
భీమదేవరపల్లిలో కాంగ్రెస్ నేతల వీరంగం
- మంత్రి పొన్నం అండతోనే దాడులంటూ బాధితుల ఆరోపణ
- బతుకమ్మ కుంటకు భూమిస్తే అక్రమ కేసులా
- అంటూ లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి నిప్పులు
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : హుస్నాబాద్ నియోజకవర్గంలో అధికార ఉదనే గర్వంతో కొందరు అధికార పార్టీ నాయకులు నడిరోడ్డుపై నృత్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రక్షణ కల్పించాల్సిన మంత్రే వెనకుండి అరాచకాలను ప్రోత్సహిస్తుండటంతో స్థానిక ప్రజలు, సొంత పార్టీలోని నిజాయితీ గల నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు స్వరూప తన అనుచరులతో కలిసి రంగయ్యగ పల్లి భూమి దాత లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి నివాసంపై జరిపిన దాడి నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ స్వరూప మరో పది మంది అనుచరులతో కలిసి ఒక సామాన్య పౌరుడి నివాసంలోకి చొరబడి గేట్లను ధ్వంసం చేస్తూ, వస్తువులను పాడుచేస్తూ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇదంతా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ఆదేశాలు, ప్రోత్సాహంతోనే జరిగిందని బాధితులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నియోజకవర్గంలో శాంతిని కాపాడాల్సిన మంత్రే ఇలాంటి అరాచకాలను, హింసను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని బాధితులు గ్రామ స్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే తమ నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయ దాడులు, హింసాత్మక చర్యలు సరికావని, అధికార బలంతో సామాన్య ప్రజలపై జరుగుతున్న ఈ అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన అనుచరుల నుండి తమ కుటుంబానికి తీవ్ర ప్రాణాపాయం ఉందని, స్థానిక పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిష్పాక్షికంగా విచారణ జరిపి, తమకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించి, దాడికి పాల్పడిన స్వరూప, ఆమె అనుచరులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉన్నతాధికారులు, మానవ హక్కుల సంఘాలు కూడా ఈ ఘటనపై స్పందించి న్యాయం చేయాలని కోరారు.
మరోవైపు రంగయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు లక్కిరెడ్డి తిరుపతి రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగడం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికార బలంతో స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా అణచివేస్తున్నారని, తన సొంత రాజకీయ స్వార్థం కోసం ఎదుగుతున్న నాయకులను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నారని తిరుపతి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గత యాభై ఏళ్లుగా రంగయ్యపల్లి గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతుంటే, ఆ సమస్యను పరిష్కరించేందుకు గత గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో తిరుపతి రెడ్డి తన సొంత భూమిని బతుకమ్మ కుంట కోసం దానం చేశారు. ఆనాడు భూమి పూజ కార్యక్రమానికి స్వయంగా హాజరై, తిరుపతి రెడ్డి చేసిన సత్కార్యాన్ని శాలువాలు కప్పి అభినందించిన ఇదే మంత్రి పొన్నం ప్రభాకర్, నేడు ఆ దాన గుణం వల్ల తిరుపతి రెడ్డికి ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందో, రాజకీయంగా ఎక్కడ ఎదుగుతారో అనే కుళ్లు, అసూయతో తన వైఖరిని మార్చుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుత అధికార బలంతో ఆ భూమికి క్లియర్ (పట్టా) రాకుండా వెనుక నుండి అడ్డుపడుతున్నారని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నియోజకవర్గంలో స్థానిక నాయకులకు కనీస విలువ లేకుండా పోయిందని, మంత్రి కుటుంబ సభ్యులే భీమదేవరపల్లి మండలాన్ని శాసిస్తూ, స్థానిక నాయకత్వాన్ని తొక్కిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఎదుగుతున్న స్థానిక నాయకులను, చివరకు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సైతం రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా మంత్రి వ్యూహాలు సాగుతున్నాయని, దీనిపై గత కొన్ని నెలలుగా తాను గళమెత్తినందుకే తనపై కక్షగట్టారని ఆయన పేర్కొన్నారు.
తాను దానం చేసిన బతుకమ్మ స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించడానికి గత ఐదు నెలలుగా రెవెన్యూ అధికారులతో సంప్రదింపులు జరుపుతుంటే, తనకు చెడ్డపేరు తేవాలనే కుట్రతో, రంగయ్యపల్లి గ్రామ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌ను వాడుకుని మంత్రి కావాలనే ఆ భూమిపై లీగల్ వివాదాలు సృష్టిస్తూ, రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం స్వయంగా మంత్రులే తనకు ఫోన్ చేసి, సోమవారం కలిసి మాట్లాడుకుందామని నమ్మబలికి, అంతలోనే హఠాత్తుగా తనపై అక్రమ కేసులు బనాయించడం వారి నయవంచనకు, కపట రాజకీయాలకు నిదర్శనమని తిరుపతి రెడ్డి ఆరోపించారు. సొంత మండలంలో తప్పుడు కేసులతో తనను బద్నాం చేసి, రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడమే మంత్రి ఏకైక అజెండా అని ధ్వజమెత్తారు. వలస నాయకుడైన పొన్నం ప్రభాకర్ ఆడుతున్న ఈ అరాచక రాజకీయ క్రీడను, స్థానిక నాయకత్వాన్ని చంపేసే కుట్రలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి వలస నాయకులకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజల నుండి తీవ్ర నిరసన ఎదురవుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఇతర రాజకీయ పార్టీలకు విన్నపం చేస్తూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానికేతరులకు లేదా వలస నాయకులకు ఎలాంటి బీ ఫారాలు ఇవ్వకూడదని, కేవలం స్థానిక నాయకులకే పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకులను ప్రజలు ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటారని, కానీ పొన్నం ప్రభాకర్ లాంటి వలస నాయకులను మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరస్కరిస్తారని లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి తేల్చి చెప్పారు.




