ఆయనో సాదాసీదా జర్నలిస్ట్.. సరిగ్గా రెండేళ్ల కింద కరోనా కష్టకాలం.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్న సమయం.. ‘ఉద్యోగం వద్దు.. సొంత పనే ముద్దు’ అన్న నిర్ణయానికి వచ్చాడు. కానీ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు వ్యవసాయం తప్ప వేరే పనులు తెలియవు. తనకు తెలిసిన పనిలో కొత్త పందాను ఎంచుకున్నాడు. అక్షర సేద్యానికి శ్రీకారం చుట్టాడు. రైతులకు తెలుగులో వ్యవసాయ సమాచారం అందిస్తూ ‘రైతు బడి’ పేరుతో ఎంతో మందికి ఓనామాలు దిద్దిస్తున్నాడు. ఆగ్రిక్చర్ జర్నలిస్ట్ గా అందిరీకీ ఆదర్శంగా నిలుస్తున్న ఆయన సక్సెస్ స్టోరీ.. ఈ సంక్రాంతి వేళ మన చౌరాస్తాలో…
జూలకంటి రాజేందర్‌రెడ్డి.. నల్లగొండ జిల్లా మాడ్గుపల్లి మండలం మాచనపల్లి వాసి. బీఎస్సీ డిగ్రీ, ఎంఏ తెలుగు, ఎంసీజే కంప్లీట్ చేసిన ఆయన 2008 జూన్‌లో ఈనాడు జర్నలిజం స్కూల్‌కు ఎంపికై జర్నలిజం వృత్తిలోకి అడుగు పెట్టాడు. అయితే ఈనాడులో బాండ్ ఇవ్వాలన్న నిబంధన తప్పనిసరి కావడంతో నెలరోజుల శిక్షణ తర్వాత అది నచ్చక రాజేందర్ బయటకు వచ్చేశాడు. అదే ఏడాది డిసెంబర్లో మహా న్యూస్ టీవీ చానల్ ట్రైనీ జర్నలిస్టుగా చేరాడు. ఏడాది కాలంపాటు డెస్క్ లో కాపీ ఎడిటర్‌గా కొనసాగారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా స్టాఫర్‌గా వెళ్లి రెండేళ్లపాటు అదే చానల్లో పనిచేశాడు. అనంతరం తన సొంత జిల్లా నల్లగొండకు వచ్చాడు. కొంతకాలం పాటు స్టూడియో ఎన్ జిల్లా స్టాఫర్‌గా పనిచేసి, టీవీ 5లో చేరి రెండేళ్లపాటు ఇదే జిల్లాలో కొనసాగారు రాజేందర్‌రెడ్డి. 2014లో నమస్తే తెలంగాణ నల్లగొండ జిల్లా బ్యూరో ఇన్చార్జిగా చేరి దాదాపు ఆరేళ్లపాటు పనిచేశాడు.
ఉత్తమ జర్నలిస్టు పురస్కారం…
నమస్తే తెలంగాణ నల్లగొండ జిల్లా బ్యూరో ఇన్చార్జిగా కొనసాగిన సమయంలోనే 2016లో నల్లగొండ జిల్లా పేజీలో ‘ఈ వారం – యవ్వారం’ శీర్షికన గడుసు గౌరయ్య, దురుసు దుర్గయ్య అనే రెండు పాత్రలతో తెలంగాణ యాసలో ఓ కాలమ్ రాశాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక సందర్భంగా ఈ కాలమ్ రాసిన రాజేందర్‌ను ఉత్తమ జర్నలిస్టు పురస్కారం వరించింది. ప్రతాపరుద్రుడి తర్వాత కాకతీయ రాజులకు సంబంధించిన చారిత్రక ఆధారాలుగానీ, వారి స్థిర నివాసానికీ సంబంధించిన వివరాలేవీ దాదాపు బయటి ప్రపంచానికి తెలియవనే చెప్పొచ్చు. ఆ దిశగా చారిత్రక పరిశోధనలూ జరిగిన దాఖలాలు లేవు. రాజేందర్ ఖమ్మం జిల్లా మహా న్యూస్ జిల్లా స్టాఫర్‌గా కొనసాగిన కాలంలో ‘ఓరుగల్లు కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారు..’ అంటూ ఓ కథనాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో కాకతీయులు ఉన్నారని, ఆ వివరాలతో చేసిన కథనం అప్పట్లో ఓ సంచలనమే..
