- ఆయన విధానాలు అనుసరణీయం
- జడ్పీ మీటింగ్‌లో ప్రముఖుల నివాళి
- కంటతడి పెట్టిన వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి
జనగామ, చౌరాస్తా : దివంగత జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి ఆదర్శప్రాయుడని, ఆయన విధానాలు అందరికీ అనుసరణీయని జిల్లా పరిషత్ మీటింగ్ హాజరైన ప్రముఖులు అన్నారు. శనివారం జరిగిన జనగామ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వైస్ చైర్పర్సన్ గింగరబోయిన భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిలుగా జనగామ, పాలకుర్తి ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్మార్ పింకేశ్ కుమార్ హాజరయ్యారు. ముందుగా పాగాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జడ్పీ చైర్మన్ మృతికి సంతాపంగా సభను వాయిదా వేశారు. అయితే మిటింగ్లో పాగాల గురించి మాట్లాడుతూ వైస్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. తను ఎప్పుడు మీటింగ్ వచ్చినా.. ‘అక్కా బచ్చన్నపేట నుంచి ఎలా వచ్చావ్.. బస్సులోనా.. ఉండు కారు పంపుతా..’ అంటూ పంపే వారని ఆయనను గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో అనిల్‌కుమార్, ఎంపీపీ మేకల కలింగరాజు, జడ్పీటీసీలు గుడి వంశీధర్‌రెడ్డి, దీపీక, బొల్లం అజయ్, ఇల్లందుల బేబీ, పుస్కూరి శ్రీనివాసరావు, శ్రీనివాస్ నాయక్, పద్మజా వెంటకట్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంపతన్న ఆశయాలు కొనసాగిద్దాం..
పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
సంపత్ రెడ్డి మరణం తీరనిలోటు. నేను సంపతన్న మొదటి మీటింగ్ అప్పుడు ఎమ్మెల్సీగా ఇక్కడికి వచ్చిన. మళ్లీ తర్వాత ఇప్పుడు రెండో సారి ఇలా వచ్చి మాట్లాడడం నాకు బాధాకరం. ఆయన 23 ఏళ్లు ఒకే పార్టీని నమ్ముకుని పనిచేశారు. ఆయనకు ఎన్ని సమస్యలు ఉన్నా అప్యాయంగా మాట్లాడుతూ అందరితో కలిసిపోయేవారు. రాజకీయాల్లో ఆయనో ఆదర్శన నేత. ఆయన ఆశయాలు తప్పకుండా కొనసాగిద్దాం.
నా సొంత తమ్ముడిలా ఉండేది
ఎడవెల్లి కృష్ణారెడ్డి, జనగామ జిల్లా గ్రంథాల చైర్మన్
పాగాల సంపత్‌రెడ్డితో 21ఏళ్ల అనుబంధం ఉంది. మా ఇద్దరివి పక్కపక్క గ్రామాలు. ఉద్యమ సమయం నుంచి కలిసి పనిచేశాం. నన్ను అన్నా.. అన్నా.. అంటూ సొంత తమ్ముడిలా ఉండే వాడు. అసలు సంపత్‌రెడ్డి చనిపోయాడంటే నమ్మశక్యంగా లేదు. ఏదో పక్క నుంచి ఈ జడ్పీ హాల్లోకి వస్తాడనే అని పిస్తుంది. పాగాల మరణం నిజంగా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.