mummy i miss you : ఐ మిస్ యూ
‘జర్నలిజం నిజంగా వ్యసనం. దాని కోసం నా అన్న వాళ్లను వదిలేసి.. వారి మంచిచెడులు చూడకుండా.. ఏళ్లకేళ్లు వెట్టి చారికీ చేస్తాం. అందులోనే కిక్కును వెతుక్కుంటాం.. ఆ కిక్‌లోనే నేనూ బతికాను. కానీ లాక్ డౌన్ నన్ను ఇంటి దారి పట్టించింది. అప్పుడు తెలిసింది అక్కడి బాధలు’ అంటూ తన గతాన్ని వివరించాడు కరీంనగర్‌కు చెందిన సీనియర్ డెస్క్ జర్నలిస్ట్ అప్పీస చిరంజీవి..
మాది సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని నాగసముద్రాల. అది ఒకప్పుడు కరీంనగర్ జిల్లా.. జిల్లాల పునర్విభజన తర్వాత సిద్దిపేట జిల్లాలో కలిపారు. ఎలిమెంటరీ వరకు మా ఊరి మండల పరిషత్ స్కూల్లో చదివా. ఐదో తరగతి నుంచి 9 వరకు ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లా కమలాపూర్‌లోని ‘ఆంధ్రప్రదేశ్ బాలుర గురుకుల విద్యాలయం’లో చదివాను. పదో తరగతి మా ఊరి శివారులోని బస్వాపూర్‌లో, తర్వాత ఇంటర్, డిగ్రీ హుస్నాబాద్‌లో పూర్తి చేశాను.
చిన్న రైతు కుటుంబం..
మాది చిన్న రైతు కుటుంబం. ఇద్దరం అన్నదమ్ములం. ఒక అక్క. అక్కకు మా చిన్న వయస్సులోనే పెండ్లి అయింది. అమ్మానాన్న మేకలు కాసి ఆ మందను అమ్మిన డబ్బులతో మూడెకరాల కొని వ్యవసాయం చేసేవారు. నేను ఇంటర్ తర్వాత సొంతంగా ఏదైనా జాబ్ చేయాలనే ఉద్దేశంతో చిన్నచిన్న కోర్సులు చేశాను. మొదట్లో కంప్యూటర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని కంప్యూటర్ బేస్డ్ గా ఏదైనా జాబ్ చేయాలనే ఉద్దేశంతో హార్డ్ వేర్ అండ్ నెట్వర్కింగ్ నేర్చుకున్నా. కానీ, అందులో పెద్దగా జాబ్స్ రాలేదు. ఆ సమయంలోనే డీటీపీపైన మక్కువ ఏర్పడింది. మొదట నా పేరును ఎలాగైనా కంప్యూటర్ అక్షరాల్లో నేనే టైప్ చేస్తే ఎలా ఉంటుందనే కుతూహలంతో తెలుగు డీటీపీ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఇన్స్టిట్యూట్లోనే తెలుగు డీటీపీపైన అవగాహన తెచ్చుకున్నా. తర్వాత సొంతంగా డీటీపీ అలవాటైంది. టెక్ట్స్ బుక్కుల్లో ఉండే సబ్జెక్టును డీటీపీ చేస్తూ పూర్తిగా నేర్చుకున్నాను.
కరీంనగర్‌ను.. కార్తీక్‌ను మర్చిపోను..
