
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ విద్యుత్ సబ్స్టేషన్లో రాత్రివేళ మందు విందు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సుమారు రెండు నెలల క్రితం రాత్రి వేళల్లో సబ్స్టేషన్లో విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు కొందరు గ్రామస్తులు తరచూ విందులు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకు సబ్స్టేషన్లో పనిచేసే సిబ్బందినే వీడియో చిత్రీకరించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరగా, విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.




