ఆయాళ్ల ఎంగిలిపూలు. శిన్న బతుకమ్మ షురూ. ఇంక ఎగిలివారలె. చెల్లె శీకట్లనే లేశింది. నా ముఖం మీదికెళ్లి గొంగడి గుంజి, ‘అన్న లేయే.. లే.. అబ్బలేయే..’ అని బుదురకిత్తంది. ‘లే.. పోరీ.. పండుకపో..’ అనంగనె.., ‘పోడా.. ఇయళ్ల శిన్న బతుకమ్మ.. పువ్వులు దెంపుకద్దం పా..’ అని కొట్టినట్టే అన్నది. ‘తెల్లారివోదంతీ..’ అనుకుంట అది గుంజేశిన గొంగడి దీశి నేను ముసుగ్గప్పుకున్న! ఇంటెనా! మళ్ల గుంజేసింది. ‘పొద్దువొడిశినంక అందరు దెంపుకపోతరు.. అన్నయిపోతయ్..’ అని మాడుపు మొఖంబెట్టింది. గంతల్నె గంప కింద కోడి కూశింది. ‘అంబా’ అన్నదావు. అవతల అవ్వ ఆకిలూడ్శిన సప్పుడైతంది. ఈ పోరేమొ పాణం దీత్తంది. ఇగ తప్పెటట్టు లేదు. కండ్లు తుడ్సుకుంటూ లేశిన. ఇద్దరం గల్శి బయిటికొచ్చినం. ‘గిప్పుడెట్రా’..! అని గద్దరిచ్చిందవ్వ. ‘కట్ల పూలకు..’ చెల్లె శిన్నగ చెప్పింది. ‘శీకట్ల పురుగువూశుంటది.. తెల్లారివోదురుతీ..’ అనె వరకు సప్పుడ్జేక గద్దె మీద గూసున్నం.
పోరగాళ్లతో ఎగబడి..
కొంచెం ఎగిలివార్తందనంగ ‘గుమ్మడి పూలు ఎండకల్లిపోతయ్.. తెంపి నీళ్లల్లెయిర్రి..’ అన్నది అవ్వ.. అవ్వ నోట్లకెల్లి మాటెల్లిందో లేదో చెల్లె, నేను పెంటకాడికి ఉర్కినం. పెద్దపెద్ద మొగ్గల జూశి, పదిగల దెంపినం. ఇంట్లకచ్చి గంజుల నీళ్లు పోశి దాంట్లేశినం. తెల్లారినట్లుగాంగనె కట్ల పూల కోసం బయిలెళ్లినం. మా వాడకట్టు మూలదిర్గంగనె మక్కపెరడుంది. గొడ్లు, గోర్లు రాకుంట సుట్టు ఎనుగునాటిన్రు. గా తుమ్మ పొర్కకు కట్ల తీగలు వారినయ్. శీకట్లనే ఆస్మాన్ రంగుల ఇర్గపూశినయ్. గవిట్ల జూశి, చెల్లె ముఖం వువ్వోలైంది. ‘అన్నా.. ఇంకెవ్వల్రాలె.. ఎవ్వల్దెంపలె.. అన్ని మనకే.. ఎయ్.. యెయ్..’ అనుకుంట ఎగురుతుంది. నేను నిక్కినిక్కి దందన్ గిన్నని దెంపంగనె, వాడకట్టు పోరగండ్లంతచ్చి ఎగబడ్డరు. ఎక్కడోళ్లక్కడ దెంపెవరకు బోడబోడయినయ్. మాకే ఎక్కువ దొర్కినా చెల్లెకైతె తుర్తిగాలె. ‘నేను జెప్పలేదా ముందుగాలద్దమని.!’ అనుకుంట మొఖమింత దొడ్డు పెట్టింది.
శెల్క మీద తీరొక్క పువ్వ..
