- క్రిస్మస్ వేడుకల్లో ప్రోటోకాల్ రగడ
- అధికారుల తీరుపై ఎమ్మెల్యే పల్లా మండిపాటు
- చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు
- కలెక్టర్ చాంబర్లో వాగ్వాదం
- పోలీసుల రంగప్రవేశంలో పరిస్థితి అదుపులోకి..
చౌరాస్తా ప్రతినిధి, జనగామ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో ప్రోటోకాల్ రగడ మొదలైంది. ఫలితంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాల్సి పండుగలో పంచాయితీ షురూవైంది. అయితే నేతలు ఎవరికి వారు పట్టు సాధించే క్రమంలో అధికారులు సమిధలు అవుతున్నారా..? లేదా అధికారులే కావాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేను పలచన చేస్తున్నారా..? అనేది తెలియడం లేదు. కానీ, అధికారులు, ప్రజాప్రతినిధులు తీరుతో మాత్రం పేదలకు దక్కాల్సిన క్రిస్మస్ గిఫ్టులు పక్కదారి పట్టినట్టుగా తెలుస్తోంది. అయితే శనివారం ప్రోటోకాల్ నిబంధనలు పాటించని ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కలెక్టర్ చాంబర్లో శివమెత్తడం సర్వత్రా చర్చకు దారితీసింది.
అసలు కథ ఇదీ..
ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జనగామలోని గాయత్రి గార్డెన్, ఎస్ఆర్ గార్డెన్లో సెలబ్రేషన్స్ కోసం అధికారులు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే గాయత్రి గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరుకానున్నారని ఒక రోజు ముందు నుంచే ప్రచారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఆమె హాజరుకాకపోవడంతో దీంతో ప్రోగ్రామ్ ఇన్చార్జిగా ఉన్న డీఆర్డీఏ పీడీ మొగిలప్ప, సీపీవో ఇస్మాయిల్‌లు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పీసీసీ మెంబర్ చెంచారపు శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ లీడర్లతో జిల్లా కేంద్రంలో పాస్టర్లతో ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ గిఫ్టులను పంపణీ చేశారు. దీంతో అసలు పంచాయితీ మొదలైంది. ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కాదని కాంగ్రెస్ లీడర్లతో ఏలా చేస్తారని బీఆర్ఎస్ లీడర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎలాంటి పదవి లేని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఫొటో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్ చాంబర్లో లొల్లి లొల్లి..!
మరో వైపు క్రిస్మస్ గిఫ్టుల పంపిణీలో ప్రొటోకాల్ పాటించడం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కలెక్టర్ చాంబర్లో నిరసన చేపట్టారు. తనకు ఆహ్వానం పంపించి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో మరో చోట పంపిణీ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ ఆగ్రహం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతతో గిఫ్టులు పంపిణీ చేసేలా ఆదేశాలు ఉంటే చూపించాలంటూ కలెక్టర్‌ను నిలదీశారు. దాదాపు అరగంట సేపు కలెక్టర్ వర్సెస్ పల్లా వార్ కొనసాగించారు. పల్లా వెంట స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున చాంబర్లో చొచ్చుకు వెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పల్లా, ఏపీసీ దేవేందర్‌రెడ్డి మధ్యలో కూడా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఎట్టకేలకు కలెక్టర్ శివలింగయ్యతో కలిసి ఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.