జనగామ కాంగ్రెస్‌లో ‘హస్త’వ్యస్తం
పార్టీ అంటే తండ్రీ కొడుకులేనా..?
వేరే వారికి చోటు లేదు.. రాదా..!
కొమ్మూరికి వ్యతిరేకంగా
సోషల్ మీడియాలో పోస్టులు
అధ్యక్షుడిపై అసహనం వ్యక్తం చేస్తున్న సొంత పార్టీ లీడర్లు
‘కాంగ్రెస్ పార్టీ అంటే తండ్రీ కొడుకులేనా..? వేరే వారికి చోటు లేదా..! రాదా..?..’ అంటూ డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై సొంత పార్టీ లీడర్లే అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఏళ్లుగా పని చేస్తున్న కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అవస్థలు పడ్డాం.. ఇప్పుడు అధికారం ఉన్నా అదే పరిస్థితేనా.. ఛీఛీ ఏంటో మా బతుకు..’అంటూ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు వేదనకు గురవుతున్నారు.
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : జనగామ జిల్లా కాంగ్రెస్ పరిస్థితి ‘హస్త’వ్య స్థంగా తయారైంది. సాక్షాత్తు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై సొంత పార్టీ నేతలు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతూ తమ అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. అయితే ఈ పోస్టులకు ప్రతిపక్ష పార్టీ నేతలు కామెంట్లు పెడుతూ మరింత వైరల్ చేస్తున్నారు.
ఆది నుంచి అదే తీరు..
జనగామ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి వర్గపోరుతోనే కుచించుకుపోతోంది. గతంలో అప్పటి టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, ప్రస్తుత డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అప్పటి డీసీసీ ప్రెసిడెంట్‌గా రాఘవరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ఈ ముగ్గురి నేతల మధ్య సయోధ్య లేక పార్టీ మూడు ముక్కలుగా చీలిపోయింది. అయితే ఎన్నికల ముందు జంగా రాఘవరెడ్డి హనుమకొండకు వెళ్లిపోవడం, పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ను వీడి గులాబీ గుటికి చేరడంతో పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో కొమ్మూరి చేతికి వచ్చాయి. దీంతో కొందరు నేతలు పొన్నాల వెంట వెళ్లగా.. జంగా వర్గం లీడర్లు చాలా వరకు కొమ్మూరి చెంతకు చేరారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్నికల్లో కొమ్మూరికి ప్రతికూల పరిస్థితులు ఎదురై ఓటమి పాలైన విషయం తెలిసింది. అయితే కొమ్మూరి ఓటమికి సొంత లీడర్లే కారణమని పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేస్తుండడంతో ఆయన కొందరు నేతలను దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ కాస్త రోజురోజుకూ
పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
కొమ్మూరిపై బహిరంగ పోస్టులు..
టీపీసీసీకి మహేశ్‌కుమార్‌గౌడ్‌ను అధ్యక్షుడిగా నియమిస్తూ ఇటీవల ఏఐసీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని చాలా మంది నేతలు కొత్త అధ్యక్షుడిని కలిసేందుకు క్యూ కడుతున్నారు. అయితే జనగామ నుంచి డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఆయన కుమారుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఇవి చూసిన కొందరు కాంగ్రెస్ లీడర్లు డీసీసీ అధ్యక్షుడిపై అసహనం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ అంటే తండ్రీ కొడుకులేనా..? వేరే వారికి చోటు లేదా..! రాదా..?’ అంటూ సోషల్ మీడియాలో కొటేషన్లు పెట్టి పోస్టు చేశారు. ఆ పోస్టులకు ప్రతిపక్ష పార్టీ లీడర్లు కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట అయిన జనగామలో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది.
కొసమెరుపు..
ఇదిలా ఉంటే.. రెండు రోజు కింద డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరిపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ కావడంతో.. తేరుకున్న ప్రతాప్‌రెడ్డి జిల్లాకు చెందిన దాదాపు 40 మంది లీడర్లును వెంట పెట్టుకుని మంగళవారం మరో మారు హైదరాబాద్ వెళ్లారు. ఈసారి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి కూడా కలవడం కొసమెరుపు..