- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
జనగామ, మన చౌరాస్తా : పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్త్ రఫ్ చేసి, జాతికి బేషరతుగా మోడీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆదివారం ఆయన జనగామలో డీసీసీ కార్యాలయంలో డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన మోడీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టి, దేశ సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెడుతుందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి కులం, మతం, ప్రాంతం, భావం, భాష పేరుతో, దేవుని, దేశభక్తి పేరుతో ప్రజల మధ్య వైశ్యామ్యాలను రెచ్చగొదుతున్నారని ఆరోపించారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలపై హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారన్నారు.
స్వతంత్ర సంస్థలైన సీబీఐ , ఈడీ, ఎన్నికల కమిషన్‌ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చలాయిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతో పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడే విధంగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. ఒక్క అంబేద్కర్నే కాదు మహనీయులను ఎవరిని కించపరిచిన ఊరుకునేదే లేదని, రాబోయే రోజుల్లో దేశ ప్రజలు బీజేపీ తగిన గుణపాఠం చెబుతారన్నారు.
సమావేశంలో టీపీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, జనగామ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిర, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.