
- కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి రూ.70 కోట్ల కేటాయింపు
- :మంత్రి కొండా సురేఖ
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆమె, రాష్ట్ర రవాణా–బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, భద్రకాళి నుంచి బాసర వరకు ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని, వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం వసతి, దర్శన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలన్న సూచనలు చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కోరమీసాల వీరభద్ర స్వామి ఆలయాన్ని భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ కిషన్ రావు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