నేను ఇది వరకే చదివిన హార్డ్ వేర్ నెట్వర్కింగ్పైన ఈజీఎంఎం ఆధ్వర్యంలో ఫ్రీగా కోర్సులు నేర్పిస్తున్నారని తెలుసుకుని కరీంనగర్లో జాయిన్ అయ్యాను. అక్కడ నేను నేర్చుకున్న దానికంటే పెద్దగా ఏమీ చెప్పలేదనిపించింది. ఈ క్రమంలోనే స్నేహాలు విస్తరించాయి. కరీంనగర్లో ఫ్యాకల్టీగా ఉన్న కార్తీక్ పరిచయమయ్యాడు. అప్పట్లోనే ఆయన ప్రజాశక్తిలో టెక్నికల్ డిపార్ట్ మెంట్లో పని చేసేవాడు. అక్కడ ట్రైయినింగ్ అయిపోయాక హైదరాబాద్‌లో సెన్సస్ వర్క్ చేసేందుకు మమ్మల్ని కొంతమందిని తీసుకున్నారు. ఓ ట్యాబ్ ఇచ్చి జనాభా గణనకు పంపేవారు. హైదరాబాద్‌లో రోజుకో చోట పని చేయడం కొత్తగా అనిపించేది. అప్పుడే ప్రజాశక్తిలో నోటిఫికేషన్ వచ్చింది. కార్తీక్ ఫోన్ చేసి మరీ అప్లై చేసుకోమని చెప్పాడు. అప్పట్లో వాళ్లు చెప్పిన అంశం మీద వ్యాసం రాసి పంపిస్తే చాలు. వ్యాసం నచ్చితే రిటన్ టెస్టుకు సెలక్ట్ అయినట్టే. అలాగే జరిగింది. రిటన్ టెస్టు కరీంనగర్లో రాసేందుకు హాజరు కావాలని ప్రజాశక్తి జర్నలిజం కాలేజీ నుంచి ఫోనొచ్చింది. హైదరాబాద్‌లో జాబ్ చేస్తూనే ఎగ్జామ్ రాసొచ్చాను. ఆ తర్వాత వెంటవెంటనే పర్సనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం. జాయిన్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి.
ఆర్నెళ్ల శిక్షణ..
ఆర్నేళ్ల శిక్షణ అనంతరం 2012 ఆగస్టులో ఖమ్మంలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు నా మొదటి జీతం రూ.5,600. నా సీనియర్ ప్రశాంత్, రాజు అన్నలతో రూంలో ఉండేవాడిని. తర్వాత వారిద్దరూ ట్రాన్స్ ఫర్ అయి వెళ్లిపోయారు. (రాజు అన్న ప్రస్తుతం వరంగల్ సాక్షిలో సబ్ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రశాంత్ అన్న నవతెలంగాణలో స్టేట్ బ్యూరోగా ఉన్నారు). నాకు మొదటి నుంచీ మా సొంత జిల్లా అయిన కరీంనగర్లో పని చేయాలని ఉండేది. పోస్టింగ్ అప్పుడే పట్టుబట్టినా ‘ఇప్పుడు ఖాళీ లేద’ని చెప్పడంతో ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది.
ఖమ్మం వామపక్షాలు బలంగా ఉన్న జిల్లా.. అదీను ఓ కొత్త సబ్ ఎడిటర్‌గా పని చాలా ఎక్కువగా ఉందని అనిపించింది. అప్పట్లో విలేకరులు వార్తలు పేపర్‌పై రాసి కవర్లో పెట్టి బస్సులకు ఇచ్చి పంపేవారు. ఆ బస్సు డ్రైవర్లు బస్టాండ్‌లో ఉండే న్యూస్‌పేపర్‌కు సంబంధించిన బాక్సులో వేసే వారు. నేను పనిలో కొత్త కాబట్టి రోజూ బస్టాండ్‌కు వెళ్లి బస్సులో వచ్చిన వార్తలను తేవడం నా డ్యూటీ. రోజుకు రెండు మూడుసార్లు తీసుకొచ్చి డీటీపీ చేసే వాడిని. న్యూస్‌తో పాటు వాళ్లు పంపిన ఫొటోలను స్కాన్ చేసేవాడిని. ఆ తర్వాత వచ్చిన ప్రెస్నోట్లు, వార్తలను డీటీపీ చేసి పేజీలు పెట్టేవాడిని. ఎడిషన్ ఆఫీసు ఖమ్మం పట్టణానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఒక్కోసారి ఖమ్మం పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎడిషన్ ఆఫీసుకు వెళ్లడం వెళ్లాల్సి వచ్చేది. అలా ఒకసారి నేను, ఇంకో సబ్ ఎడిటర్ (మా సీనియర్ మేడం) మాత్రమే డ్యూటీలో ఉన్నాం. అప్పుడు మా ఎడిటోరియల్ బోర్డ్ ఇన్చార్జి మట్టయ్యగారు ఎడిషన్ ఆఫీసుకు వచ్చి పని చేయాలని పురమాయించారు. నేను తప్పక వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నా పని విధానం చూశాక మట్టయ్యగారు నన్ను అభినందించారు. ఆ తర్వాత పేజీనేషన్లోనూ వైవిధ్యం చూపించాక పేజీలు ఎలా పెట్టాలో నేను పెట్టిన పేజీని సీనియర్లకు ఉదాహరణగా చూపించాక ఆనందం వేసింది. బహుషా నన్ను కరీంనగర్‌కు పంపడానికి ఆ సాఫ్ట్ కార్నర్ పని చేసిందనుకుంటా. అప్పుడే కరీంనగర్లో ఓ పోస్టు ఖాళీ అయిందని మా ఫ్రెండ్ కార్తీక్ ద్వారా కబురు అందింది. నేను వెంటనే ‘మా సొంత జిల్లాకు పంపండి’ అని మట్టయ్యగారికి లెటర్ పెట్టాను. ఇక్కడికి మా నాన్నగానీ, మామయ్యగానీ రావాలంటేనే.. ఇబ్బంది పడుతున్నారని వివరిండంతో పాటు సొంత జిల్లాలో చేయాలని ఉత్సాహాన్ని ఆయనకు తెలియజేశాను. వెంటనే పంపలేదు. ఓ నెల అయ్యాక నన్ను కరీంనగర్‌కు పంపించారు.
రాత్రి ఒంటిగంట వరకూ..
కరీంనగర్లో ఎడిటోరియల్ బోర్డ్ ఇన్చార్జి నాందేవ్గారి వద్ద సబ్డిటర్గా వెళ్లాను. ఇక్కడ పని విధానం వేరుగా ఉండేది. జిల్లాల్లోని డెస్కు ఇన్చార్జిలతో, స్టాఫ్ రిపోర్టర్లతో ఎప్పుడూ కమ్యూనికేట్ కావడం.. రోజూ వారి పనిని ముందే తీసుకుని హైదరాబాద్‌కు చేరవేయడం చేసేవాన్ని. అలా దాదాపు ప్రజాశక్తి చివరి రోజుల వరకూ ఈ డ్యూటీలోనే కొనసాగాను. సబ్ఎడిటర్గా డెస్కుల నుంచి వచ్చిన ప్రతి పేజీని కరెక్ట్ చేయడం, డెస్క్ లకు ప్లానింగ్ అందించి స్టోరీలు రాయించడం.. ఎఫ్టీపీ ఆపరేటర్ రాని రోజు పేజీలను ప్లేట్లకు పంపించడం నా పని.. దాదాపు ప్రతి రోజూ రాత్రి ఒంటి గంట అయ్యేది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో అవసరమైనప్పుడాల్లా నన్ను డిప్యుటేషన్ మీద పంపేవాళ్లు. సభ్యుల కొరత ఉన్నప్పుడు అవసరమైన డెస్కుల్లోకి వెళ్లి పని చేసేవాడిని.
ప్రజాశక్తి నవ తెలంగాణగా మారినప్పుడు నాకు హైదరాబాద్ డెస్క్ సెకండ్ ఇన్చార్జిగా ప్రమోషన్ ఇచ్చారు. రవీంద్రభారతిలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా పత్రిక లాంచింగ్.. ముందు రోజు మా టీం అంతా దాదాపు 30 పేజీలు పెట్టాం. రాత్రి ఒంటిగంట అయ్యింది. అయితే లాంచింగ్ సాయంత్రం ఉండడంతో ఉదయమే వచ్చి మళ్లీ తాజా వార్తలతో 30 పేజీలు పెట్టి, సాయంత్రం లాంచింగ్ కార్యక్రమానికి హాజరయ్యాం. తెలంగాణ రాష్ట్రంలో సొంత జవసత్వాలతో ఓ కొత్త పత్రిక వస్తోందన్న ఆనందంతో ఎంత పని చేసినా ఏం అన్పించేది కాదు. ఓ నెల తర్వాత మళ్లీ కరీంనగర్‌కు యథావిధిగా తిరిగి వచ్చాను. ఆ తర్వాత కరీంనగర్‌లోనే డెస్కులు విస్తరించారు. అందులో భాగంగా నేను జగిత్యాల,-పెద్దపల్లి జిల్లాలకు డెస్క్ ఇన్చార్జిగా పనిచేశాను.
