BB highlights : బిగ్‌బాస్-5 @ సెప్టెంబర్ 7 ఎపిసోడ్ హైలైట్స్
మంగళవారం నాటి బిగ్‌బాస్ షో ప్రారంభంలోనే తాను ట్రాన్స్‌జెండర్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ఆ తర్వాత తాను పడ్డ బాధల గురించి అర్ధరాత్రి పూట ప్రియాంక సింగ్ తోటి హౌస్‌మేట్స్‌కు చెప్పింది. ప్రియాంక మాటలు విన్న పలువురు చలించిపోయారు. ఆ తర్వాత తెల్లారడంతో నేను లోకల్ సినిమా నుంచి సైడ్ ప్లీజ్ అంటూ పాటను బిగ్‌బాస్ వేశాడు. దానికి అందరూ డ్యాన్స్ వేశారు. అయితే కిచెన్‌లో ఉన్న ఉమాదేవి.. కూరగాయలు తరుగుతానని చెప్పిన మగవాళ్లు జిమ్‌లలో కూర్చుని ఏ పని చేయడం లేదని చిరాకుపడుతుంది.
ఆ తర్వాత చాలామంది టాయ్లెట్లో బట్టలు ఆరేస్తుండటంతో లోబో ఇంటి సభ్యులందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఈసారి టాయ్లెట్ల దగ్గర డ్రాయర్లు, బనియన్లు ఆరేస్తే చింపేస్తానని హెచ్చరిస్తాడు. అనంతరం ఈ సీజన్లోనే కొత్తగా బిగ్‌బాస్ పవర్ హౌస్‌ను పరిచయం చేశాడు. ఈ రూంలోకి వెళ్లేందుకు పవర్ స్కాన్‌పై చేయి పెట్టి ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి అదనపు శక్తి లభిస్తుందని చెప్తాడు. అందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ‘శక్తి చూపరా డింభకా’ను ప్రవేశపెట్టాడు. ఈ పవర్రూంలోకి తొలిసారి విశ్వ వెళ్లాడు.
విశ్వకు బిగ్‌బాస్ ఓ టాస్క్ అప్పగించాడు. ఇద్దరు ఇంటిసభ్యులు వారి ఒంటి మీదున్న దుస్తులతో సహా అన్ని బట్టలు, వస్తువులను స్టోర్‌రూమ్‌కు పంపించాలని, అయితే ఆ ఇద్దరూ వారి స్వంత బట్టలు కాకుండా ఒకరి దుస్తులను మరొకరు ధరించవచ్చని మెలిక పెట్టాడు. దీంతో విశ్వ యాంకర్ రవి, ప్రియ పేర్లను ఎంచుకున్నాడు. ఈ మేరకు ఆ ఇద్దరూ తమ బట్టలను స్టోర్ రూంకు పంపించేశారు. అనంతరం ప్రియ బట్టలను రవి, రవి బట్టలను ప్రియ వేసుకున్నారు. లేడీ గెటప్‌లో ఉన్న రవిని చూసి విశ్వ తన తమ్ముడిని గుర్తుకుతెచ్చుకుని ఏడుస్తాడు. గత ఏడాది తన తమ్ముడిని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనవుతాడు.
మంగళవారం నాటి ఎపిసోడ్లో కొన్ని ఘటనల కారణంగా ఆర్జే కాజల్-లహరి, అనీ మాస్టర్-జెస్సీ మధ్య వాగ్వాదం జరిగింది. కిచెన్‌లో పనులను షేర్ చేసుకుందామని కాజల్ అందరినీ పిలిచి హడావుడి చేస్తుండగా.. ఎందుకంత హైపర్ అవుతున్నారని లహరి ప్రశ్నించింది. నార్మల్‌గా మాట్లాడండి, అంతే తప్ప కంటెంట్ క్రియేట్ చేయాలని చూడొద్దని కాజల్‌కు సూచించింది. చాలా హైడ్రామా చేస్తున్నారని చురకలంటించింది. దీంతో కాజల్ ఆమెకు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చి ఏడ్చేసింది. దీంతో హౌస్ హీటెక్కింది. మరోవైపు ఓ కుర్చీ కోసం అనీ మాస్టర్, జెస్సీ మధ్య గొడవ జరిగింది. అనంతరం జెస్సీ క్షమాపణ చెప్పడంతో ఆ గొడవ సద్దుమణిగింది. అటు సిరి, లోబో మధ్య మాటల యుద్ధం జరగ్గా తర్వాత అది ఫన్ కోసమే తేలిపోయింది.