
- అన్ని తరగతుల్లో నిండిపోయిన విద్యార్థులు
- పాఠశాల ముందు బోర్డు పెట్టిన హెచ్ఎం
- పిల్లలు వస్తున్నా తీసుకునే పరిస్థితి లేదట..!
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : ‘మా స్కూల్లో అడ్మిషన్లు క్లోజ్..’ సాధారణంగా ఇలాంటి బోర్డులు ఏ పేరు మోసిన కార్పొరేట్ స్కూళ్లలోనో చూస్తుంటాం.. కానీ.. ఓ ప్రభుత్వ పాఠశాలలో సీట్లు నిండిపోయి ‘అడ్మిషన్లు కోజ్’ అనే బోర్డు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో ఒక జెడ్పీహెచ్ఎస్తో పాటు రెండు ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. అందులో ఒకటి పెద్దగుడి సమీపంలోని ఎంపీపీఎస్ (పెద్దమ్మ గుడి బడి) ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇందులో గత సంవత్సరం 44 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సారి హెచ్ఎం ఆలేటి యాదవ రెడ్డి, టీచర్లు బి.రజిత, జి.రేణుక అడ్మిషన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో 2025–26 విద్యా సంవత్సరానికి నూతనంగా 126 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. గత సంవత్సరం విద్యార్థులతో కలిపి మొత్తం సంఖ్య 170కి చేరుకుంది. ఇంకా కొంత మంది విద్యార్థులు చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పాఠశాలలో తరగతి గదుల కొరత, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉద్దేశంతో 21.06.2025 నుంచి పాఠశాలలో అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు తెలియజేస్తూ పాఠశాల ముందు ఏకంగా బోర్డు పెట్టారు.
వేధిస్తున్న సమస్యలు..
ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ పాఠశాల అంటే జనానికి ఒక విధమైన చిన్న చూపు ఉంది. కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా.. రోజు వారీ కూలీ అయినా సరే తమ పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూళ్లకే పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఖిలాషాపూర్‌లోని ఎంపీపీఎస్ టీచర్లు ప్రత్యేక శ్రద్ధతో తమ పాఠశాలకు పిల్లలను తీసుకొచ్చి అడ్మిషన్లు ఇప్పించారు. ప్రస్తుతం 170 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు బోధన జరుగుతోంది. ఇందులో 32 మంది పిల్లలు ప్రీ ప్రైమరీ, 45 మంది 1వ తరగతి విద్యార్థులు ఉన్నారు. ఇక 2 నుంచి 5వ తరగతి వరకు 100 మంది పిల్లులు ఉన్నారు. అయితే వీరికి సరిపోను గదులు ఇక్కడ లేవు. ఆఫీస్ రూంతో కలిపి 5 గదులు మాత్రమే ఉండడంతో వరండాలో 2 క్లాస్‌లను నిర్వహిస్తున్నారు. ఇక ఈ స్కూల్‌కు మొత్తం ఆరుగురు టీచర్లు అవసరం ఉంటడగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. మిగతా ముగ్గురిని డిప్యూటేషన్ ఇస్తామని అధికారులు చెప్పినా ప్రస్తుతం ఒక్కరు మాత్ర వస్తున్నారు. అలాగే విద్యార్థుల టాయిలెట్స్, ప్రహరీ వంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా మౌలిక వసతులను కల్పించడంతో పాటు పాఠశాలకు టీచర్లను కేటాయించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.