
- వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి
- కొడకండ్లలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యటన
- ఫర్టిలైజర్ షాపులు, పీహెచ్సీ, ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన
కొడకండ్ల, మన చౌరాస్తా : భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బుధవారం జిల్లాలోని కొడకండ్ల మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా రామారం చెరువును పరిశీలించి… భారీ వర్షాలు కురిసి చెరువు నిండితే తీసుకోవాల్సిన చర్యలుపై పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. అనంతరం మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను, పీఏసీఎస్‌ను సందర్శించి ఇప్పటివరకు జరిగిన అమ్మకాల వివరాలను, స్టాక్ వివరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. రైతుకు ఉన్న ఎకరాలను బట్టి యూరియాను అమ్మాలని, అవసరాని కంటే ఎక్కువ యూరియాను అమ్మి కొరతను సృష్టించవద్దని ఆదేశించారు. జిల్లాలో సాగుకు సరిపడా యూరియా ఉన్నదని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారంగా సిబ్బంది ఉన్నారా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అలర్ట్ గా ఉండాలని 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో మరింత అలర్ట్ గా ఉండాలని, సమయానికి వైద్య సేవలు అందించాలన్నారు.
చివరిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ఇసుక, మొరం, కంకర తదితర మెటీరియల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లింగాలఘణపురం మండలంలోని కుందారం బ్రిడ్జ్ మీద నుంచి భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా జరుగుతున్న పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, వ్యవసాయ, వైద్య తదితర శాఖల అధికారులు ఉన్నారు.