‘సబ్ ఎడిటర్ అంటే.. చాలీచాలని జీతాలు, నిద్రలేని రాత్రులు, భరోసా లేని బతుకులు, అనారోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో కష్టాలు.. వాటన్నింటినీ భరిస్తూ నవ్వుతూ, నటిస్తూ ఈ కొలువు చేయాలి..(i am not an actor) అది నా వల్ల కాలేదు. అందుకే ఎంతో ఇష్టంగా జర్నలిజంకు వచ్చినా.. మళ్లీ కొత్త దారి చూసుకోవాలను కున్నా.. అందుకే కష్టపడి చదివిన.. గవర్నమెంట్ జాబ్ కొట్టిన’ అంటూ ఇటీవల ఇండియన్ రైల్వేస్‌లో అసిస్టెంట్ లోకో పైలట్‌గా ఉద్యోగం సాధించిన పల్లె నరేందర్ చెప్పారు. డెస్క్ జర్నలిస్టుగా కొంత కాలమే పనిచేసినా.. అక్కడే ఎంతో నేర్చుకున్నా అంటూ ‘చౌరాస్తా’లో తన అనుభవాలను నెమరువేసుకున్నాడు ఈ చిన్నోడు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఇంట్లో కూడా చిన్నోడినే..
మాది జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామం. నేను బీ టెక్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాను. నాన్న కల్లు గీత కార్మికుడు. అమ్మ వ్యవసాయ కూలి. నాకు అన్నా, అక్కా ఉన్నారు. ఇంట్లో కూడా నేను చిన్నోడినే.. (నవ్వుతూ..). టెన్త్ వరకు ఊళ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఇంటర్ ఆదర్శ జూనియర్ కాలేజీ, బీటెక్ వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలో పూర్తి చేశా. ఎలాగైనా మంచి జాబ్ చేసి ఇంట్లో వాళ్లను బాగా చూసుకోవాలనేది నా కోరిక.
2016లో సాక్షిలోకి..
నాకు మొదటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆలోచనే బాగా ఉండేది. అయితే అందరిలాగే మా ఇంట్లో ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉండేవి. అందుకే ఏదైనా ఉద్యోగం చేస్తూ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలని ఫిక్స్ అయ్యా.. అదే టైంలో 2016లో సాక్షి దిన పత్రికలో జర్నలిజం స్కూల్‌కి సంబంధించి నోటిఫికేషన్ చూశాను. శిక్షణ కాలంలో స్కాలర్‌షిప్‌తో పాటు ఆ తర్వాత ఉద్యోగం ఛాన్స్.. ఇది చాలా బాగుంది అనిపించింది. వెంటనే అప్లై చేయడం, ఎగ్జామ్, ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని జాబ్‌లో జాయిన్ కావడం చకచకా జరిగిపోయాయి. తర్వాత 2016 ఏప్రిల్‌లో మా బ్యాచ్ వాళ్లకు బంజారాహిల్స్ లో శిక్షణా తరగతులు నిర్వహించారు. అప్పటి వరకూ పెద్దగా ఆసక్తి లేనప్పటికీ, అక్కడ ఉన్న అధ్యాపకుల ప్రోత్సాహం వల్ల నాకు జర్నలిజంపై ఇష్టం ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 60 మంది స్టూడెంట్స్, అపార అనుభవం ఉన్న ప్రిన్సిపాల్, స్టాఫ్.. ఆ వాతావరణమే ఎంతో ఉత్తేజాన్నిచ్చేది. గ్రాడ్యుయేషన్ వరకు కూడా నేర్చుకోని అనేక విషయాల్ని ఈ శిక్షణ కాలంలో నేర్చుకున్నా. జిల్లాల విభజన నేపథ్యంలో శిక్షణా (journalism) కాలం మధ్యలోనే నాకు వరంగల్ డెస్క్‌లో సబ్ ఎడిటర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
ప్రిపరేషన్, జాబ్‌ను బ్యాలన్స్ చేస్తూ..