‘అన్ని మనమే దెంపుకుంటె ఆళ్లకెట్లనే..! గివ్వే వేర్తవా ఏందీ..? శెల్కమీదకి వోతె తీరొక్క పువ్వు దొరుకుతది. ఇయళ్ల బడి లేనేతేదాయె. పొయ్యి తెంపుకొద్దమాగరాదు..! అవ్వివోంగ ఇంటికాడ గోరింట, ఉద్రాశ పూలు ఉండనే ఉండె..! అవన్ని వేర్తె, సద్దుల బతుకమ్మంత అయితత్తీ..!’ అని ఇంత లావు సదివెవరకు పండ్లిగిలిచ్చింది. ‘అయితే గిప్పుడే పోదమా..!’ అనుకుంట ఏమంటడోనని నా మొఖం జూసింది. ‘అయ్యో.. నీకు పాణమే ఆగదేమె.. బువ్వ దిన్నంక పోదాంతీ..!’ అని ఇంటి దిక్కు నడిశినం. మొఖం గడుక్కుని గింత దిని బయిలెళ్లినం. ‘పైలం పురుగువూశుంటది.. తాతను సూస్కుంట తెంపుమనుర్రి..’ అవ్వ జెప్పింది.
తాత గునుగు కోసిచ్చే..
శెయ్యిసంచి పట్టుకుని పొయ్యే వరకు తాత మిరప శేనుకు నీళ్లు కడుతుండు. ‘ఏందిరా.. ఎందుకత్తర్రు..!’ అని అడిగిండు. ‘బతుకమ్మ (bathukamma) పూలకు’ అని చెల్లె జెప్పింది. ‘నేను తెంపుకరాపోదునా.. పురుగువూశుంటది గాదు’ అనుకుంట మిరప శెన్ల ఓరలపొంటున్న పట్టుకుచ్చు పువ్వు ఇంతాంత ఇరిశిండు. కొడవలి వట్టి శెల్కల కొంచెం గునుగుపువ్వు గోశి ఇచ్చిండు. ‘గిదే సాల్తదా..?’ ఎక్కడ ఊకోబుద్దిగాక అన్నది చెల్లె. ‘శిన్న బతుకమ్మకు గిదంతేంజేస్కుంటవే.. గది సద్దుల బతుకమ్మకని కాపాడ్తన్న..!’ అని తాత గద్దరిచ్చె వరకు నోర్మూసుకున్నది. ‘నేను నీళ్లెటువాయేనో సూత్త.. మీరు బంతిపూలు తెంపుపోర్రి..’ అనంగనె నేను, చెల్లె ఇన్నన్ని దెంపి సంచిల పోసినం. ఏనెపొంటి తంగెడు పువ్వు, పొలం కింద ఒర్రెల పార్వతీపరమేశుని పువ్వులు, గడ్డిపువ్వులు తెంపిచ్చిండు తాత.
సత్తు పిండి ఆసన..
ఇంటికొచ్చే వరకు అవ్వ కొత్త శిబ్బి గొన్నది. మక్కసత్తు, పల్లి సత్తు దంచి, ముల్లెగట్టింది. వాసన కమ్మగత్తంది. ఇగ చెల్లెయితె నడిపొద్దుకేలె ‘ బతుకమ్మ వేర్వే.. బతుకమ్మ వేర్వే..’ అనుకుంట అవ్వను ఒకటే పోరువెట్టుడు..! ఇక దాని కొలుపు వశపడక నడింట్ల పీటేశి, దాని మీద శిబ్బి వెట్టి, పేర్సుడు మొదలువెట్టింది అవ్వ.
ముందుగ గుమ్మడాకులు పర్శి దాని మీద తంగెడు, గునుగు, పట్టుకుచ్చు, బంతి, పార్వతీపరమేశుని, గోరంట, ఉద్రాశ.. గిట్ల తీరొక్క పువ్వు పెట్టుకుంట గంట సేపు ఓపిగ్గ పేర్శింది.. అవ్వ.. ఇగ బతుకమ్మయితె ముద్దుగ కుదిరింది. ఆఖర్న గుమ్మడి పువ్వు, దాంట్ల పసుపు గౌరమ్మను వెట్టి మొక్కిది. చెల్లె, నేను గుడ మొక్కినంక దేవునింట్ల వెట్టినం.
