- ముప్పుతిప్పలు పడుతున్న ‘ముత్తిరెడ్డి’
- స్థానిక లీడర్ల మద్దతు కోసం ‘పల్లా’ పాట్లు
- చాపకింద నీరులా సాగుతున్న ‘పోచంపల్లి’
జనగామ ఎమ్మెల్యే టికెట్ కోసం బీఆర్ఎస్లో లాబింగ్‌లు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉందని సర్వే ద్వారా తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఈ సారి కొత్త వారి కోసం చాన్స్ ఇచ్చేందుకు చూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ 40 మంది లిస్టులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేరు ఉన్నట్టు తెలిసింది. దీంతో జనరల్ సీటైన జనగామపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కళ్లు పడ్డట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ బలాన్ని చూపుతూ సీఎం కేసీఆర్ వద్ద లాబింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
ముత్తిరెడ్డి.. ముప్పతిప్పలు..
ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యేందుకు ముప్పతిప్పలు పడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిపై భూకబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత కూతురే ఆయనపై కేసులు పెట్టడం, ప్రజల ముందు నిలదీయడం ఎమ్మెల్యేకు పెద్ద దెబ్బ పడినట్టు అయ్యింది. బిడ్డ ప్రత్యేక్ష దాడులను తట్టుకోలేక ఏకంగా ముత్తిరెడ్డి కోర్టులకు వెళ్లారంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ‘ఈ సారి నిలిచేది నేనే.. గెలిచేది నేనే’ అంటూ పైకి గంబీరాలు పలుకుతున్న ముత్తిరెడ్డికి అసలు టికెట్ వస్తుందా అని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
లీడర్ల మద్దతు కోసం ‘పల్లా’ పాట్లు..
ఇక జనరల్ సీటైన జనగామపై మరో గులాబీ లీడర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన పావులు కదుపుతున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల లీడర్లను ప్రసన్నం చేసుకునేందుకు పల్లా పడరాని పాట్లు పడుతున్నట్టు తెలిసింది. ‘పల్లా’ జనగామలో తనకు బలం ఉందని సీఎం కేసీఆర్‌కు చూపేందుకు ఆపసోపాలు పడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కొందరు జడ్పీటీసీలతో మాట్లాడించారని తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా జిల్లాలోని కొందరు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను తనకు మద్దతు తెలుపుతున్నట్టు వారి లెటర్ ప్యాడ్లపై రాసి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే చాలా మంది పల్లా కోరికపై విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నపై ‘చావుతప్పి కన్నులొట్ట పడిన’ చందంగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామలో అంత పట్టులేదని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కోరికను సున్నితంగా తిరస్కరించారని సమాచారం.
సైలెంట్‌గా అడుగులేస్తున్న ‘పోచంపల్లి’
జనగామ టికెట్ ఆశిస్తున్న మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చాపకింద నీరులా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్ల మద్దతు కూడ గట్టుకున్న పోచంపల్లి తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. ముత్తిరెడ్డిపై వ్యతిరేకత ఉన్న బీఆర్ఎస్ లీడర్లంతా పోచంపల్లికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్‌రెడ్డి జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకుంటూ పోచంపల్లి ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మరో రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ ప్రకటించనున్న మొదటి లిస్ట్‌లో జనగామ పేరు ఉంటుందా..! ఉంటే ఈ ముగ్గురి లాబింగ్లలో ఎవరు విజయం సాధించారనేది తెలుస్తుంది.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)