Mbnr Desk journalist : ఆటోనడిపిన
బైరంపల్లి రమేశ్.. పక్కా పాలమూరు కుర్రాడు. మహబూబ్‌నగర్ జిల్లా బైరంపల్లికి చెందిన ఈయన సాక్షి జర్నలిజంలో నా బ్యాచ్మెంట్. మొదట మీడియా రంగంలో రూ.2,500 జీతానికి చేరినా.. జర్నలిజంపై మక్కువతో డెస్క్ జర్నలిస్టుగా మారాడు. తనకున్న టాటెంట్తో అనతి కాలంలో సెకండ్ ఇన్చార్జి స్థాయికి ఎదిగాడు. కానీ, ఆశించిన స్థాయి జీతం లేక ఆటో నడిపి కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. చివరకు ఈ ఎగుడుదిగుడు జర్నలిజం బతుకును వదిలి కొత్త దారి పట్టాడు.. ఇప్పుడు ఏడాదికి రూ.50 లక్షల బిజినెస్ చేస్తూ నెలకు రూ.80 వేల జీతంతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న రమేశ్ మన ‘చౌరాస్తా’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
టెక్నికల్‌గా వచ్చా..
మాది పాలమూరు (మహబూబ్‌నగర్) జిల్లా బైరంపల్లి గ్రామం. నాకు ఇద్దరు చెల్లెలు. ఇంట్లో నేనే పెద్దోడిని. అది 2006 సంవత్సరం.. అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన రోజులు. మా నాన్న (మురళీధర్‌రావు గారు) వీఆర్వో రిటైర్ అయ్యారు. ఇక నేను ఖాళీగా ఉండొద్దు ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఆశయంతో ‘వార్త’ న్యూస్ పేపర్లో టెక్నికల్ డిపార్ట్ మెంట్లో జాయిన్ అయ్యాను. అలా నేను ప్రెస్ ఫీల్డ్‌లోకి వచ్చాను. రాత్రి వేళల్లో పని. సాయంత్రం 5 గంటలకు వెళితే మధ్య రాత్రి 3 అయ్యేది. అలా ఒక ఏడాది గడిచాక బోర్ వచ్చేసింది.
కిక్ కోసం వెతుకులాట..
టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఎదుగుదల అంతగా ఉండదని అర్థమైంది. ఎడిటోరియల్ వైపు ఆకర్షితుడినయ్యా. ఎడిటింగ్ ఎలా చేయాలి. వార్తలు ఎలా రాయాలి. పేజీలు ఎలా పెట్టాలి. ఇలా అన్నింటి మీద ఒక అవగాహన పెంచుకున్నా. ఇంకేముంది స్నేహితుల సహకారంతో 2008లో సాక్షి పత్రిక ఎడిటోరియల్ డిపార్ట్ మెంట్లో పేజీ డిజైనర్‌గా చేరాను. ఎక్కడ ఉన్నా కుదురుగా ఉండని నా మెంటాలిటీ నాది. పేరుకు డిజైనర్ అయినా ఐటెమ్స్ ఎడిటింగ్‌లో కూడా వేలు పెట్టేవాడిని. అది చూసి మా గురువు గారు కోటేశ్వరరావు సార్ డెస్క్ వైపు వెళ్లేందుకు ప్రోత్సాహించారు. అలా సాక్షి జర్నలిజం ఎగ్జామ్ రాసి సబ్ ఎడిటర్‌గా (Mbnr Desk journalist) సెలెక్ట్ అయ్యాను. ఉప్పల్ బ్యాచ్‌లో నీతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నా.. (నవ్వుతూ..)
ఆశించిన జీతం లేక..
