ameya agriculture farming
ప్రకృతి ప్రేమికులు జ్యోతి, బాలరెడ్డి కడుపున పుట్టిన మట్టిపిల్ల అమేయ.. తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని.. పసి ప్రాయంలోనే పంట చేలలో పలుగు, పార పట్టిన చిట్టి తల్లి.. మట్టి మనిషి బాలన్న ప్రకృతి వనంలో వికసిస్తున్న అద్భుత పుష్పం.. చెట్టు.. చేమా, గొడ్డు.. గోదాపై ఆ చిన్నారికి ఉన్న అవగాహనలో మనకు ఆవగింజంతన్నా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి సాగు‘బడి’లో ఆ చిట్టి తల్లి నేర్చుకున్న పాఠాలు అన్నీఇన్నీ కావు.. అందుకే ‘అమేయ ఓ అద్భుతం..’ ఆ చిన్నారి చేష్టలను అక్షరాలల్లో వర్ణించేందుకు నా మెదడుకు పదాల ఊట అందలేదు.. నిజమే మరి.. ఇంతకాలం డెస్క్‌లో కూర్చుని సొల్లు వార్తలు, ఊకదంపుడు ఉపన్యాసాలను ఎడిట్ చేస్తూ నా మెదడు మొద్దుబారింది.. కానీ, మొద్దుబారిన ఈ మెదడుకి ‘అమేయ కృషి వికాస కేంద్రం’ ఓ అంటుకట్టింది. అందుకే చిగురిస్తున్న ఆలోచనలతో ఈ కథనం ముందుకు సాగింది ఇలా..
ఆమె అండతో…
డెస్క్ జర్నలిస్టుగా రాజీనామా చేసిన తర్వాత జిట్టా బాల్‌రెడ్డి గారు ‘అమేయ కృషి వికాస కేంద్రం’ (ameya) పేరుతో ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహిస్తూ పూర్తి స్థాయి రైతుగా సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నారు. బాలన్న సక్సెస్ గురించి చెప్పాలంటే ముందుగా ఆయన సతీమణి జ్యోతిరెడ్డి గారి గురించి చెప్పక తప్పదు. బాలన్న సాక్షిలో ఉన్న సమయం(2009)లో ఆమెను వివాహమాడారు. ఉన్నత విద్యావంతురాలైన (డబుల్ ఎంఏ, ఎల్ఎల్బీ) ఆమె భర్త ఆలోచనలు, అభిరుచులను గౌరవిస్తూ బాలన్నకు ఎంతో అండగా నిలిచారు. ఆయన ( సబ్ ఎడిటర్) ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో బతకడం ఎలా అన్న చిన్న భయం లోలోపల ఉన్నా.. ‘ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరైందే తీసుకుంటారు’ అని బాలన్న ‘కొత్త దారి’ని ఆమె స్వాగతించారు.
బాలన్న సాగు బాట పట్టినప్పుడు మొదట చాలా మంది ఆశ్చర్యపోయారు. ‘ఈయన వ్యవసాయం ఏం చేస్తాడులే’ అనుకున్నరు. అంతెందుకు బాలన్న వాళ్ల నాన్న కూడా ‘ఎరువులు లేకుండా ఎవుసం ఏం చేస్తవురా..’ అనే వారట.. కానీ బాలన్న వాళ్లందరి అంచనాలను తలకిందుల చేసి ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సాగు బడిలోకి దిగిన తొలినాళ్లలో కొంత ఇబ్బందులూ పడ్డారు. పెట్టుబడులు లేక, పంట సరిగా రాక నష్టపోయారు. అప్పుల పాలయ్యారు. కానీ, ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఇక అప్పుల విషయమంటారా..! రైతుకు అప్పుకు అవినాభావ సంబంధం ఉంటదంటరు. ఆ పరిస్థితుల్లో బాలన్న కొన్ని రోజులు ‘ప్రకృతి నేస్తం’ అనే ఓ అగ్రికల్చర్ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు గుంటూరుకు వెళ్లి నాచురల్ ఫామింగ్ మీద రైతులకు క్లాస్‌లు చెప్పారు. అన్నదాతలు బాగుపడుతరని ఆ క్లాస్‌లు చెప్పడానికి వెళ్లే ఆయనకు కొన్ని రోజులకు అర్థమైంది.. తన కాన్సెప్ట్ రాంగ్ అని.. తాను అనుకుంటున్నట్లు బాగుపడుతున్నది రైతులు కాదు. మధ్యలో ఉన్న ఎన్జీవోలని తెలుసుకున్నారు. దీంతో దానికీ గుడ్‌బై చెప్పారు.. ఇక ఫుల్‌టైం ప్రకృతి వ్యవసాయంపై ఫోకస్ పెట్టారు. రైతులకు ఏదైనా చేయాలంటే తనే నేరుగా చేయాలని నిర్ణయించుకున్నారు.
