
- భూ తగాదాలతో ఖాకీలకు కాసుల పంట
- చేతులు మారుతున్న లక్షల రూపాయలు
- మధ్యవర్తులను పెట్టుకుని ‘మనీ’ తరలింపు
- రాజకీయ నేతలు, కొందరు జర్నలిస్టుల కీ రోల్..!
జనగామ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయా..? సివిల్ కేసులు, భూ తగాదాలు ఇక్కడ పరిష్కారించబడవు అంటూ స్టేషన్ బయట బోర్డులు పెడుతూనే.. వెనుక నుంచి సెటిల్మెంట్ల పర్వానికి దారులు తేరిచే ఉండును.. అంటున్నారా.. ? అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఇటీవల కాలంగా జిల్లాలోని పలు ఠాణాల్లో ఈ దందాలు మరింత పెరిగి పోయినట్టు తెలుస్తోంది. మధ్యవర్తులను పెట్టుకుని ‘మనీ’ తరలిస్తూ.. కాసులు పండించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఉండే జనగామ జిల్లా వెస్ట్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ వెస్ట్ జోన్లో స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, జనగామ ఏసీపీ సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో నర్మెట్ట, రఘునాథపల్లి (జనగామ రూరల్), జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌తో కలిపి ఐదు సీఐ సర్కిళ్లు, 12 మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అయితే ఠాణాల్లో సివిల్ పంచాయితీలు, భూ తగాదాల పరిష్కారాలు పోలీసులు నిర్వహించ కూడదనే నిబంధనలు ఉన్నా ఆయా సర్కిళ్ల బాసులు అవేమీ పట్టించుకోకుండా సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జనగామ డీసీసీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ ఠాణాలో ఒక భూ సెటిల్మెంట్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ భూ తగాదాలో అసలైన బాధితుడిని కాదని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి పోలీసులు వత్తాసు పలికినట్టు సమాచారం. ఇందు కోసం ఆ వ్యక్తి నుంచి దాదాపు రూ.1లక్ష తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇదే పీఎస్‌పై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా స్థాయి నేత తీవ్ర ఆరోపణలు చేశాడు. పోలీసులు లంచాలు తీసుకుని బాధితుల పక్షాన కాకుండా భూ ఆక్రమణ దారులకు వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. ఆ విషయంపై సీపీకి సైతం ఫిర్యాదు చేశాడు.
అంతా మధ్య వర్తులతోనే…
జనగామ డీసీపీ పరిధిలోని కొన్ని సర్కిళ్ల పోలీస్ స్టేషన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సివిల్, భూ సమస్యలు, ప్లాట్ల పంచాయితీలే జరుగుతున్నాయి. ఇక కొందరు ఆఫీసర్లు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే ఈ గొడవల్లోకి వారు నేరుగా రాకుండా కొందరు మధ్య వర్తులను ముందుంచి కథ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ పంచాయితీ బెడిసి కొట్టి ఏదైనా జరిగితే తమకు ఏమీ తెలియదు అన్నట్టు
చెప్పుకునేందుకు పోలీసులు మధ్యవర్తులను ముందుంచుతున్నారని తెలిసింది. ఇక ఈ మధ్య వర్తిత్వం చేసే వారు కొన్ని స్టేషన్లలో రాజకీయ నాయకులైతే.. మరి కొన్ని స్టేషన్లలో ఆయా ప్రాంతాల్లో ప్రతికలు, మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు ఉండడం గమనార్హం. ఇటీవల ఓ ఠాణాలో జరిగిన ఓ భూ సెటిట్మెంట్లో జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి అక్కడి పోలీసులతో కలిసి వాటాలు
పంచుకున్నట్టు తెలిసింది. ఈ విషయం కాస్తా జర్నలిస్టు వర్గాల్లో బయటకు పొక్కడంతో సదరు అధికారి ప్రధాన మీడియాలో ఉండే మరో నలుగురు జర్నలిస్టులకు విందు ఏర్పాటు చేసి శాంత పర్చినట్టు సమాచారం. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితులు
కోరుతున్నారు.
పోలీసులు జోక్యం చేసుకో వద్దు
– చల్లా అశోక్‌వర్థన్ రెడ్డి, అడ్వకేట్
సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దు. కోర్టు నుంచి సదరు బాధితులకు ఇంజక్షన్ ఆర్డర్, పోలీసు ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉన్న సమయంలో మాత్రమే పోలీసులు రావాలి. అలా కాకుండా పోలీసులు అత్యుత్సాహంతో భూ తగాదాల్లో జోక్యం చేసుకుంటే ఎన్నటికైనా వారికే ముప్పు.