సబ్ ఎడిటర్ అయినా.. ఆశించిన మేర జీతం లేక.. జీవితం సాఫీగానే సాగక ఇబ్బంది పడేవాడిని. రాత్రి వేళల్లో డ్యూటీ కావడంతో ఉదయం ఖాళీ సమయం ఉండేది. అలాగని నేను ఖాళీగా ఉండేవాడిని కాదు. కుటుంబ బాధ్యతలతో ఉదయం పూట ఆటో నడిపిన రోజులు కూడా ఉన్నాయి. అయినా ఏదో ఒక వెలితి. అసలు నేను వెళ్తున్నదారి కరెక్టేనా అని చాలా ఆలోచించేవాడిని. అలా నాలుగేళ్ల ప్రస్థానం తర్వాత కొద్ది జీతం అదనంగా తీసుకుంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక సంవత్సరం పాటు పనిచేశా.. అప్పటి ఎడిషన్ ఇంచార్జి చిల్లా మల్లేశం సార్ (ప్రస్తుతం వెలుగు) ప్రోత్సాహంతో 2011లో నమస్తే తెలంగాణ పేపర్లోకి వెళ్లాను. ఆయనతో పని చేసిన సమయంలోనే భాష మీద మంచి పట్టు సాధించా. సార్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నా.
నమస్తేలో ఫస్ట్ పేజీ..
మొదట వార్త పేపర్లో టెక్నికల్ డిపార్ట్ మెంట్లో పనిచేసినా.. నమస్తే తెలంగాణలోకి వచ్చే సమయానికి దాదాపు అన్ని పనులు నేర్చుకున్నా.. తోటి సబ్ ఎడిటర్ల సాయంతో ‘నమస్తే’లో ఫస్ట్ పేజీ వార్తలు ఎడిటింగ్, పేజీ డిజైన్ కూడా చేసే వాడిని.. నేను ఆ స్థాయికి చేరేందుకు చాలా మంది సహకారం అందించారు. పనిలో మంచి ఎంజాయ్ చేస్తూ సాగుతున్నా.. సాలరీ సంతృప్తి మాత్రం ఉండేది కాదు. ఎంత పని చేసినా జీతం పెరిగే టైంలో ఎవరికి పెరగాలో నిర్ణయించేది పెద్ద సార్లే కదా.. (నవ్వువతూ).. అలా నాకు అన్యాయమే జరిగేది. ఇంకేముంది మళ్లీ ఆలోచనలు..
ఇలాగే ఉంటే ఏం అవుతాం.. మహా అయితే ఇంచార్జి.. అంతకు మించి ఏం ఉండదు. అయినా అంత కాలం ఎదురు చూసే ఓపిక నాకు అసలే లేదు.
అని ఆలోచించి 2016 నవంబర్‌లో ఉద్యోగానికి గుడ్ బై చెప్పాను. అదే ఏడాది నాకు పెళ్లయ్యింది. మా ఆవిడ పేరు నవ్య. ఇప్పుడు మాకు ఒక పాప. పేరు సహన.
ఇన్సూరెన్స్ రంగంలో అడుగు..