స్వార్థ చింతన లేని జీవితం..
బేసిక్‌గా కమ్యూనిస్టు భావజాలం ఉన్న బాలన్న.. మనం సమాజానికి ఏ సేవ చేయాలన్న ముందుగా కమ్యూనిస్టు కావాలంటారు. ఎందుకంటే స్వార్థ చింతన లేకుండా ముందుకు సాగే దారి అదొక్కటే అని.. ఆయన బలంగా నమ్ముతారు. అందుకే బాలన్న అప్పట్లో అడవి బాట పట్టారు. తర్వాత జర్నలిస్టుగా మారారు. అయితే ఈ రెండింటిలోనూ తాను అనుకున్నది ఎంత వరకు సాధించారనేది పక్కనపెడితే.. సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో మరో కొత్త అడుగు వేయాలనుకున్న ఆయనకు ‘వ్యవసాయం’ ఒక్కటే సర్వోన్నతమైన వృత్తిగా కనిపించింది. అందుకే సాగు బాట పట్టారు. ప్రకృతి వ్యవసాయ అభివృద్ధి సంస్థలను మొదలు పెట్టారు.
మూడెకరాల్లో ముగ్గురు..
తాతల నాటి ఆస్తి పంపకాల్లో భాగంగా బాలన్నకు ఆరు ఎకరాల పొలం వచ్చింది. అందులోనే మూడు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఆ మూడు ఎకరాల్లో ఎన్నో ముచ్చట్లు ఉన్నాయి. సతీమణి జ్యోతి, బిడ్డ అమేయ అన్ని పొలం పనుల్లో పాల్గొనే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ చిట్టితల్లి చేసేంత ఓపిక ఉన్నంత మేరకు తండ్రితో పని చేస్తూనే ఉంటుంది. అయితే పిల్లలను మరీ ఫారం కోళ్లలా పెంచకుండా.. శ్రమించడం నేర్పించాలనే ఉద్దేశంతో కూడా అమేయను అన్ని పనుల్లో ఇన్వాల్ చేస్తుంటారు బాలన్న. ప్రకృతి వనంలో పెరుగుతున్న ఆ చిన్నారిని పలకరిస్తే మొక్కల గురించి ఎన్నో విషయాలు చకచకా చెప్పేస్తుంది. రాబోయే రోజుల్లో తాను కూడా నాన్నలా రైతును, శాస్త్రవేత్తను అవుతానని చెప్పడం విశేషం.
అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్..
అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలనేది బాలన్న లక్ష్యం. అందులో రైతులకు పంటలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ ముందుకు సాగాలన్నది ఆయన సంకల్పం. అయితే ఇందు కోసం కొందరు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చినా.. మళ్లీ వాళ్లకు తలవంచడం ఆయనకు ఇష్టం లేదు. కొంత కష్టమైనా స్వశక్తితోనే ఇన్స్టిట్యూట్ పెట్టాలనే పట్టుదల ఆయనలో కనిపించింది. అగ్రీ బేస్డ్ ఇండస్ట్రీస్‌ను కూడా డెవలప్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
- ‘వ్యవసాయంలో జ్ఞానాన్ని పంచుకుంటు పోదాం.. అది మనల్ని పెంచుకుంటూ పోతది..’
సమగ్ర వ్యవసాయమే సంకల్పం..