కదిలించిన కథనాలు..
జగిత్యాల కేంద్రంగా మంచి మంచి కథనాలు అందించాం. మేజర్‌గా గ్రామాల్లో పేరుకుపోయిన వివక్ష మీద స్టోరీలిచ్చాం. వాటిని పెద్దఎత్తున రెస్పాన్స్ వచ్చింది.
జగిత్యాల శివారులోని ఓ స్థలంలో రాత్రికి రాత్రే ఓ విగ్రహాన్ని పాతిపెట్టారు. ఆ స్థలం ఎస్సీలది కావడం, అందులో వారికి డబుల్ బెడ్ రూం కోసం ఇండ్లు మంజూరు కావడంతో ఆ స్థలం ఎలాగైనా వారికి దక్కకూడదని కొందరు విగ్రహాన్ని పాతిపెట్టారు. అప్పుడు ‘మనుషులు చేసిన దేవుడు’ అన్న శీర్షికన స్టోరీ ఇచ్చాం. దానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ స్పందించి అప్పటి కలెక్టర్ శరత్‌పై సీరియస్ అయ్యింది. దీంతో కలెక్టర్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ విగ్రహాన్ని పెట్టిన వారిపై కేసులు నమోదు చేయించారు.
గొల్లపల్లి మండలంలో ఓ రైతు బక్కయ్య భూ ప్రక్షాళన కారణంగా తన భూమి కోల్పోయానని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ‘స్పష్టతలేని భూ ప్రక్షాళన’ అన్న స్టోరీని రాశాం. అది సంచలనం సృష్టించి తహశీల్దార్‌కు మెమో జారీ చేశారు. నోట్ల రద్దు చేసినప్పుడు పుట్టు మూగ, చెవుడు అయిన ఓ వృద్ధురాలు తాను దాచుకున్న రూ.30 వేలు పనికిరాకుండా పోయాయి. నోట్ల రద్దు జరిగినట్టు ఆమెకు ఎవ్వరూ చెప్పలేదు. ‘దాచుకున్న ముల్లె మోడీపాలు’ అన్న శీర్షికన చిన్న కథనం ఇచ్చాం. అది సంచలనం సృష్టించింది.
ఇక కొండగట్టులో బస్సు బోల్తా దాదాపు 57 మంది ఆ ఒక్కరోజే చనిపోయారు. ఈ ఘటనను కవర్ చేసేందుకు జర్నలిస్టుగా చాలా కష్టపడ్డాను. మినిట్ టూ మినిట్ మృతుల సంఖ్య పెరుగుతుండడంతో ఘటన కవర్ చేసేందుకు చాలా శ్రమించాం. ఘటన జరిగినప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు ఆ ఘటనను కవర్ చేశాం. పలు కోణాల్లో వార్తలిచ్చాం. ఒక డెస్కు ఇన్చార్జిగా ఆ రోజు అత్యంత శ్రమించాను. అలాగే జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్ షో టీం చేసిన విలేజ్ ‘కికి చాలెంజ్’ కథనం తెలుగుపత్రికల్లో వచ్చిన మొదటి కథనం మాది. తర్వాత అన్ని తెలుగు దినపత్రికలు ఆ కథనాన్ని రాశాయి. ఇలా జర్నలిజంలో దాదాపు 8 ఏండ్లకుపైగా పని చేశాను. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నాతోపాటు పనిచేసిన సబ్ ఎడిటర్లు ఉన్నత స్థానాలకు ఎదిగారు. దాదాపు అన్ని పత్రికల్లో నాతో పని చేసిన సబ్ ఎడిటర్లు ఉన్నారు. వారు ఎప్పుడైనా కలిసినప్పుడు ‘అన్న అంతా మీరు నేర్పిన విద్యే’ అంటుంటే సంతోషం కలుగుతుంది.