సాక్షి పత్రికలో కలిసి పని చేసిన రాజన్న ప్రోత్సాహంతో ‘స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్’ రంగంలోకి 2016 డిసెంబర్లో అడుగుపెట్టా. అయితే సుమారు 10 సంవత్సరాల అనుభవం ఇప్పుడు నేను వచ్చిన ఇన్సూరెన్స్ కు పూర్తి వ్యతిరేకం. సాధారణంగా సబ్ ఎడిటర్లకు బయట జనాలతో పరిచయాలు చాలా తక్కువ. కానీ, నేను దానికి పూర్తి విరుద్ధం. నా కిక్ తాలూకు పనులతో నాకు పరిచయాలు చాలా ఉన్నాయి. అవే ఇక్కడ చాలా పని చేశాయి. వచ్చిన మొదటి సంవత్సరం సుమారు రూ.13లక్షల బిజినెస్ ఇచ్చి ఒక ప్రత్యేకత ఏర్పరుచుకున్నా. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో నాకంటూ సుమారు 450 మంది కస్టమర్లు ఉన్నారు. ఈ ఏడాది రూ.50 లక్షల బిజినెస్‌తో దూసుకుపోతున్నానని చెప్పడంలో నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇక చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే.. మీడియా రంగం గౌరవ ప్రదమైన వృత్తి. కానీ, ఇందులో నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే వాడికి గుర్తింపు తక్కువ. నాకు పదేళ్ల అనుభవం తర్వాత అది తెలిసొచ్చింది. ఇందులో నుంచి బయట పడ్డాక తెలిసింది. బయట కూడా ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయని.. ఇప్పుడు కరోనా కష్టం కాలంలో చాలా సంస్థల్లో ఉద్యోగాలు పోయాయి. కానీ నేను కరోనా కాలంలో నెలకు రూ. 60 నుంచి రూ. 80 వేలకు తగ్గకుండా జీతం తీసుకుంటున్నా. ప్రస్తుతం ప్రెస్ లో పనిచేస్తున్న వారు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ ఒక్కసారి బయటకు వచ్చి చూడండి.. మీకు మీరే మరో కొత్త ప్రపంచానికి పరిచయం అవుతారు. జీవితంలో ఎప్పుడు ఏదో ఒక కిక్ తో బతకడానికి ప్రయత్నం చేయండి. కచ్చితంగా విజయం సాధిస్తారు..
ముగింపు..
రమేశ్, నేను ఒకే సారిగా సబ్ ఎడిటర్‌గా పోస్టింగ్ తీసుకున్నాం. ఆయన మహబూబ్‌నగర్‌లో, నేను వరంగల్ జాయిన్ అయ్యాము. ప్రాంతాలు దూరమైనా ఎప్పుడూ ఫోన్లో టచ్‌లో ఉండేవాడు. 2012 లేదా 2013 అనుకుంటా చిన్నపెండ్యాలలో ఓ మిత్రుడి వివాహానికి వచ్చి రెండు రోజులు ఇక్కడే ఉన్నాడు. ఎంతో సరదాగా ఉండే వ్యక్తిత్వం ఆయనది. దాదాపు 10 ఏళ్లు పాటు డెస్క్ జర్నలిస్టుగా పనిచేసిన ఆయన ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొన్నాడు. రమేశ్ డ్యూటీ మానేసిన తర్వాత తన నుంచి ఫోన్ రావడం కూడా తగ్గిపోయింది. ఇటీవల ‘కొత్త దారిలో పాత మిత్రులు’ కథనాలను చూశాక ఓ రోజు కాల్ చేశాడు. అంతే నా శీర్షికకు మరో హీరో దొరికాడని నేను గంతేశా.. కానీ, రమేశ్‌ను మాటల్లోకి దింపిన నాకూ నాటి జ్ఞపకాలు కళ్లముందు తిరిగాయి. ఆయన మాత్రం తను ఆటో డ్రైవర్‌గా పనిచేసిన జ్ఞపకాలను గుర్తుచేసుకుని భవోద్వేగానికి లోనయ్యాడు. 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాక్షి జర్నలిజం బ్యాచ్‌లో 150 మందికి పైగా సబ్ ఎడిటర్లుగా ట్రైనింగ్ తీసుకున్నాం.. మీడియా రంగంలోకి అడుగుపెట్టాం. కారణాలు ఏమైనా ఇప్పుడు అందులో కొందరు (వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో) మాత్రమే పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నా ‘కొత్త దారి’ శీర్షికలో నాటి మిత్రులందరినీ పరిచయం చేస్తా..
ఒకే ఫ్రెండ్స్ సీ యూ..
– ఉప్పలంచి నరేందర్, డెస్క్ జర్నలిస్టు
Super
What a great struggled in u r life bro but Finally u r happy with win.
U r one of the person mostly
inspiring to me bro .
God bless u bro
Super ramesh