ఇగ మూడుబజార్ల కాడ వాడకట్టు ఆడోళ్లంత జమై.. ఊడ్శెటోల్లు ఊడిశిన్రు, సల్లెటోళ్లు సల్లిన్రు. ఇంతెడెల్పుతోటి ఎర్రగా అలుకుతే చెల్లెగిట్ల ముగ్గులేసి, బొట్లు పెట్టింది. ఐదుగాంగనె అందరు బతుకమ్మలెత్తుకొచ్చిన్రు. అన్ని ఒక్కకాడ పెట్టేవరకు పూలతోటోలె గమ్మతిగొట్టింది. పోరగాళ్లు, పెద్దోళ్లు, ముసలోళ్లంతా గుమిగూడిన్రు. కొందరు నిలవడ్తె, మరికొందరు ఎర్రటి గోడ మీద గూసోని సూత్తన్రు. పోరగాళ్ల ఒర్రుడుకు గాయిగత్తర లెక్కుంది! గప్పడె బతుకమ్మ సుట్టూ ఆడోళ్ల సప్పట్లు మొదలైనయ్..
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..’ అని మా మంగు పెద్దవ్వ పాటందుకోంగనె సుట్టూర ఆవాజ్మొత్తం బందైంది. పాటొక్కటే ఇనిపిత్తంది. ఎంత సక్కటి పాటది..! పాటెన్క పాట.. ఎన్ని పాటలో.. అన్ని బతుకు పాటలె..!
- ‘రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో..’
- ‘ఎంటికలా దేవికీ ఉయ్యాలో.. ఎందరమ్మ కొడుకులూ ఉయ్యాలో..’
- ‘కట్ట మీద రెండు ఉయ్యాలో.. కల్యమా శెట్లట్ల ఉయ్యాలో..’
గిట్ల వాళ్ల పాటలు జూసేటెందుకు రెండు కండ్లు, ఇనెతందుకు రెండు శెవులు సాల్తలెవ్.. పది దాటినంకనే పాట ఆగింది. సప్పట్లాగినయ్.. అటెన్క బతుకమ్మలను శెరువులేశి, కట్ట మీద ‘కొత్త శిబ్బి.. పాత శిబ్బి..’ అనుకుంట సత్తు వంచుక తిన్న రోజులు ఇంకా కండ్లళ్ల మెదుళ్తునయ్.. పదేండ్ల కిందటి దాక తొమ్మిదొద్దుల పాటు ఊరుఊరంత సాగిన గీ పూల పూజలు, బతుకు పాటలు, సప్పట్లాటల తీరు గిప్పుడు పూర్తిగా మారిపాయె.. ఎంగిలిపూల బతుకమ్మకని మార్కెట్లకు వోతే గునుగు, తంగెడు, బంగిపూలే దొరికినయ్. గవ్వి గూడా పేర్శెతందుకు మా వోళ్లకు శాతగాలె! అత్తరబుత్తర పేర్శి పట్టుకపోయిన్రు. ఇగ మా కాలనీ ఆడోళ్లు వయిల జూస్కుంట ఒక్క పాట పాడెవరకె అలిశిపోయిన్రు. పది సుట్లు తిరిగే వరకే ‘అబ్బ నీ బాంచెన్’ అంటూ మొసకొచ్చిన్రు.. ఇగ సద్దుల బతుకమ్మ దాక ఆటలేదు. పాటలేదు..!
మరిన్ని కథనాలక కోసం క్లిక్ చేయండి
ముగింపు..
గిప్పుడు గీ యేడాది కరోనా పుణ్యమాని ‘బతుకమ్మ’ తీరే మారిపాయే. శిన్న బతుకమ్మ పండుగైతే సిన్నబోయింది. సూద్దామన్నా ఎక్కడ సప్పట్ల ఆటలు కనిపించలె. బతుకమ్మ పాటలు ఇనిపించలె. ఎవరికి వారు.. ఎవరిండ్లకాడ ఆళ్లే.. ఎవరి వరండాలో ఆళ్లే.. బతుకమ్మ ఆడారు.. సెల్ఫీలు పోటో దిగుడు.. సోషల్ మీడియాలో పెట్టుకునుడే పండుగైపోయింది. ఇక అధిక మాసంతో పండుగంతా తికమకైంది. చిన్న బతుకమ్మ ఆడిన తర్వాత తొమ్మిదొద్దులకు చేసుకునే సద్దుల పండుగ గీసారి నెల రోజుల తర్వాత చేసుకోవాల్సి వస్తోంది. సూద్దాం.. సద్దులన్న ధూంధాంగా అయితయో లేదో..!!