
- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : కోరమీసాల వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు డప్పులు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న వెంటనే టెంపుల్ నిర్వాహకులు, పూజారులు ఘనంగా ఆహ్వానించగా, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో ముడిపడి ఉన్న సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ప్రతి ఏటా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవడం ఆనవాయితీగా కొనసాగుతున్నదని, కోరిన కోరికలు తీర్చే కోరమీసాల స్వామి మహిమ అనేకసార్లు నిరూపితమైందని తెలిపారు. జిల్లా, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.





