salient : ఎండీ.ఖలీల్ పాష.. పాలమూరు డెస్క్ జర్నలిస్టు. సాక్షి జర్నలిజంలో నా బ్యాచ్మెంట్. ఆయన మాతృ భాష ఉర్దూ అయినా.. తెలుగంటే ఆయనకు మక్కువ ఎక్కువ. ఆ ఇష్టమే ఖలీల్‌ను మీడియా వైపు అడుగు వేయించింది. ఎంతో ఇష్టంతో ఈ ఫీల్డ్ కు వచ్చిన ఆయన పదేళ్ల పాటు తన సేవలందించారు. వృత్తిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సంస్థ మారకుండా ఎంతో నిబద్ధతతో పని చేశారు. కానీ, పనిలో ఆయనకు లభించిన గుర్తింపు అంతంతే.. ఎదుగుబొదుకు లేని ఈ ఉద్యోగాన్ని ఎంత కాలం చేయాలనుకుని చివరకు సైలెంట్‌గా సైడయ్యారు.. ఆయన అనుభవాలను పంచుకునేందుకు ఈ రోజు మన ముందుకొచ్చారు.
నమస్తే ఖలీల్ భాయ్.. ఎలా ఉన్నారు.
నమస్తే నరేందర్ అన్న. చాలా బాగున్నా.
నయా రూట్ ఎలా ఉంది?
బాగుంది అన్న. మనం రాసే ఎన్నో కథనాలు జనం జీవితాలను మార్చేస్తున్నాయి. కానీ జర్నలిస్టుల జీవితాలను మార్చలేక పోతున్నాయి. ఇక మన సమస్యల గురించి కూడా ఎక్కడ మాట్లాడలేం.. రాయలేం.. ప్రచురించలేం.. నువ్వు ప్రారంభించిన ఈ కొత్త తరహా సీరియల్ బాగుంది. మన గురించి.. మన అనుభవాల గురించి.. మన సాధకబాధకాల గురించి చెప్పే తీరు చాలా బాగా నచ్చింది. నీ ‘కొత్త దారిలో పాత మిత్రులు’ శీర్షికకు నన్నూ తీసుకున్నందుకు సంతోషంగా ఉంది.
మీ కుటుంబ నేపథ్యం..
మేం నలుగురం. ఇద్దరు చెల్లెళ్లు, ఒక అన్న. అన్న బెంగుళూరులో ఓ ప్రైవేట్ బ్యాంకులో ఆడిటర్‌గా పని చేస్తున్నారు. ఇద్దరి చెల్లెళ్ల పెళ్లిళ్లు అయిపోయాయి. నాన్న వృత్తి టైలరింగ్. అచ్చంపేట చుట్టుముట్టు ప్రాంతాల్లో రాయల్ టైలర్ అంటే ఎవరైనా గుర్తు పడతారు. గవర్నమెంట్ రికార్డుల్లో కేరాఫ్ రాయల్ టైలర్.. అనే ల్యాండ్ మార్క్ కూడా ఉంటుంది.
జర్నలిజం వైపు ఎలా ఆకర్షితులయ్యారు?
మాది నల్లమల అటవీ ప్రాంతం. మహబూబ్ నగర్ జిల్లా ఊరు అచ్చంపేట. ఒకప్పుడు మా ఊరు పేరు వింటేనే జనం జంకేవారు. కారణం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి. తరచూ మా ప్రాంతంలో నక్సలైట్లు, పోలీసులకు మధ్య కాల్పులు, ఎన్ కౌంటర్లు జరిగేవి. వాటిపై అప్పటి జర్నలిస్టులు ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు రాసేవారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గిరిజనులు, అమాయక యువకులు పడే కష్టాల గురించి, వారు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి నిర్భయంగా రాసేటోళ్లు. అది నాకు నచ్చి నేను కూడా జర్నలిస్టుగా మారాలని అనుకున్నా.
కొంచెం వివరంగా చెప్పరు..
