- మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల
వాహనానికి నిప్పు పెట్టిన దుండగలు - కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితో నాకు ప్రాణహాని..
- ఎర్రమల్ల సుధాకర్ ఆరోపణ.. పీఎస్‌లో ఫిర్యాదు
- కౌంటర్ అటాక్ ఇచ్చిన కొమ్మూరి వర్గీయులు
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : జనగామ కాంగ్రెస్‌లో రాజకీయాలు భగ్గమంటున్నాయి. నిన్న మొన్నటి నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బయటపడింది. జనగామ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్ వాహనాన్ని ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే ఈ ఘటనపై సుధాకర్ స్పందిస్తూ జనగామలో ప్రస్తుతం తమ వర్గం ఒకటి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి వర్గం మరొకటి ఉందని, ఆయన వర్గీయులై తన వాహనాన్ని దహనం చేశారని ఆరోపించారు. ఈ మేరకు జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొమ్మూరితో తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి మధ్య తగాదా రోజురోజుకూ ముదురుతోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల కింద పార్టీకి చెందిన కొందరు లీడర్లు కొమ్మూరిపై హైకమాండ్ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన లెటర్ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిని సీరియస్ తీసుకున్న కొమ్మూరి సదరు లీడర్లపై పార్టీ క్రమశిక్షణ కమిటీ ఫిర్యాదు చేశారు. ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేయించారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు ఎర్రమల్ల సుధాకర్, వేమళ్ల సత్యనారాయణరెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల చందర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అన్వర్, చేర్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉడుముల భాస్కర్‌రెడ్డి నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి, అభ్యర్థి ఓటమికి పని చేశారనే ఫిర్యాదుల వల్లే ఈ నోటీలు ఇచ్చినట్టు అందులో వివరించారు. నాటి నుంచి పార్టీలో వర్గపోరు బయట పడినట్టి అయ్యింది.
ఘటనపై ఫిర్యాదు.. కొమ్మూరిపై కేసు నమోదా?
ఎర్రమల్ల సుధాకర్ తన ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారును దహనం చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కొమ్మూరి వర్గీయులై తన వహనాన్ని దహనం చేశారని, కొమ్మూరితో తనకు ప్రాణహాని ఉందని బహిరంగ ఆరోపణలు చేశారు. ఈ మేరకు జనగామ పీఎస్‌లో ఎర్రమల్ల సుధాకర్ ఫిర్యాదు కూడా చేశారు.
కొమ్మూరి వర్గీయుల కౌంటర్
డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై ఆరోపణలు చేసి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్ర మల్ల సుధాకర్‌కు కొమ్మూరి వర్గీయులు కౌంటర్ ఇచ్చారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, జనగామ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాళా కళ్యాణి, పీఏసీఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి తదితరులు ఎర్రమల్లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీకి ద్రోహం చేశారని, పార్టీ అధిష్టానం ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్ని షోకాజ్ నోటీసులు జారీచేసినా, ఆయనలో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. చివరకు సొంత వాహనాలనే దగ్ధం చేసుకునే దురదృష్ట స్థాయికి దిగజారారని ఆరోపించారు. సుధాకర్ తనకు తానే వర్గాలుగా అభివర్ణించుకుంటూ ఎమ్మెల్యే స్థాయి నాయకులడిని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇకనైనా అవి మానుకోవాలని హితవు పలికారు. వాహనాన్ని దహనం చేసిన వ్యక్తుల పైన అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వల్ల కార్యకర్తల్లో ఐక్యత కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో మేడ శ్రీనివాస్, సర్వల నరసింగరావు, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బనుక శివరాజ్, బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, నర్మెట మండల అధ్యక్షుడు రాజుపేట లక్ష్మీనారాయణ, తరిగొప్పుల మండల అధ్యక్షుడు యాదగిరి గౌడ్, బొట్ల నరసింగారావు తదిరులు పాల్గొన్నారు.