
- టైం వస్తే గర్జిస్తా.. ప్రజల కోసం కంఠం ఎత్తుతా..
- అధికారం కోసం రాజకీయాలు చేయను
- శబ్ధకాలుష్య వార్తలకు.. నిశబ్ధమే నా ఆయుధం
- బీఆర్ఎస్, కేసీఆర్ అంటే ఓ నమ్మకం..
- మార్పు కోసం ఇందులోకి వచ్చా..
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు మాదే..
- రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక పెరిగిపోయింది
- మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : ‘పొన్నాల అంటే అంత ఆశామాషీ కాదు.. నేను పులి లాంటి వాడిని.. టైం వచ్చినప్పుడే గర్జిస్తా.. ప్రజలు, ప్రజా సమస్యల కోసం కంఠం ఎత్తుతా.. తప్ప.. అధికారం కోసం రాజకీయాలు చేసే నీచ సంస్కృతి నాకు లేదు..’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పొన్నాల మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులుగా ‘పొన్నాల మళ్లీ కాంగ్రెస్లోకి..’ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వార్తలకు పొన్నాల కౌంటర్ ఇచ్చారు. ‘కొందరు నాలుగు గోడల మధ్య చేసిన తీర్మాణాలకు చేసిన వాటిని మరికొందరు బలపరుస్తూ వస్తున్న వార్తలకు నేను ఎలా సమర్థిస్తా.. అయినా నేను బటకి వెళ్లినప్పుడు ఎవరైనా నన్ను అడ్డుకున్నారా.. నాతో మాట్లాడారా.. పోని ఇప్పుడైనా మాట్లాడారా..’ అంటూ పొన్నాల మండిపడ్డారు. తాను అధికారం కోసం రాజకీయాలు చేయనని, మార్పు కోసమే బీఆర్ఎస్, కేసీఆర్ను నమ్మి ఈ పార్టీలో కి వచ్చానని స్పష్టం చేశారు. కొన్ని మీడియా గ్రూపులు తనపై చేస్తున్న వార్తల ‘శబ్ధకాలుష్యానికి.. నిశబ్ధమే..’ తన ఆయుధమని తెలిపారు. అది సరిపోకుంటే రెండోసారి ‘చెంపదెబ్బ’ సమాధానం అవుతుందని.. అదీ.. చాలకుంటే ఇక చెప్పను.. అంటూనే.. ‘చెప్పు దెబ్బ’ అన్నట్టు చమత్కరించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు మాదే..
జూబ్లీహిల్స్ ఉప్ప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. కొన్ని రోజుల కింద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైందని.. ఈ క్రమంలో తమ పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి సతీమణి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దింపారని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమ అభ్యర్థిని గెలిపిస్తాయని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జనగామ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ ప్రేమలతా రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండ యాదిగిరి రెడ్డి, పసుల ఏబేలు, ధర్మపురి శ్రీనివాస్, మాజిద్, రఘుఠాకూర్, మహేష్ కుమార్ పాల్గొన్నారు.