- తయారీ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
- జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, మన చౌరాస్తా : మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చిందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. గురువారం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అన్ని మండలాల సీసీలు, ఏపీఎంలు, వీఓలకు మహిళా శక్తి పథకంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని మరింత ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 మండలాల వారీగా 466 మంది వీఓలు, 11,201 స్వయం సహాయక సంఘాలు, 1,25,716 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారని వివరించారు. జిల్లాలో ఈ సంఘాల ద్వారా మహిళలకు లక్ష్యానికి మించి ఉపాధిని కల్పించాలని సూచించారు. ఇప్పటివరకు వివిధ రంగాల్లో ఉపాధి కల్పనలో అభివృద్ధి సాధించిన సీసీలు, వీఓలను కలెక్టర్ అభినందించారు. ప్రధానంగా ఏ లబ్ధిదారులైనా మహిళా సంఘంలో తప్పనిసరిగా సభ్యులుగా ఉండాలన్నారు. ఏ పథకంలో అయినా సరే బ్యాంక్ లింకేజ్ ద్వారానే రుణాలు మంజూరు అవుతాయన్నారు.
మైక్రో ఎంటర్ ప్రైస్ యూనిట్ల ఏర్పాటు కింద ప్రతి ఒక్క వీఓ లక్ష్యాల వారీగా 25 మందిని గుర్తించి, మూడు రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అలాగే స్వయం సహాయక సంఘాల అకౌంటింగ్ యాప్ లోనూ సంబంధిత పూర్తివివరాలను నమోదు చేయాలని సూచించారు. దీనికి రూ. 2 లక్షల వరకు రుణం అందించనున్నట్లు తెలిపారు. పెరటికోళ్ల పెంపకానికి రూ.3 లక్షల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. పాడి, పశు పోషణ, సంరక్షణ కింద రూ.50 వేల వరకు రుణం ఇస్తున్నట్లు తెలిపారు.
అలాగే మీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు ఇంటర్మీడియెట్ పాస్ అయ్యి ఉండాలని, 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ కింద బ్యాంకులో 35 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మహిళా శక్తి పథకం కింద సంగం లో లేని 1800 మంది మహిళలను లక్ష్యాల వారీగా స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలని తెలిపారు. అంతకుముందు మహిళా శక్తి పథకంపై సీసీలు, వీఓలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, డీవీహెచ్ఓ ఎస్ఎల్ మనోహర్, ఏపీడీ శ్రీనివాస రావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు, ఏపీఎంలు, డీపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.