లాక్ డౌన్ కొత్త అనుభవం
అయితే లాక్డౌన్ టైంలో పని చేయడం మాత్రం కొత్త అనుభవమని చెప్పాలి. రిపోర్టర్ కూడా ఇంట్లో కూర్చుని ఫార్వార్డ్ లో వచ్చిన కథనాన్ని రీ-రైట్ చేసి పంపేవారు. మనం అలా కాదు కదా.. తప్పనిసరిగా ఆఫీసులకు వెళ్లాల్సిందే. అక్కడ పని చేయాల్సిందే. పైగా లాక్ డౌన్లో జీతభత్యాలను కోత విధించారు. ఈ నేపథ్యంలోనే ఇంటి వద్ద నుంచి అమ్మానాన్న రోజూ ఫోన్ చేసే వారు. ఒక్కరోజూ ఫోన్ చేయకపోయినా తర్వాత రోజు ఫోన్ చేసి ‘ఎందుకు చేయలేద’ని అడిగేవారు. కష్టం వచ్చినప్పుడు ఇల్లు గుర్తుకొస్తుందంటారు చాలామంది. నాకు అలానే అనిపించింది. ఇన్ని రోజులుగా ఉద్యోగంలో ఉన్నా.. ఈ కాస్త టైం అయినా అమ్మానాన్నతో ఉండాలనిపించింది. పైగా ఎన్నో రోజులుగా మా అమ్మ ఇంటికి రమ్మని ఒకటే పోరుపెడుతుంది. ఉండబట్టలేకపోయా. జాబ్ మానేస్తే ఎలా? అన్న మీమాంసలో కూడా ఒక రెన్నేళ్లు ఉన్నా. బాగా ఆలోచించేవాడిని. తర్వాత ‘ఏం చేద్దాం’ అని. మా ఆవిడ (రేణుక)కు 8 నెలల ప్రెగెన్సీ.. ఈ కరోనా కాలంలో ఇక్కడ ఉండేకంటే ఊర్లోనే అమ్మానాన్న వద్ద ఉందామనుకుని ఫిక్సయ్యా. సెప్టెంబర్ నెలలో ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా.
వచ్చాక అన్నీ సమస్యలే..
అనుకున్నట్టుగానే నెల రోజుల ముందుగానే జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్టు ఆఫీసు వారికి చెప్పాను. లెటర్ కూడా ఇచ్చి కరీంనగర్లో రూం ఖాళీ చేసి ఇంటికి వచ్చేశా. మా అమ్మ చాలా హ్యాపీగా ఫీలయ్యింది. ‘ఇక నువ్ వచ్చేసావ్ కదా.. ఇగ ఏమన్నగాని అన్నది’ ఓ రోజు. ఇంటికి వచ్చాక అన్నీ సమస్యలే చుట్టుముట్టాయి. అప్పటికే మా నాన్నకు కండ్లు సరిగా కన్పించడం లేదు. ఎలాగైనా ఆపరేషన్ చేయించాలనుకున్నా.
నేను వచ్చాక వారం రోజుల దాకా మా అమ్మ బాగానే ఉంది. ఆ తర్వాత పూర్తిగా మంచానికే పరిమితమైంది. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించసాగింది. దగ్గర్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్‌ను రమ్మని బ్లడ్ శ్యాంపిల్స్ పంపించాం. అప్పటికే మా అమ్మ కాళ్లకు నీరు పట్టడం స్టార్ట్ అయింది. ల్యాబ్ రిపోర్ట్ లో అమ్మకు కిడ్నీ ఒకటి ఫెయిల్ అయినట్టు వచ్చింది. పైగా రక్తహీనత కూడా ఉంది. దాదాపు నా పెండ్లి అయినప్పటి నుంచి మా అమ్మ ఆరోగ్యం బాగా ఉండడం లేదు. నేను ఒకట్రెండుసార్లు కరీంనగర్ ఆస్పత్రిలో చూపిస్తే ఆమెకు ఎముకలు అరిగిపోయాయని, సీరం తగ్గిపోయిందని రెండేండ్ల క్రితమే చెప్పారు. అప్పటి నుంచి ఇంకా పూర్తిగా ఇంటికే పరిమితం అయింది. అయితే డాక్టర్‌ను సంప్రదించి డయాలసిస్‌కు వెళ్దామన్నా ఆమె శరీరం సహకరించలేని పరిస్థితిలో ఉంది. ఎముకలగూడులా మారిపోయింది. ఏమీ చేయాలో పాలుపోలేదు.
