Suryapet Hi Tech Murder : హైటెక్ హత్య
ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కటి టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. గ్రామంలో మురుగు కాల్వలు తీయాలన్నా.. అంతరిక్ష కేంద్రంలో రాకెట్ ఎగరాలన్నా.. టెక్నాలజే కీలకం. ఇదే టెక్నాలజీని వినియోగించి ఓ కిరాయి హంతక ముఠా ఓ వ్యక్తిని హత్య చేయడం సంచలనంగా మారింది. బాధితుడి కదలికలను తెలుసుకునేందుకు సాంకేతికను ఉపయోగించి.. దారుణంగా మట్టుబెట్టారు. అంతగా చదువుకోని నిందితులు టెక్నాలజీని ఉపయోగించి హత్య చేయడాన్ని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఇంతకు ఇది ఎక్కడ జరిగింది..? హతమైంది ఎవరు..? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే..
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడకు చెందిన గుర్రం శశిధర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఆయన మొదటి భార్య, కుమారుడు హత్యకు గురయ్యారు. ఆ కేసులో శశిధర్ రెడ్డి మొదటి ముద్దాయిగా ఉన్నాడు. ఆ తర్వాత భవానీని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారంలో బిజీ అయిపోయాడు. అయితే నల్లగొండ జిల్లా నకిరేకల్ కు చెందిన ఉప్పల శ్రీనివాసులుకు, శశిధర్ రెడ్డికి కుడకుడ గ్రామ రెవెన్యూ శివారులో భూములు ఉన్నాయి. ఉప్పల శ్రీనివాసులు రెండో భార్య పద్మశ్రీ దగ్గర ఆయనకు తెలియకుండా తక్కువ ధరకే గుర్రం శశిధర్ రెడ్డి భూమిని కొనుగోలు చేశాడు. అంతటితో ఆగక.. శ్రీనివాసులు భూమిని కూడా ఆక్రమించుకుని, బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై పలుమార్లు పంచాయితీలు జరిగినా శశిధర్ రెడ్డి భూమిని తిరిగి ఇవ్వలేదు. దీంతో ఉప్పల శ్రీనివాసులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అతడిపై పగ పెంచుకున్న శ్రీనివాసులు.. శశిధర్ రెడ్డిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మనిషికి లక్ష రూపాయలు..
శ్రీనివాసులు ఈ విషయాన్ని తన స్నేహితుడైన మద్దిరాల మండలం చిన్ననేమిల గ్రామానికి చెందిన షేక్ జానీకి చెప్పాడు. అతడు తనకు పరిచయమున్న వరంగల్ కు చెందిన అబ్బరమీన రమేష్ అలియాస్ ఇడ్లీ రమేష్, గొట్టిముక్కల రాజిరెడ్డికి హత్య ప్లాన్ గురించి వివరించారు. వారి ముగ్గురికితోడు మేకల రమేష్, మేదరి వేణు, పంగ రవి, మేకల ప్రవీణ్ లను కలుపుకుని ముఠాగా ఏర్పడ్డారు. వారంతా 12 డిసెంబర్ 2020న నకిరేకల్ లో ఉప్పుల శ్రీనివాసులను కలుసుకున్నారు. చర్చల అనంతరం శశిధర్ రెడ్డిని హత్య చేయడానికి అంగీకరించారు. దానికి ప్రతి ఫలంగా మనిషికి లక్ష రూపాయలు, గుంట ప్లాటు లేదా ఆ ప్లాటును అమ్మి డబ్బులు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు.
మూడు సార్లు విఫలం..
ఈ ముఠా సభ్యులందరికీ ఉప్పల శ్రీనివాసులు, జానీలు కలిసి సూర్యాపేటలో శ్రీనివాసులు ఇంటిలో షెల్టర్ ఏర్పాటు చేశారు. మేకల రమేష్, మేదరి వేణు, పంగ రవి, మేకల ప్రవీణ్, చల్లా పూర్ణ చందర్ రెడ్డి, గిన్నారపు రవీందర్, వీరగొని శ్రీనివాస్, అంబాల కుమార్ స్వామి, ఈరా వినయ్ గుర్రం శశిధర్ రెడ్డిపై నిఘా పెట్టారు. నిత్యం ఒక ఆటో, రెండు స్కూటీలతో ఫాలో అవుతూ రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో కుడకుడ రోడ్డులోని మీ-సేవ కేంద్రము దగ్గర, భీమారం రోడ్డులోని ఫంక్షన్ హాల్ దగ్గర, హైదరాబాద్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ గుడి దగ్గర గుర్రం శశిధర్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
మూడు సార్లు హత్య ప్లాన్ విఫలం కావడంతో మేదరి వేణు, ఉప్పల శ్రీనివాసులు టెక్నాలజీని వాడాలని నిర్ణయించుకున్నారు. వెంటనే హైదరబాద్ లో GPSను కొనుగోలు చేశారు. మేదరి వేణు సెల్ లో TGG IOT అండ్రాయిడ్ యాప్ ను ప్లే స్టోర్ నుండి ఇన్ స్టాల్ చేశారు. ఆ GPSను గుర్రం శశిధర్ రెడ్డి కారుకు అమర్చి, ఆయన కదలికలను ఎప్పటికప్పుడు గమణించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న సాయంత్రం 06.30 గంటలకు శశిధర్ రెడ్డి తన కారులో పొలం వద్దకు వెళ్లాడు. GPS ద్వారా అది గమనించిన నిందితులు ఆటో, స్కూటీలపై ఆయను వెంబడించి కుడకుడ గ్రామ శివారులోని ఆయన పొలం వద్దకు వెళ్లారు. అక్కడ శశిధర్ రెడ్డి ఫోన్ మాట్లాడుతుండగా వెనుక నుంచి వెళ్లిన పంగ రవి ఆయన కళ్లలో కారం కొట్టాడు. వెంటనే ఆయన పొలంలో పడిపోయాడు. అదే అదునుగా భావించిన ఆటోలో ఉన్న మేదరి వేణు, చల్లా పూర్ణ చంద్రారెడ్డి, మేకల ప్రవీణ్, గిన్నారపు రవీందర్ వేట కొడవళ్లు, కత్తులతో మూకుమ్మడిగా దాడి చేసి మెడ మీద, తల మీద విచక్షణారహితంగా నరికారు. దీంతో శశిధర్ రెడ్డి అక్కడికక్కడే హతమయ్యాడు. నిందితుల ఫోన్ కాల్స్ ఆధారంగా అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.