
- పండుగ వేళ ఎల్కతుర్తిలో విషాదం
ఎల్కతుర్తి, మన చౌరాస్తా : పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిన వేళ, ఎల్కతుర్తి మండలం శోకసంద్రంలో మునిగింది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన చందుపట్ల విద్యాసాగర్ (23) క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి వెలుగుల దీపంలా ఉన్న కుమారుడు అలా కళ్లముందే కుప్పకూలిపోవడంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు గ్రామాన్ని కన్నీటిపర్యంతం చేశాయి.
పేదరికాన్ని జయించాలనే సంకల్పంతో చదువు పూర్తి చేసిన విద్యాసాగర్, అరోరా కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి ముల్కనూర్ రోడ్డులోని తన ఇంట్లో బట్టల షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఉదయాన్నే తెల్లవారుజామున లేచి హనుమకొండలో ఇంటింటికీ పాల ప్యాకెట్లు సరఫరా చేస్తూ ఉపాధి పొందేవాడు. “ఇంకొంచెం కష్టపడితే కుటుంబం బాగుపడుతుంది” అన్న ఆశలే అతని బాట.
అదే ఆశలతో సోమవారం ఉదయం ఎల్కతుర్తిలో కొత్తగా ఏర్పాటు చేసిన మిల్క్ సెంటర్ నుంచి స్కూటీపై పాల ప్యాకెట్లు తీసుకొని అనంతసాగర్ వైపు బయలుదేరాడు. కానీ వెనుక నుంచి వచ్చిన టీజీ 09 టీ 1007 నంబర్ ఆయిల్ ట్యాంకర్ అతని కలలను క్షణాల్లోనే చిదిమేసింది. ఢీకొన్న దెబ్బకు తలకు తీవ్ర గాయాలు కావడంతో విద్యాసాగర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చినా, అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఒకే కుమారుడిని కోల్పోయిన తల్లి శారద, తండ్రి అశోక్ రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. “ఇక మా జీవితం ఎవరి కోసం” అంటూ వారు విలపించగా, ఇద్దరు అక్కచెల్లెళ్ల పరిస్థితి మాటల్లో చెప్పలేనంత విషాదంగా మారింది. యువ వయసులోనే కుటుంబ బాధ్యతలు మోస్తూ, జీవితంపై ఎన్నో కలలు కంటున్న విద్యాసాగర్ మృతి ఎల్కతుర్తి గ్రామాన్ని మౌనంగా మార్చింది.