గతంలో రైతులు సమగ్ర వ్యవసాయం చేసే వారు. అంటే పంట సాగు చేయడంతో పాటు గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి వాటిని పెంచేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయం అంటే వ్యాపార పంటలే అన్నట్లు అయిపోయింది. పత్తి, మిర్చీ వంటి పంటలు వేసి లాభాలు పొందాలనే చూస్తున్నరు. ఒక్కసారి నష్టపోతే రైతులు కోలుకోలేకపోతున్నరు. అయితే ప్రాచీన వ్యవసాయాన్ని పునరుద్ధరించి రైతుకు ఆర్థిక భారం లేకుండా కాకుండా చూడాలనేదే తన సంకల్పం అంటారు బాలన్న.. ఆ తీరుగానే అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నరు. ఆయన సాగు విధానం తెలుసుకునేందుకు ప్రస్తుతం దేశ నలుమూలల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా శాస్త్రవేత్తలు వస్తున్నరు.
అగ్రికల్చర్‌కు హోమియో..
ఇండియాలో ఇప్పటి వరకు ఎవరూ చేయని ప్రయోగం బాలన్న ‘అమేయ కృషి వికాస కేంద్రం’లో చేస్తున్నారు. అదే అగ్రికల్చర్‌కు హోమియో మందుల వాడకం. ఈ ప్రయోగం అమోఘం. దీని ద్వారా రైతుకు పురుగుమందుల ఖర్చు భారం పూర్తిగా తగ్గుతుంది. అది ఎంతలా అంటే.. ఉదాహరణకు ఒక వంకా తోటకు తెగులు సోకితే వారానికోసారి మందు కొట్టాలి. కొట్టినప్పుడల్లా రూ.1000 ఖర్చు అవుతుంది. అలా నాలుగు నెలలు కాపు ఉండే తోటకు కనీసం 16 సార్లు మందుకొట్టాలి. దాదాపు రూ.16 వేలు ఖర్చు అవుతుంది. అదే బాలన్న తయారు చేసిన మందు (హోమియో మెడిసిన్) 100 ఎంఎల్రూ.250 ఉంటుంది. అలా 2.5 ఎంఎల్(డబ్బా)కు రూ.10 అవుతుంది. వెయ్యి రూపాయల మెడిసిన్రూ.10కే వస్తుంది. ఇలా వేల రూపాయల ఖర్చు.. పదుల్లోకి చేరితే రైతు తప్పకుండా రాజు అవుతాడంటారు బాలన్న..
- ‘కర్నాటకలోని చామ్‌రాజ్‌నగర్‌లో ఓ రైతు బొప్పాయి వేశాడు. దానికి రింగ్స్పడ్(తలలు ముడుచుకుపోవడం) అనే వైరస్వచ్చింది. శాస్త్రవేత్తలు తోటను మొదటికి నరికేయమన్నరు. కానీ, దానికి మనం హోమియో మెడిసిన్‌తో ట్రీట్మెంట్ఇచ్చినం. చేను బాగైంది. కాపు వచ్చింది.’
- ‘ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. జర్నలిజం కాకుండా నేను ఇంకేం చేయలేను అనేది ఉండొద్దు. నేనే ఏదైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను ఉద్యోగం వదిలేసినప్పుడు మా ఎడిటర్‌గారు ‘ఎట్ల బతుకుతవ్ అన్నడు. మట్టి మోసి బతుకుతా.. సార్’ అంటూ బయటకు వచ్చాను. ఇగో గిప్పుడు అదే మట్టి నమ్ముకుని, నేల తల్లికి సేవ చేసుకుంటూ బతుకుతున్న. సక్సెస్ సాధించడం కొంచెం కష్టమే.. కానీ శ్రమించే మనస్తత్వం ఉంటే సక్సెస్ తప్పకుండా నీ దరిచేరుతుంది. ఒక్కసారి సక్సెస్ సాధించామా.. ప్రపంచం నీ ముందు తలవంచుతుంది..’
అంటూ.. ఈ కష్టకాలంలో ఉద్యోగాలు కోల్పోయిన జర్నలిస్టులకు బాలన్న తన సందేశాన్ని ఇచ్చారు..
మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి.
– ఉప్పలంచి నరేందర్, డెస్క్ జర్నలిస్ట్
Nice.. Great
హ్యాట్సాఫ్ టు బాలన్న
మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ లు అందిస్తున్న సోదరుడు నరేందర్ అభినందనలు
Very inspiring ?