నా డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఏదో ఉద్యోగంలో చేరాలనే ఆలోచన వచ్చింది. మా ఇంటి ఎదుట ఓ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గ్రామీణ పేద ప్రజలు, అడవి బిడ్డల (చెంచులు) అభివృద్ధిపై వివిధ కార్యక్రమాలు నిర్వహించే వారు. అక్కడ ఓ చిన్న ఉద్యోగంలో చేరాను. సమాజం గురించి అప్పుడప్పుడే అవగాహన వచ్చింది. రూరల్ డెవలప్మెంట్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చెంచుల జీవన మార్పు, తేనె సేకరణ, ఏజెన్సీ ప్రాంతంలో పౌష్టికాహారం పంపిణీ తదితర కార్యక్రమాలను నా మిత్రుడు నాగేశ్వరరావుతో కలిసి పనిచేసే వాడిని. అప్పుడు తరచూ మావోయిస్టులు తారసపడే వారు. ఈ విషయం తెలిసి మా అమ్మనాన్న భయపడి ఉద్యోగం మానేయాలని ఒత్తిడి తెచ్చేవారు. సంస్థ తరఫున చేసే కార్యక్రమాలకు సంబంధించి తెలుగులో డాక్యుమెంటరీ తయారు చేసే వాడిని. రోజు వారీ కార్యక్రమాల గురించి కంప్యూటర్లో తెలుగులో టైప్ చేసి ప్రెస్ నోట్ ఇవ్వడం మొదలు పెట్టాను. అచ్చంపేటలో అప్పుడప్పుడే పత్రికా కార్యాలయాలు వెలిశాయి. ఓ రోజు నేను రాసి ఇచ్చిన ప్రెస్ నోట్ చూసి వార్త విలేకరి శ్రీనివాస్ శర్మగారు మెచ్చుకున్నారు. ఆయన అంతటితో ఆగకుండా నాకు కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగ అవకాశం ఇప్పించారు. అలా నేను జర్నలిజం వైపు వచ్చాను.
డెస్క్ వైపు ఎలా వచ్చారు?
డెస్క్ జర్నలిస్టుగా మారాలంటే మాస్టర్ డిగ్రీ ( ఎం సీజే) తప్పనిసరి. షాద్ నగర్ ఆర్సీ సెంటర్లో ఆపరేటర్‌గా పని చేసే రఫీగారు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో అడ్మీషన్లు ప్రారంభమయ్యాయని సమాచారం ఇచ్చారు. ఇంకేముంది ఎంట్రెన్స్ రాసి 2008లో ప్రవేశం తీసుకుని 2010లో పూర్తి చేశాను. ‘చెంచుల స్థితిగతులు మీడియా పాత్ర’ అనే అంశంపై రచన జర్నలిజం ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరరావు గారి సహకారంతో అధ్యయనం చేశాను. కొన్ని రోజుల తర్వాత సాక్షి జర్నలిజం నోటిఫికేషన్ విడుదలైంది. నేను చేసిన అధ్యయనానికి సంబంధించిన వివరాలతో కథనం రాసి పంపించాను. సెలెక్ట్ అయ్యాను.
ఎన్నేళ్లు పని చేశారు?
సాక్షిలో సబ్ ఎడిటర్ (డెస్క్ జర్నలిస్టు)గా ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ కోసం ఉప్పల్‌కు పంపించారు. ఆ ట్రైనింగ్ ఓ కొత్త అనుభూతి. నువ్వు పరిచయం అయ్యింది కూడా అక్కడే కదా. (నవ్వుతూ..).. నిజంగా అదో కొత్త బంగారు లోకమే.. 15 రోజుల పాటు దాదాపు 150 మందిని (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి) ఒకే చోట ఉంచి శిక్షణ ఇచ్చారు. ఆ రోజులను నిజంగా మర్చిపోలేం. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని 2010 జూన్ 3న ఉద్యోగంలో చేరాను. సరిగ్గా పదేళ్లు పని చేసి 2020 జూన్4న రాజీనామా ఇచ్చాను. ఈ పదేళ్ల కాలంలో ఫీల్డ్ జర్నలిస్టుల సహకారంతో ఎన్నో కథనాలు రాయించాను. జోనల్ సబ్ ఎడిటర్ నుంచి జిల్లా డెస్క్ ఇంచార్జ్ వరకు ప్రయాణం సాగింది.
మాతృ భాష ఉర్దు కదా ఈ వృత్తిలో ఇబ్బంది పడ్డారా?
వాస్తవానికి మాతృ భాష ఉర్దూ అయినప్పటికీ తెలుగు మీద మమకారం ఎక్కువ. జర్నలిజం కోర్సు చేసే సమయంలో తెలుగుపై పట్టు సాధించాను. హై స్పీడ్ తెలుగు టైప్ చేసే వాడిని. చెప్పే వారు అలసి పోవాలి కానీ నా స్పీడు మాత్రం తగ్గేది కాదు. నా మాటలో కొంత తేడా అనిపించినా సిస్టం మీద కూర్చుంటే పదాల ఊట ఆగదు. నిజంగా అది నా అదృష్టమే.
