యపోతున్నా.. సిద్దిపేట సీఎం నీ ఐడియా సూపర్ అంటున్నారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామానికి చెందిన చంద్రమౌళి (సీఎం) ఏటా తనకున్న రెండు ఎకరాల్లో మిర్చిని సాగుచేస్తున్నారు. ప్రతిసారి పంట కోత సమయంలో నరదిష్టి తగిలి లాభం రాకుండా పోతోంది. దీంతో ఈసారి పొలంలో దిష్టిబొమ్మ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఆయనకు ఓ ఐడియా తట్టింది. అదేంటంటే.. దిష్టిబొమ్మలకు బదులు తన అభిమాన హీరోయిన్ల ఫొటోలు పెట్టాలని.. ఆ హీరోయిన్లు ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమాల్లో నటించిన తమన్నా, కాజల్.. వారి భారీ ఫెక్సీలను తెచ్చి పొలం పెట్టాడు. ఇంకేముందు ఆ దారిన పోయేవారి చూపంతా పంటపై కాకుండా తమన్నా, కాజల్ ఫ్లెక్సీలను పడడంతో నరదిష్టి తప్పిందని, ఈసారి పంట బాగా పండిందని చంద్రమౌళి మురిపోతున్నాడు.. అమ్మో.. రాజమౌళి హీరోయిన్లను (tamannaah kajal ) ఇలా వాడుకోవచ్చా.. సిద్దిపేట సీఎం (చంద్రమౌళి) ఐడియా సూపర్ అంటూ అంతా మెచ్చుకుంటున్నారు.