
విజయవాడ, మన చౌరాస్తా : దేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్ యూజే (ఐ) ముందుందని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) ప్రతినిధులు ప్రకటించారు. ఎన్ యూజే(ఐ) జాతీయ కార్యవర్గ సమావేశాలు శని, ఆదివారాలలో విజయవాడలో జాతీయ అధ్యక్షుడు సురేష్ శర్మ అధ్యక్షతన జరిగాయి. ఎన్ యుజె(ఐ) సెక్రటరీ జనరల్ త్రియుగ్ నారాయణ తివారీ, జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, టీఎస్ జెయు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా జర్నలిస్టుల రక్షణ కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛపై ప్రజల్లో అవగాహన రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మీడియా స్వేచ్ఛను హరించే శక్తుల పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని తీర్మానించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను కలిపి విస్తృతమైన అధికారాలతో కేంద్ర ప్రభుత్వం మీడియా కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 25 మంది ప్రతినిధులు హాజరయ్యారు. టీఎస్ జేయు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ ఉదయధీర్, మేడ్చల్ జిల్లా సీనియర్ నాయకులు ఎండి. రియాజ్, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పోచంపల్లి రజిత, కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్, తడక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి దేశంలోని 19 రాష్ట్రాల నుంచి ఎన్ యుజె(ఐ) ప్రతినిధులు హాజరయ్యారు.