bigg boss lobo : లోబో ఎవరు? అతడి అసలు పేరేంటి?
బిగ్‌బాస్ ఐదో సీజన్లో కమెడియన్ లోబో హౌస్‌లోకి అడుగుపెట్టాడు. చిత్ర వేషధారణలో విచిత్రంగా కనిపిస్తున్న అతడి నేపథ్యం గురించి చాలా మందికి తెలియదు. దీంతో చాలా మంది నెటిజన్లు అతడి గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం ప్రారంభించారు. అయితే మాటీవీ మెట్ల దగ్గర కూర్చుని వెయిట్ చేసీ చేసి ఒకానొక సమయంలో మా మ్యూజిక్ ఛానల్లో యాంకర్ పోస్టు కొట్టేసినట్లు కర్టన్ రైజర్ ఎపిసోడ్లో లోబోనే స్వయంగా వెల్లడించాడు. మా మ్యూజిక్ ఛానల్లో అచ్చం హైదరాబాదీ భాష మాట్లాడుతూ యాంకరింగ్ చేసి లోబో మార్కులు కొట్టేశాడు. అయితే లోబో అనే పేరు వెనుక చిన్నపాటి స్టోరీనే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లోబో అసలు పేరు మహమ్మద్ ఖయ్యూం. స్కూలులో చదివే సమయంలో అతడు ఓ దొంగతనం చేశాడు. అయితే దొంగతనం చేసిన అతడు దొరికిపోయాడు. దీంతో తొమ్మిదే తరగతికే స్కూల్ యాజమాన్యం అతడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించేసింది. ఈ మేరకు మధ్యలోనే ఖయ్యూం తన చదువును ఆపేశాడు. ఖయ్యూంకు హీరోయిన్ కాజల్ అంటే ఎంతో ఇష్టం. ఆమెను కలవడం కోసం ఒకప్పుడు ముంబైకి వెళ్లాలని భాలవించాడు. అయితే ఆ సమయంలో ఖయ్యూం దగ్గర డబ్బులు లేవు. దీంతో ఇంట్లో కొంత డబ్బును చోరీ చేసి మరీ ముంబై వెళ్లాడు. ముంబై వెళ్లిన అతడు కాజల్‌ను మాత్రం కలవలేకపోయాడు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. అనంతరం కొందరి సహాయంతో ముంబై నుంచి గోవా వెళ్లాడు. గోవాలో టాటూలు వేయడం నేర్చుకున్నాడు. తర్వాత హైదరాబాద్ చేరుకుని ఓ టాటూ షాపులో పనిచేశాడు. అక్కడ ఓ రష్యన్ యువతికి తొలి టాటూ వేశాడు. లోబో కట్టుబొట్టు అంతా విచిత్రంగా ఉండడంతో ఆ యువతి ఖయ్యూంకు లోబో అనే పేరు పెట్టేసింది. దీంతో అప్పటినుంచి మహమ్మద్ ఖయ్యూం కాస్త లోబోగా మారిపోయాడు. ప్రస్తుతం లోబో వయసు 39 ఏళ్లు. బిగ్‌బాస్‌తో పాపులారిటీ సంపాదించాలని హౌస్‌లో అడుగుపెట్టిన అతడు ఎక్కడి వరకు తన ప్రయాణాన్ని తీసుకువెళ్తాడో వేచి చూడాలి.