- ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది
- దండోరా ఉద్యమానికి అన్ని సహకారాలు అందించా
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, మన చౌరాస్తా : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణకు మాదిగ ఉప కులాల న్యాయమైన పోరాటానికి సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందన్నారు. 1994 జూలైలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజు నుంచి తీర్పు వెలువడిన ఆగస్టు 1వ తేదీ వరకు ఆ ఉద్యమం వెంట తాను ఉన్నానని కడియం పేర్కొన్నారు. దండోరా ఉద్యమానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించానని చెప్పారు. రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొన్న ప్రతిపక్ష దాడులు సైతం ఎదుర్కొన్నారని తెలిపారు. మూడు దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన అన్ని ప్రభుత్వాలు వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశాయన్నారు. తాను సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడే వర్గీకరణకు చట్టబద్ధత లభించిందన్నారు.
వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది షెడ్యూల్డ్ కులాలను ఏబీసీడీలుగా వర్గీకరించి, ఆ జీవో ఆధారంగా ఆయా కులాలకు న్యాయం జరిగే విధంగా వాళ్ల వాటా వాళ్లు పొందే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లపాటు అమలు చేయడం జరిగిందన్నారు. 2004లో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంతో రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అవకాశం లేదని ఆ జీవోను రద్దు చేశారని తెలిపారు. ఉషా మేదర కమిషన్ వర్గీకరణ న్యాయబద్ధనమేనని, రాజ్యాంగ సవరణ ద్వారానే దీనిని చేయాలని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వర్గీకరణ సమర్ధిస్తూ సుప్రీం కోర్టులో ఆఫడా పెట్టు వేయడం జరిగిందన్నారు. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ తో రాష్ట్ర వాదన వినిపించామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుకూలంగా ఉండడంతో అట్టడుగు స్థాయి వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందించాలని ఉద్దేశంతోనే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కనుగుణంగా వర్గీకరణ అమలయ్యే విధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మాదిగ ఉప కులాలకు ఉద్యోగ విషయంలో న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. సమావేశంలో లింగాలఘణపురం, రఘునాథపల్లి మాజీ జడ్పీటీసీలు గుడి వంశీధర్‌రెడ్డి, బొల్లం అజయ్, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసనుపల్లి లింగాజీ, నాయకులు లింగాల జగదీశ్‌చందర్ రెడ్డి, బొల్లంపల్లి నాగేందర్, గణపతి తదితరులు పాల్గొన్నారు.