
- చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు కేటాయింపులేవి?
- అంబేద్కర్ అభయహస్తం అటుకెక్కినట్టేనా?
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు
జనగామ, మన చౌరాస్తా : 2025–- 26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీలా ఉందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అన్నారు. రూ.3,04,965 కోట్ల బడ్జెట్లో ఎస్సీ ఎస్డీఎఫ్ కిండ రూ.40,231.61 కోట్లు కేటాయించారని, కాగితాల్లో అంకెలు పెంచుతూ ఖర్చులు తుంచుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు కేటాయింపు జరగలేదని, అంబేద్కర్ అభయహస్తానికి ఏటా రూ.750 కోట్ల కేటాయిస్తామాన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోయిందని, బడ్జెట్ను సవరించి దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఆయన డిమాండ్ చేశారు.
కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం జనగామ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ నిరసనలో పాల్గొన్న స్కైలాబ్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 18 శాతం ఉన్న దళితులకు ప్రతి ఏటా బడ్జెట్లో అంకెలు పెంచుతూ ఖర్చులు మాత్రం తుంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024–- 25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్లో నూటికి 30 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు.
2023– 24 బడ్జెట్లో రూ.13,617 కోట్ల ఖర్చు చేయలేదని ఆర్థిక మంత్రి శాసన సభలో ప్రకటించడం విడ్డురంగా ఉందన్నారు. ఈ ఏడాది ఖర్చు కానీ నిధులను సబ్ ప్లాన్ చట్టం ప్రకారంగా వచ్చే ఏడాది బడ్జెట్లో ఖర్చు చేయాలన్నారు. దళితుల ఆవాసాలు, విద్యా, వైద్యం, రహదారులు, తాగునీరు వంటి మౌలిక ప్రత్యక్ష ప్రయోజనాలపై దృష్టి సారించలేదన్నారు.
కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బోట్ల శేఖర్, జిల్లా అధ్యక్షుడు తోటి దేవదానం, జిల్లా ఉపాధ్యక్షురాలు పల్లేర్ల లలిత, కళ్లెపు శైలజ, మబ్బు ఉప్పలయ్య, గడ్డం యాదగిరి, వివిధ మండలాల ప్రతినిధులు బోట్ల శ్రావణ్, అరూరి కృష్ణ, గండమల్ల మనోహర్, చిలుముల్ల భాస్కర్, ఎండి హసియా, మచ్చ సంధ్య, కాకర్ల రమేష్, చిరంజీవి లక్ష్మి, శోభ, కవిత లావణ్య మంజుల, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.