- ప్రైవేట్ ఫీజులను నోటీస్ బోర్డులో పెట్టాలి
- ఫీజుల నియంత్రన చట్టం అమలు చేయాలి
- ఎస్ఎప్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం
జనగామ, మన చౌరాస్తా : అనుమతిలేని స్కూళ్లపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసి బహిర్గతం చేయాలని ఎస్ఎప్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ ఏఓ రవీందర్‌కు ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ఫీజులను బహిర్గతం చేసి నోటీస్ బోర్డులో పెట్టాలని కోరుతూ వినతి ప్రతం అందజేశారు. అనంతరం ధర్మభిక్షం మాట్లాడుతూ జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను వేధిస్తున్నారని ఆరోపించారు. ట్యూషన్ ఫీజు మొత్తం ముందుగానే చెల్లించాలని తల్లిదండ్రులకు మెసేజ్ పెడుతూ ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో ఫీజులను నోటీస్ బోర్డులో పెట్టి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం పాఠశాలకు పర్మిషన్ లేకుండానే అడ్మిషన్లు చేస్తున్న విద్యాశాఖ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీబీఎస్ పాఠశాలలో అడ్మిషన్ ఫీజులు రూ.5 వేలకు పైగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ-టెక్నో , ఐఐటీ, ఇంటర్నేషల్, ఒలంపియడ్, డీసీ అని ప్రత్యేక పేర్లు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దోసగాని సుమ, జిల్లా సహాయ కార్యదర్శి విఘ్నేష్ పాల్గొన్నారు.