
పెట్రోల్ బంక్ కోసం స్థలాన్ని పరిశీలన
రఘునాథపల్లి, మన చౌరాస్తా : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఖిలాషాపూర్ క్రాస్ రోడ్డు వద్ద చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్య, స్వయం కృషి దివ్యాంగుల మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా మంగళవారం పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆయన వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి వసంత, తహసీల్దార్ మోసిన్, డీపీఎం రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12 గుంటల స్థలంలో పెట్రోల్ బంకు నిర్మాణం ఓసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) నుంచి అనుమతి లభించిందని, సుమారు 70 లక్షలతో నిర్మించనున్న ఈ పెట్రోల్ బంక్ నిర్మాణంతో మహిళా సమాఖ్య అభివృద్ధి పథంలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
ఇందిర మహిళా శక్తి భవన కోసం..
జనగామ మండలంలోని పెంబర్తి గ్రామ సమీపంలో 106 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ స్థలంలో రూ.5 కోట్లతో నిర్మించనున్న మహిళా శక్తి భవనానికి అనువైన స్థలాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి వసంత, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థలాన్ని చదును చేయడంతో పాటు బోర్ వేసి విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.