సాక్షిలో మీ అనుభవాలు?
తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరుండి చూశాను. ఉద్యమంలో మంచి అవుట్ పుట్ ఇచ్చిన. ఉద్యమానికి నా వంతు సహకారం అందించా. రెండు పర్యాయాలు ఎలక్షన్లకు సంబంధించిన కథనాలను ఎడిషన్ ఇంచార్జ్ ప్లానింగ్‌లో అదిరిపోయే డిస్ప్లేలు అందించగలిగాను. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఎన్నిఎదురైనా డెస్క్ మిత్రులతో నవ్వుతూ గడపడం అలవాటైంది. చిన్ననాటి స్నేహితులను మరచి డెస్క్ మిత్రులతోనే ఎక్కువగా గడిపాను. వృత్తి పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. టీం వర్క్‌తో మధ్య పేజీకి, మొదటి పేజీకి ఎన్నో కదిలించే కథనాలు రాయించాను.
‘ఒక కథనం మాత్రం ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అచ్చంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఓ నిరుపేద కుటుంబం ఓ వింత వ్యాధితో ఇబ్బందులు పడుతుండేది. ఆ పేద తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం. ఒక్కొక్కరూ పెద్ద వాళ్లు అయ్యే కొద్ది (20 ఏళ్లు) కాళ్లు చేతులు పడిపోతున్నాయి. ఆ పిల్లల తల్లి ఎంతో ఓర్పుతో వారికి సపర్యలు చేసేది. కొన్నేళ్ల కిందట ఆమె చనిపోయింది. ఆ బాధ్యతను తండ్రి తన భుజాలపై వేసుకుని కూలీ నాలి చేస్తూ పిల్లలకు సపర్యలు చేస్తూ వచ్చేవాడు. పిల్లల బాధను తట్టుకోలేక తండ్రి కూడా ప్రాణాలు వదిలాడు. ఈ వార్త నన్ను కదిలించింది. అచ్చంపేట రూరల్ రిపోర్టర్ సాయంతో వివరాలు తెప్పించుకుని ‘కుమిలిపోయి కాటికి’ అనే శీర్షికన కథనం ప్రచురించాం. ఈ కథనం ఎంతో మందిని కదిలించింది. స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు వచ్చి వెంటనే వారిని ఆదుకున్నారు. అందరికీ వికలాంగ పెన్షన్ ను మంజూరు చేయించి వాళ్ల బాగోగులను చూసుకోవడానికి ఓ మనిషిని కేటాయించారు. జర్నలిస్టులు రాసే కథనాలు కొంత మంది జీవితాలను మార్చేస్తుంది.. అనడానికి ఇదో ఉదాహరణ..’
నా తోటి మిత్రులు సీహెచ్.హరిప్రసాద్, వెంకటయ్య, చక్రవర్తి, ప్రభులింగంతో కలిసి ఇచ్చిన ఎలక్షన్ కవరేజీ ఎప్పటికీ మర్చిపోను. ఇక కృష్ణా పుష్కరాల కవరేజీ ఓ అద్భుతం. ఎడిషన్ ఇంచార్జ్ దివంగత వెంకటేశ్వరరావు గారి సహకారంతో పోటీ పత్రికలకు దీటుగా ఇచ్చాం.
ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నరు?
ఏ ఉద్యోగమైనా కొన్నేళ్ల పాటు చేస్తే దాంట్లో భవిష్యత్తు ఉంటుంది. జీతమూ పెరుగుతుంది. కానీ నాకు డెస్క్‌లో అలాంటిదేమీ జరగలేదు. ఈ ఉద్యోగం ఉన్నతమైనదే.. ఎందుకో భవిష్యత్ కనిపించలేదు. నేను చేరినప్పటి నుంచి సుమారు 30 మంది వరకు ఉద్యోగాన్ని మానుకున్నారు. వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. ఈ వృత్తిలో కొత్తవారు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న వాళ్లే వృత్తిని నెట్టుకొస్తున్నారు. ఇక కరోనా వచ్చినప్పటి నుంచి పత్రికల్లో పని చేసే వారికి దినదిన గండంగా గడుస్తోంది. వయసు పెరిగిపోయి.. వేరే పని చేయలేక.. చేయరాక యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ వృత్తి నుంచి (salient) సైలెంట్‌గా సైడ్ అయిపోయాను.
