- ఇక అభివృద్ధిలో పోటీ పడుదాం..
- జనగామను శాంతియుతంగా ఉంచుదాం..
- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- మున్సిపల్ ఎక్స్‌అఫియో మెంబర్‌గా ప్రమాణ స్వీకారం
చౌరాస్తా ప్రతినిధి, జనగామ :ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని తర్వాత ఏ పార్టీ వారైనా సరే అభివృద్ధి కోసం పోటీ పడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ మున్సిపాలిటీలో చైర్పర్సన్ పోకల జమున అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశానికి పల్లాతో పాటు స్థానిక సంస్థ అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా మున్సిపల్ కౌన్సిల్‌కు వచ్చిన ఆయన ముందుగా మున్సిపల్ ఎక్స్‌అఫీయో మెంబర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగామ పట్టణం గత 15 ఏళ్ల కిందకి ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందిందన్నారు. ఇంకా కొంత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. తాను గతంలో తన నిధుల నుంచి జనగామకు రూ.60 లక్షలు ఇచ్చానని గుర్తుచేశారు. జనగామ ప్రజలకు శాంతియుత వాతావరణం, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడడంతో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు శక్తివంచన లేకుంటా కృషి చేస్తానన్నారు. చీటకొడూరు రిజర్వాయర్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు చెప్పారు. అధికారులతో కలిసి రిజర్వాయర్‌ను పరిశీలిస్తానని పేర్కొన్నారు. ఇక పట్టణంలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉందని వీటిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు ప్లాన్ చేయాలని సూచించారు.
- ఇక్కడ అన్ని సదుపాయాలున్నాయ్అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్
జనగామ పట్టణం మంచి అభివృద్ధి చెందిన ప్రాంతమని, ఇక్కడ దాదాపు అన్ని సదుపాయాలు ఉన్నాయని అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. కొన్ని వార్డుల్లో చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాటిని సాధ్యమైనంత త్వరగా రెండు, మూడు నెలల్లో పూర్తి చేయిస్తాని చెప్పారు.
- చెత్తపై లొల్లి..
ఇక మున్సిపల్ సమావేశంలో మొత్తం 5 అంశాలు, రెండు టేబుల్ జండాలను ఇన్చార్జి కమిషనర్ చంద్రమౌళి ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే సభ ప్రారంభం కాగానే కొందరు కౌన్సిలర్లు సమస్యలను ఏకరు పెట్టగా ఎమ్మెల్యే పల్లా ఇది తొలి సమావేశమే అని, పూర్తి రివ్యూ కోసం మరోసారి మీటింగ్ పెట్టుకుందామని పేర్కొన్నారు. ఆ తర్వాత తమ వార్డులో చెత్త తీసుకుపోవడంలేదని 15వ వార్డు కౌన్సిలర్ పాండు కౌన్సిల్ పోడియం ముందు బైఠాయించడంతో చైర్పర్సన్ జమున సమస్యను పరిష్కరిస్తామని ఆయన సర్ధి చెప్పారు. సమావేశంలో వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, మున్సిపల్ ఇంజినీర్ మహిపాల్, కౌన్సిలర్లు, కోఆప్షన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.