- మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వద్దు
- కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, మన చౌరాస్తా : అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యానిలయాలుగా ఆధునికరించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 695 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు వీటిలో కల్పించాలని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో వేసే పెయింటింగ్ చిన్నారులకు విద్యా బోధన సులభంగా అర్థం అయ్యే విధంగా ఉండాలన్నారు. కేంద్రాల గోడలపై పెయింటింగ్ రూపకల్పన వినూత్నంగా ఉండాలని, అందుకు సంబంధించిన రూపకల్పన వివరాల నివేదికను సమర్పించాలన్నారు. అలాగే జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, లైట్లు, ఫ్యాన్లు, ప్రహారీ , తాగునీరు, సంపులు, ట్యాంకులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సౌకర్యాల పనులన్నీ నాణ్యతతో చేపట్టాలని పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఈ మౌలిక వసతుల కల్పనకు పూర్తి బడ్జెట్ ప్లాన్ నివేదికను సమర్పించాలని సూచించారు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తూ పిల్లలకు నాణ్యమైన ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధంగా వాటిని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జడ్పీ సీఈవో అనిల్ కుమార్, డీడబ్ల్యూవో జయంతి, డీఈఓ రాము, పీఆర్ ఈఈ శ్రీనివాస రావు, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్, సీడీపీఓలు ఫ్లోరెన్స్, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.