- మెరుగైన ఫలితాల కోసం టీచర్లు కృషి చేయాలి
- నిస్సహాయ మహిళలకు అండగా నిలవాలి
- కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, మన చౌరాస్తా : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, చౌడారంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని, అదే గ్రామంలోని రేషన్ షాపును, సఖీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పీహెచ్సీలో ఓపీ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేసి, రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఔషధాల నిల్వలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని సూచించారు. ఆసుపత్రిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆశ వర్కర్లతో చేపట్టిన ఇంటింటి సర్వేలో జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి, అందుకు తగిన రక్త పరీక్షలు చేసి, సరైన చికిత్స అందించాలని, వారి వివరాల నివేదికను సమర్పించాలన్నారు.
అనంతరం చౌడారంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. మరుగుదొడ్లను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం కింద వారికి అందిస్తున్న భోజనం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో కావాల్సిన వివిధ సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు వచ్చే ఏడాది పది ఫలితాల్లో 10/10 జీపీఏ తప్పనిసరిగా సాధించాలన్నారు. ఆ తర్వాత గ్రామంలోని రేషన్ షాపును కలెక్టర్ తనిఖీ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పట్టికను కచ్చితంగా ప్రదర్శించాలని, ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలిగించరాదన్నారు. అనంతరం సఖి కేంద్రాన్ని పరిశీలించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు అండగా నిలుస్తూ వారికి ధైర్యం చెప్పాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.