
జనగామ, మన చౌరాస్తా : జనగామకు చెందిన కాంగ్రెస్ నాయకుడు జాయ మల్లేశంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. జనగామకు చెందిన జర్నలిస్టు మరెడి వినయ్ కుమార్ను ఈ నెల 20న ఓ హోటల్లో టీ తాగేందుకు వెళ్లగా అదే సమయంలో జాయ మల్లేశం అక్కడే ఉన్నాడు. అయితే గతంలో వీరి మధ్య కొన్ని లావాదేవీలు జరిగిన క్రమంలో వినయ్ కుమార్కు మల్లేశం రూ.3.5 లక్షలు బాకీ ఉన్నాడని తెలిపారు. ఆ డబ్బులను వినయ్ కుమార్ అడుగడంతో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడుతావా అంటూ మల్లేశం ఆవేశంతో కులం పేరుతో దూషించాడని పేర్కొన్నారు. వినయ్ కుమార్ ఫిర్యాదు మేరకు మల్లేశంపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.