koushik reddy : అయ్యో.. కౌశిక్‌రెడ్డి.. ఎంతపనాయే..!
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక ఓ రాజకీయ నేతకు వరంగా మారింది. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా, ప్రజలను ఓట్లు అడగకుండా ఓ మంచి పదవి వస్తే ఎవరు కాదంటారు చెప్పండి. టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డికి అలాంటి బంపర్ ఆఫరే వచ్చింది. ప్రత్యర్థులను తిడుతూ లీడర్‌గా నిత్యం మీడియాలో కనిపిస్తూ ప్రొజెక్ట్ కావడంతో టీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ కౌశిక్‌రెడ్డిని అందలం ఎక్కించారు. ఈ మేరకు నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కౌశిక్‌రెడ్డికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కౌశిక్‌రెడ్డిని (koushik reddy ) నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైలుపై గవర్నర్ ఇంకా సంతకం చేయలేదు. ఈ విషయాన్ని స్వయంగా గవర్నర్ తమిళిసై మీడియాకు వెల్లడించారు.
తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తన విధి నిర్వహణ అనుభవాలపై రూపొందించిన ‘ప్రజల్లో ఒకరు’ పుస్తకాన్ని బుధవారం నాడు తమిళిసై రాజ్‌భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పలు ప్రశ్నలు వేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వం ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని తెలిపారు. కౌశిక్‌రెడ్డిని సామాజిక సేవల విభాగం కింద ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ సిఫారసు చేసిందని తెలిపారు. అయితే కౌశిక్‌రెడ్డి ఆ కేటగిరీకి సరిపోతారా? లేదా? అన్న విషయం పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ అంశంపై తాను పరిశీలన చేసిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ స్పష్టం చేశారు. గతంలో ముగ్గురిని నామినేటెడ్ కోటాలో ప్రభుత్వం సిఫారసు చేయగా తాను వెంటనే ఆమోదించానని.. అయితే వారు కళలు, సామాజిక సేవల విభాగంలో ఉన్నందున ఆమోదం తెలిపినట్లు గవర్నర్ వివరించారు.