టాప్ 100 స్థానం…
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. దేశమంతా లాక్డౌన్.. ఉద్యోగాలు ఉంటాయో లేదో.. ఉపాధి దొరుకుతుందో లేదో అనుమానాలు.. పన్నెండేళ్లపాటు తనను పోషించిన జర్నలిస్టు ఉద్యోగాన్ని వదులుకోవాలనుకున్నాడు రాజేందర్. తాను ఒకరి చేతికిందనో, ఓ సంస్థలోనో ఎక్కువ కాలం కొనసాగలేనని నిర్ణయానికి వచ్చాడు. అలా తనకు పట్టుకున్న వ్యవసాయంపై అక్షర సేద్యానికి రెడీ అయ్యాడు. 2020 జూన్‌లో ‘తెలుగు రైతు బడి’ పేరిట యూ ట్యూబ్ చానల్‌కు శ్రీకారం చుట్టాడు. అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ చూరగొన్నారు. అతి తక్కువ సమయంలో ఒక మిలియన్ ఫాలోవర్ల సంఖ్యను చేరుకుంది రాజేందర్‌రెడ్డి రైతు బడి. ఇప్పటి వరకు తెలుగులో వ్యవసాయ సమాచారం అందిస్తున్న సంస్థలలో అందరికంటే ముందుగా ఉన్నాడు. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా పలు వీడియోలతో రైతులకు సమాచారం అందిస్తూ దూసుకుపోతున్నాడు.
యూట్యూబ్ 6.8 లక్షల మంది, ఫేస్ బుక్ 2.3 లక్షలు, ఇన్స్టాగ్రామ్ 1.2 లక్షల మంది ఫాలోవర్స్ తో రాజేందర్‌రెడ్డి ‘రైతు బడి’ కొనసాగుతోంది. ఇక మనోడు పెట్టిన వీడియోలు, పోస్టులు ఇప్పటికే 35 కోట్లకు పైగా వ్యూవర్స్ ఉన్నారంటే.. మామూలు విషయం కాదు. అందుకు ఇటీవల ‘టాప్ తెలుగు 100 యూట్యూబర్స్’ లో కూడా రాజేందర్‌రెడ్డికి స్థానం దక్కింది.
కష్టనష్టాలు కామనే…
ఉద్యోగం మానేసి.. సొంత పని మొదలుపెట్టినప్పుడు కష్టనష్టాలు కామన్ గా ఎదురవుతాయి. కానీ రాజేందర్ విషయంలో పని మొదలు పెట్టిన మొదటి నెల నుంచే విజయవంతంగా ముందుకు సాగింది. ఇందుకు ఉద్యోగంలో ఉన్న నాటి నుంచే చేసిన అనేక ప్రత్యామ్నాయ ప్రయత్నాల అనుభవం ఉపయోగపడింది. రైతు బడి చానెల్లో వీడియోల సేకరణ కోసం వివిధ సందర్భాల్లో మాత్రం అనేక ఇబ్బందులు తప్పలేదు. కోట్లాది మంది వీడియోలు చూస్తున్నా.. వేలాది మంది మీ వీడియోలతో ఎంతో నేర్చుకుంటున్నామని చెబున్నా.. తమ అనుభవం చెప్పడానికి మాత్రం తటపటాయించండం ఇబ్బంది పెట్టే అంశం. చాలా సార్లు దూర ప్రాంతాలకు వెళ్లి కూడా నిరాశగా వెనుతిరిగి రావాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు సమయానికి భోజనం లేకపోవడం.. ఇంటిని వదిలి వందల కిలోమీటర్లు రోజుల తరబడి ప్రయాణాలు చేయడం.. వంటి కష్టాలు ఎన్నో ఉన్నా రైతు బడి ప్రయాణాన్ని మాత్రం ఆపలేకపోయాయి.
