- ఇక నుంచి నీ వెంటే నేనుంటా..
- డీసీసీ కార్యదర్శి చిర్ర హనుమంత్‌రెడ్డి
జనగామ, మన చౌరస్తా: ‘కొందరి మాటలు నమ్మి పెద్దన్న లాంటి మీపై ఆరోపణలు చేశా.. నా తప్పు తెలుసుకుని పశ్చాతాప పడుతున్నా.. ప్రతాపన్నా నన్ను మన్నించు’ అని డీసీసీ కార్యదర్శి చిర్ర హనుమంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొమ్మూరిపై చేసిన విమర్శలను ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. కొందరి ప్రోద్బలం వల్లే డీసీసీ అధ్యక్షుడిపై అసత్య ఆరోపణలు చేశానని స్పష్టం చేశారు. మంగళవారం తన సతీమణి మల్లికాంబతో కలిసి జనగామలో విలేకరులతో మాట్లాడారు. జనగామలో కొందరు నాయకులు గ్రూపులుగా ఏర్పడి కాంగ్రెస్‌ను, కొమ్మూరిని బ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వారి రాజకీయాల్లో తనను బలి పశువును చేశారని వాపోయారు. ఈ క్రమంలోనే తనతో కొమ్మూరిపై అసత్య ఆరోపణలు చేయించారన్నారు. తన భూవివాదంలో డీసీసీ అధ్యక్షుడికి ఎలాంటి సంబంధం లేదని, కావాలనే అందులోకి లాగారని వివరించారు. కొన్ని రో జుల క్రితం అందులో నిజానిజాలు తెలుసుకుని పశ్చాత్తాపంతో ఇప్పుడు మీ ముందుకు వచ్చానని విలేకరులకు చెప్పారు. 2013 నుంచి తాను కొమ్మూరికి సన్నిహితుడిగా ఉంటున్నానని, ఇప్పటి నుంచి కూడా తన ప్రయాణం ఆయనతోనేనని చెప్పుకొచ్చారు. తాను మనస్ఫూర్తిగా కొమ్మూరికి క్షమాపణ చెబుతున్నానని, ఇక నుంచి ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తానని హనుమంత్‌రెడ్డి పేర్కొన్నారు.