
- అధికార నిర్లక్ష్యంపై స్థానికుల నిరసన
హుస్నాబాద్,మన చౌరాస్తా : పిడుగు పడినా, చెట్టు వంగినా… అధికారులు మాత్రం కదల్లేదు..! హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో ఒక కొబ్బరి చెట్టు ఇప్పుడు “ప్రమాద హెచ్చరిక స్తంభం”గా నిలుస్తోంది. ఇటీవల ఈ చెట్టుపై పిడుగు పడటంతో చుట్టుపక్కల ఇళ్లలో ఫ్యాన్లు, స్విచ్ బోర్డులు పాడవగా, చెట్టు మాత్రం ఇంకా “సర్వైవల్ మోడ్”లో నిలబడింది. సంఘటన స్థలానికి వచ్చిన అధికారులు పరిస్థితిని పరిశీలించి, “చెట్టును తొలగిస్తాం” అని చెప్పి వెళ్లిపోయారు. అయితే ఆ హామీ చెట్టుతో పాటు గాలిలో కలిసిపోయిందా అన్న సందేహం స్థానికులకు కలుగుతోంది. రోజురోజుకు వంగిపోతున్న ఈ చెట్టు, “ఎవరిపై పడతానో చూద్దాం” అన్నట్లుగా నిలుస్తుండగా, పాదచారులు, వాహనదారులు భయంతో దూరం దాటుతున్నారు. మరోవైపు, వాతావరణ శాఖ మరోసారి పిడుగుల హెచ్చరికలు జారీ చేయడంతో, “ఈసారి చెట్టే గెలుస్తుందా? లేక అధికారులు స్పందిస్తారా?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానికులు మాత్రం వ్యంగ్యంగా, “చెట్టు పడిన తర్వాతే అధికారులు కదులుతారేమో!” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాన్ని తొలగిస్తారా? లేక ఈ చెట్టు “సెల్ఫీ పాయింట్”గా మారే వరకు వేచి చూస్తారా అన్నది చూడాలి.