తెలుగులో రైతుల కోసం సమాచారం పంచుతున్న వేదికల్లో అతి పెద్ద వేదికగా తెలుగు రైతు బడి నిలిచిందంటే.. అందుకు వందల మంది రైతుల సహకారం, లక్షల మంది రైతుల ప్రోత్సాహం, పదుల సంఖ్యలో సన్నిహితుల తోడ్పాటు, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని చెబుతారు రాజేందర్‌రెడ్డి. గతంలో ఉద్యోగం చేసినప్పటి సంపాధన కంటే ప్రస్తుతం రెట్టింపు డబ్బులు సంపాధిస్తున్నా.. అందులో సగానికి పైగా ప్రయాణం, షూటింగ్, ఎడిటింగ్ వంటి ఖర్చుల కోసమే కేటాయిస్తున్నారు. ఇప్పటికే అతిపెద్ద తెలుగు డిజిటల్ రైతు వేదికగా ఎదిగిన రైతు బడి మున్ముందు తనతోపాటు రైతు లోకానికి సైతం మరిన్ని ఫలాలు అందిస్తుందన్న అచంచల విశ్వాసంతోనే ముందుకు సాగుతున్నారు. రైతుల కోసం రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ పరికరాల ఎగ్జిబిషన్లు, వెబ్ సైట్, డిజిటల్ మ్యాగజైన్, రైతు సదస్సుల నిర్వహణ వంటి కార్యక్రమాలను సైతం మున్ముందు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు రాజేందర్. తనలాగా ఎవరైనా మిత్రులు యూట్యూబ్ వంటి డిజిటల్ మీడియాలోకి రావాలి అనుకుంటే.. అందులో అపారమైన అవకాశాలు ఉన్నాయని.. కాకపోతే వాటిని అందిపుచ్చుకునే నైపుణ్యం, సమాజానికి తోడ్పడే అంశంతో వస్తే జర్నలిస్టులు ఈ రంగంలో రాణించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ముగింపు…
రాజేందర్రెడ్డిగారు.. 2014 నుంచి దాదాపు ఆరేళ్లు నమస్తే తెలంగాణలో నల్లగొండ బ్యూరోగా పని చేశారు. నేను 2016 లో సాక్షిలో నల్లగొండ సబ్ ఎడిటర్‌గా పనిచేసేశాను. ఆ టైంలోనే రెండు మూడు సార్లు కలిశాను. అప్పట్లో అంత పెద్దగా పరిచయం లేకున్నా.. మంచి మాటకారి.. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ‘చౌరాస్తా’ ఇంటర్వ్యూ కోసం ఆయనను పలకరించినప్పుడు.. నమస్తే రాజేందర్ అన్నే కదా అన్నాను.. అంతే.. ఒక్కసారిగా నవ్వి ‘సంస్థల పేర్లే మన ఇంటి పేర్లా.. అన్నా మన సొంత పేరు సంస్థగా మారాలే..’ అంటూ చమత్కరించారు. అవును నిజమే ఓ జర్నలిస్ట్ ఎందులో పనిచేస్తే దానినే చెప్పుకుని ముందు సాగుతుంటాం.. ఒకప్పుడు రాజేందర్‌రెడ్డి గారిని కూడా.. మహా టీవీ రాజేందర్, టీవీ5 రాజేందర్, నమస్తే తెలంగాణ రాజేందర్ అనే వాళ్లు.. కానీ ఇప్పుడు తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఏదీ ఏమైనా రాజేందర్ అన్న ‘రైతు బడి’ రాబోయే యువ రైతులకు ఓ గుడి కావాలని ఆశిస్తూ…
ఇక సెలవు.. మరో మిత్రుడి కథతో మీ ముందుకు వస్తా…
– మీ ఉప్పలంచి నరేందర్, సీనియర్ డెస్క్ జర్నలిస్ట్
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన
చాలా బాగుంది నరేందర్.. రాజేందర్ రెడ్డి గారి రీల్స్ రెగ్యులర్ గా చూస్తుంటా. పూర్తి వివరాలు నీ చౌరస్తా ద్వారా తెలుసుకున్న.