ఆమెను మేమింకా రక్షించలేమని అర్థమైపోయింది. ‘రిపోర్ట్ లో ఏమొచ్చిందిరా..’ అని ఎన్నోసార్లు అడిగింది. కానీ మేం చెప్పలేని పరిస్థితి. మా అక్క గర్భిణిగా ఉన్న తన కూతురు వాళ్ల ఇంటిదగ్గరే వదిలేసి వచ్చి సపర్యలు చేసింది.
నాన్నకు ఆపరేషన్ చేయిద్దామని సెప్టెంబర్ 26న సిద్దిపేటలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్టిట్యూట్కు వెళ్లాం. ఆపరేషన్ చేయించుకుని వచ్చాం. మేం ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే అమ్మ తుదిశ్వాస విడిచింది. (mummy i miss you) ఇంతటి కష్టం ఏ పగవానికీ రావొద్దని అన్పించింది.
రాదని తెలిసినా అమ్మ కోసం ఎంతో ఏడ్చాను. ఎందుకో అన్నీ విడిచిపెట్టి అమ్మ కోసం వస్తే ఆమె వెళ్లిపోయిందన్న బాధ. కనీసం ఇంకో నెల ఆగినా బాగుండు. నాకు పుట్టబోయే చిన్నారిని చూసైనా వెళ్లిపోతుందన్న ఆశ ఉండేది. 8 ఏండ్లు ఆమెకు దూరంగా ఉన్నా. కనీసం నాతో ఇంకో ఏడాదైనా ఉంటే బాగుండనిపించింది. ఎన్నో ఆశలతో ఊరికొచ్చిన నాకు మా అమ్మ దూరమైందే అని తలుచుకుని తలుచుకుని ఏడ్చాను. ఇక మా నాన్ననైనా బాగా చూసుకోవాలి అనుకుంటున్నా. అందుకే ఇంకా ఎక్కడి వెళ్లేది లేదని భీష్మించుకుని వ్యవసాయం మొదలుపెట్టాను. నా వంతుగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేస్తున్నా. ప్రస్తుతం వరి వేశాను.
ముగింపు :
అప్పీస చిరంజీవితో నాకు పెద్దగా పరిచయం లేదు. ఫేస్బుక్ ఫ్రెండ్ మాత్రమే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన ‘కొత్త దారిలో పాత మిత్రులు’ పేరుతో నేను రాస్తున్న కథనాలు చూసి ఓ సారి ఫోన్ చేశాడు. ‘అన్నా మీ ప్రయత్నం బాగుంది.. డెస్క్ వాళ్ల గురించి రాస్తున్న మొదటి వ్యక్తి మీరే ’ అంటూ అభినందించారు. నాతో మాట్లాడిన కొన్ని రోజులకే ఫేస్బుక్లో చిరంజీవి వాళ్ల అమ్మ చనిపోయినట్లు ఓ పోస్టు పెట్టాడు. బహుషా అది మూడో రోజు అనుకుంటా.. ఆయనతో మాట్లాడదాం అని ఫోన్ చేశా.. అంతే ఆయన నోటి వెంట మాట రావడం లేదు.. ఏడుపొక్కటే వస్తోంది.. ‘అన్ని వదిలేసి అమ్మ కోసం వచ్చానన్న.. కానీ, ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది..’ అని ఏడ్చాడు. అప్పుడు అనిపించింది.. చిరు గురించి రాయాలని.. ఇప్పటికి కుదిరింది.. చిరంజీవి ఇప్పటికీ ఆ బాధను దిగమింగుకుని బతుకుతున్నాడు. అమ్మ చనిపోయిన తర్వాత నెలకు చిరంజీవికి పాప పుట్టింది.. ఆ చిన్నారిలోనే తన తల్లి చూసుకుంటున్నాడు.. చిరు..
– ఉప్పలంచి నరేందర్, సీనియర్ డెస్క్ జర్నలిస్ట్
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
No words to express….
All the very best for New future…