శిక్షణ (journalism) కాలంలో కలిగిన ఇష్టంతో.. ఉత్సాహంగా సొంత ఊరైన వరంగల్ డెస్క్‌లో రిపోర్ట్ చేశాను. కొద్ది రోజులు సాఫీగా ఉద్యోగం చేస్తూ, నైట్ డ్యూటీకి అలవాటు పడ్డాను. ఒక సంవత్సరం తర్వాత ఇటు ప్రిపరేషన్, అటు జాబ్‌ను బ్యాలన్స్ చేయలేక కొంచెం ఒత్తిడికి, ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ఒక దశలో జాబ్‌కు రిజైన్ చేసే వరకూ వెళ్లాను. కానీ, ‘పెద్దల’ సహకారంతో మళ్లీ పరిస్థితులు చక్కబడ్డాయి. డెస్క్‌లో ఉండే సీనియర్లు కూడా నన్ను అన్ని రకాలుగా వెన్నుతట్టి ప్రోత్సహించారు. అర్ధరాత్రి డ్యూటీ ముగిశాక.. నిద్రను ఆపుకుంటూ బైక్ మీద దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించడం చాలా కష్టమయ్యేది. అలా రాత్రి డ్యూటీ చేస్తూ పొద్దంతా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాడిని. కొంత కాలం ఇక్కడ నైట్ డ్యూటీ చేస్తూనే కరీంనగర్, వరంగల్‌లో ఉన్న కొన్ని కాలేజీల్లో టీచింగ్ కూడా చేసేవాడిని.
చౌరాస్తా ముఖంగా కృతజ్ఞతలు..
వరంగల్‌లో నాలాంటి యువకులతో పాటు అపారమైన అనుభవం ఉన్న వాళ్లతో కలిసి పని చేయడం చాలా గర్వంగా అనిపించింది. అర్ధరాత్రి డ్యూటీ ముగిశాక డెస్క్ లోని సీనియర్లతో అనేక విషయాలపై చర్చించే వాడిని. నిజంగా వాళ్ల అనుభవాల గురించి రాస్తే ఓ పెద్ద గ్రంథమే అయ్యేది. చాలా సార్లు చిన్నచిన్న తప్పులు చేసినా వాళ్లే నన్ను వెనకేసుకొచ్చే వారు. వాళ్లందరికీ పేరుపేరునా ఈ ‘చౌరాస్తా’ ముఖంగా కృతజ్ఞతలు చెబుతున్నా.
జర్నలిజం ఓ వ్యసనమే..
జర్నలిజం అనేది నిజంగా ఓ వ్యసనం. దీనికి బానిసైన చాలా మంది జీవితాలు ఇక్కడ నన్ను ప్రభావితం చేశాయి. నేడో రేపో ఈ జాబ్‌ను మానేద్దాం అనుకుంటూనే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేసే వాళ్లున్నారు. కొందరైతే ఈ ఫీల్డ్‌లో పని చేశాక.. ఇంకే పని చేయలేమనే వాళ్లూ ఉన్నారు. చాలీచాలని జీతాలు, నిద్రల్లేని రాత్రులు, భరోసా లేని బతుకులు, అనారోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో కష్టాలున్నా ఈ సబ్ ఎడిటర్ కొలువును నవ్వుతూ, నటిస్తూ చేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్లే నన్ను ప్రభావితం చేశారు. ‘నరేందర్ నీకు మంచి భవిష్యత్ ఉంది. ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకు. బాగా చదివి మంచి ఉద్యోగం చేయి..’ అని మా ఎడిషన్ ఇంచార్జి కిశోర్ సార్, కొమ్ము రాజు సార్, యాకయ్య సార్‌తో పాటు.. నువ్వు కూడా (నవ్వుతూ..) వెన్నుతట్టి ప్రోత్సహించిన తీరు నేను మర్చిపోను. ఇక ఎగ్జామ్ ఉంది అంటే నా పని భారాన్ని తమ నెత్తిన వేసుకున్న మిత్రులు ప్రేమ్, శ్రీకాంత్, మాణిక్, సునీల్ లాంటి ఫ్రెండ్స్(నవ్వుతూ) ఇక్కడే దొరికారు. నాకు జాబ్ వచ్చిందని తెలియగానే వాళ్లందరూ చాలా సంతోషించారు. ఎందుకంటే నా కష్టాన్ని దగ్గరగా చూసింది వాళ్లే కాబట్టి.