ఈ పదేళ్ల కాలంలో నేను ఎవరి మనసు నొప్పించలేదు. మంచితనంతో పని చేశాను.. చేయించుకున్నాను.. అనే తృప్తి మిగిలింది. నేను సంస్థ నుంచి బయటకు వచ్చేటప్పుడు వారి ప్రేమానురాగాలను మూటకట్టుకునే వచ్చాను. డెస్క్ మిత్రులు, ఫీల్డ్ జర్నలిస్టులు బయట ఎక్కడ కలిసినా.. ‘ఖలీల్ భాయ్ ఆదాబ్’ అని పలకరిస్తారు. ఇది చాలు ఈ జీవితానికి..
ప్రస్తుతం ఏం చేస్తున్నరు?
ప్రస్తుతం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో డెవలప్మెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాను. ఉపాధి లేని వారికి, తక్కువ జీతంతో వివిధ వృత్తుల్లో పని చేస్తున్న వారికి ఎంపిక చేసి ‘ లైఫ్ మిత్ర’ గా అవకాశం కల్పిస్తున్నాను.
చివరగా ఫీల్డ్ లో ఉన్న వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా..?
ఒకే వృత్తి .. ఒకే జీతంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఏదైనా కారణంతో ఒక నెల జీతం ఆగిందా అంతే.. ఖర్చులన్నీ మీద పడతాయి. ఈఎంఐలు నిలిచిపోతాయి. సంసారంలో తీవ్ర గందరగోళం నెలకొంటుంది. అందుకే అందరికీ ఆప్షన్ A మరియు B రెండూ ఉండాలి. ఉద్యోగం చేసుకుంటూనే పార్ట్ టైం వ్యాపారమో.. మరో చిరు ఉద్యోగమో చేయాలి. మన జీవితం అలా రెండు పట్టాలపై నడిస్తేనే ప్రయాణం సాఫీగా సాగుతుందనేది నా అభిప్రాయం.
ఓకే ఫ్రెండ్స్ బైబై..
వచ్చే వారం మరో అలసిన మరో కలం యోధుడి కథతో మీ ముందుకొస్తా..
– ఉప్పలంచి నరేందర్, డెస్క్ జర్నలిస్ట్
nari16311@gmail.com
– మరిన్ని కథనాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.
https://manachourasta.com/
మిత్రమా నరేందర్..
మీ బ్లాగ్‌లో నేను చదివిన మొదటి కథనం ఇది. చాలాబాగా తీర్చిదిద్దారు. అభినందనలు.
మీ హెడ్డింగ్ చూసిన వెంటనే నాకు స్పందించాలని అనిపించింది. ఎందుకంటే ఖలీల్ గురించి చాలా విషయాలు నాకు గుర్తుకువచ్చాయి. డెస్క్ జర్నలిస్టుగా రాకముందు కూడా నాకు తెలుసు. కానీ ఏం రాశారో చదవాలని ఆగాను. ఈ వేదిక ద్వారా మరోసారి గుర్తుచేసుకునే అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్. ఖలీల్ ఇంకా ఎదగాలి, ఎక్కడున్నా బావుండాలి. గుడ్‌లక్.
– చక్రవర్తి, డెస్క్ జర్నలిస్ట్, మహబూబ్‌నగర్
Super sir
Super sir
This comment has been removed by the author.
This comment has been removed by the author.
This comment has been removed by the author.
ఖలీల్ గారికి నేను సాక్షి డెస్క్ సహవాసిని. డెస్క్ హైదరాబాదుకు తరలక ముందు తిరిగి వెనక్కొచ్చాకా మూడేళ్లు పనిచేశాను. చాలా మృదు స్వభావి. కఠినమైన విషయాన్ని మృదువుగా నవ్వుతూ చెప్పగల నేర్పరి. డెస్క్ లో తనకంటే పెద్ద వాళ్లతో అన్యోన్యంగా ఉండడం… ఆపద వేళల్లో తోడ్పాటునందించడం,
సమస్యలకు స్పందించడం వంటి సుగుణాలన్నీ ఆయన సొంతం.
సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి.
నాకు వయసును బట్టి గౌరవం, ప్రేమ పంచడంలో ఆయన ఎప్పుడూ విఫలం కాలేదు. కెరీర్ లో తను మరెంతో ఎదగుతాడు అనే నమ్మకం నాకుంది.
– వెంకట్ రెడ్డి, (డెస్క్ ఎక్స్ జర్నలిస్టు)
అధ్యాపకుడు.
❤️❤️❤️❤️
❤️❤️❤️❤️
All the best khaleel Garu
Tq
Tq anna
Super
Inspiring Story Khaleel Bhai. Nice. You have Bright Future. Keep it up