huzurabad : అబ్బర కొండ..
అబ్బర కొండ.. హుజూరాబాదోళ్లకు పండుగే పండుగ పో.. ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని తేలిపోయింది. దసరా తర్వాతే బైపోల్ ఉంటుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. బైపోల్ వస్తే ఎంతో కొంత ఉపాధి దొరుకుతుందని అక్కడి జనం ముందుగా భావించినా.. ఎన్నిక మూడు నెలలు వాయిదా పడడంతో ఇప్పుడు ఎగిరిగెంతేస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు ఇస్తున్న విందు వినోదాల్లో మునిగి తేలుతున్న వారంతా.. ఇక ఈ మూనెలలు పండగే అని లోలోపల మురిసిపోతున్నారు.
కేసీఆర్ సర్కారులో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో (huzurabad ) ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికపై అందరి చూపు ఉంది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బైపోల్ ఇప్పట్లో ఉండదని కేంద్రం ఎన్నికల సంఘం శనివారం స్పష్టం చేసింది. పండుగల సీజన్ ముగిసిన తర్వాతే ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో నిన్న మొన్నటి వరకు వాడీవేడిగా ప్రచారాలు నిర్వహించిన ఆయా పార్టీల లీడర్ల ఒక్కసారిగా డీలా పడ్డారు. ఇంకా మూడు నెలల పాటు జనంలో ఎన్నిక వేడిని ఎలా కొనసాగించాలి దేవుడా అని తలలు పట్టుకుంటున్నారు. కమిషన్ నిర్ణయం ముఖ్యంగా బీజేపీ లీడర్ ఈటల రాజేందర్‌ను ఇబ్బంది పట్టేలా కనిపిస్తుంది. నియోజకవర్గం చేజారకుండా కాపాడుకునేందుకు ఆయనకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇక టీఆర్ఎస్ ఈ అవకాశాన్ని వాడుకుని హుజూరాబాద్‌లో మరింత పట్టుపెంచుకోవాలని చూస్తోంది. ఇక పార్టీ గెలుపోటముల లెక్కలు ఎలా జనం మాత్రం ఎన్నికల వాయిదాపై సంబురంగా ఉన్నారు. ఇక మూడు నెలలు రోజూ దసరానే అని మురిసిపోతున్నారు.
ఈటల రాజీనామా తర్వాత హుజూరాబాద్‌పై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేశారు. ఎలాగైనా బైపోల్లో ఈటలను ఓడించాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి స్పెషల్ నిధులు కేటాయిస్తూ పనులు చేయిస్తున్నారు. పాత పథకాలను పరుగులు పెట్టిస్తూనే.. కొత్త వాటికి రూపకల్పన చేస్తున్నారు. ఈ క్రమంలోనే దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నా.. కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఉప ఎన్నిక వాయిదాతో ఆ వేగం అలాగే సాగుతుందా.. లేదా అనేది చూడాలి మరి..!
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)