ఇష్టంగా వదిలేశాను..
నా డ్రీమ్ జాబ్స్‌లో జర్నలిజం కూడా ఒకటి. ఈ ఫీల్డ్‌లోకి ఎంత ఇష్టంగా వచ్చానో.. అంతే ఇష్టంగా వదిలేశాను. ఇక్కడ కొంత మంది పరిచయం నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. జర్నలిజం అనే వ్యసనానికి నువ్వు అలవాటు పడితే వేరే పనేదీ చేయలేవు అంటూ నన్ను నిరంతరం అలెర్ట్ చేసే వారు. బహుశా నేను ఈ ఫీల్డ్కి రావడం వల్లే గవర్నమెంట్ జాబ్ సాధించడం సులువైందేమో. జాబ్ రావడంతోనే ఇంత కాలం పనిచేసిన సబ్ ఎడిటర్ జాబ్‌ను ఇష్టంగానే వదిలేసా..
కరోనా ఎఫెక్ట్ తో పోస్టింగ్ ఆగింది.
ఈ ఏడాది మార్చిలో ఇండియన్ రైల్వేస్‌లో అసిస్టెంట్ లోకో పైలట్‌గా ఉద్యోగం సాధించాను. కానీ కరోనా ఎఫెక్ట్ నా పోస్టింగ్ ఆగిపోయింది. బహుషా నవంబర్‌లో డ్యూటీలో జాయినింగ్ ఉంటుందనుకుంటున్నా.. అంటూ ‘పల్లె’ తన మనోగతాన్ని వివరించాడు.
ముగింపు…
‘పల్లె’ తన మనోగతాన్ని వివరిస్తున్నంత సేపు నాకు నాటి జ్ఞపకాలు కళ్లముందు తిరిగాయి. నరేందర్ మంచి సింగర్.. నెలలో ఒకటీ, రెండు సార్లు నేను, పల్లె కలిసి నైట్ డ్యూటీ చేసేవాళ్లం. ఆ రోజు దాదాపు ప్రింటింగ్ అయిపోయే (తెల్లవారుజామున 5 గంటలు) వరకు ఆఫీస్‌లోనే ఉండాలి. ఇక ఆ రాత్రంతా ‘పల్లె’ పాట కచేరీ ఉండేది. తమ్ముడు గవర్నమెంట్ నౌకరి కొట్టడంతో పాటు ఇటీవల పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. కరోనా నేపథ్యం నేను రాలేకపోయా సారీ నరి.. మొదట ‘పల్లె’ను చౌరాస్తాలోకి ఎక్కిస్తా అంటే.. నవ్వి ‘అన్నా.. నేను చిన్నవాడిని నాకన్నా పెద్దలు చాలా మంది ఉన్నారు..’ అంటూ కొంత సతాయించాడు. కానీ చివరకు చిన్నోడిని మెప్పించి ఒప్పించాను.. నా ‘చౌరాస్తా’కు చిన్నాపెద్దా తేడా లేదు. ‘కొత్త దారిలో..’ సాగుతున్న ప్రతి పాత మిత్రుడు నాకు హీరోనే.. నా చౌరస్తా అందరి ‘రాస్తా’..
ఓకే ఫ్రెండ్స్..
మరిన్ని కథనాలకు క్లిక్ చేయండి
- డెస్క్ లో సుదీర్ఘ కాలం పనిచేసి రిటైర్మెంట్ దశలో ‘కొత్త దారి’ చూసుకున్న ఓ పెద్దాయన కథతో వచ్చే వారం మళ్లీ మన చౌరాస్తాలో కలుస్తా.
చాలా బాగుంది.. రా నరేందర్… కానీ… ఇంకాస్త చెప్పాల్సింది చెప్పలేదేమో.. అనిపించింది….. నువ్వు జర్నలిస్టుగా మారినప్పటి నుండే స్టార్ట్ చేసి జర్నలిజం నుండి మారే వరకు మాత్రమే చెప్పావు… అంతకు ముందూ… ఆ తర్వాతా… ఉన్న జీవితంలోని కొన్ని పార్శ్వాలను రేఖామాత్రంగానైనా చెప్పాల్సిందిరా…
Super sir..