
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : భీమదేవరపల్లి మండలం కొత్తపెళ్లి గ్రామానికి చెందిన పులి దేవయ్య (65) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత 45 సంవత్సరాలుగా ముల్కనూర్ గ్రామ అంబేద్కర్ చౌరస్తా వద్ద చెప్పులు కుట్టే వృత్తిని కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతూ వచ్చారు. తన తండ్రి నుంచి వారసత్వంగా అందుకున్న ఈ కులవృత్తిని ఇంతకాలం కొనసాగిస్తూ పేదరికంలోనూ ముగ్గురు ఆడపిల్లలకు ఉన్నత విద్య కల్పించి వివాహాలు జరిపించడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. మండల ప్రజలందరితో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్న దేవయ్య మరణం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. నేటి ఆధునిక సమాజంలో చెప్పులు కుట్టే వృత్తి నెమ్మదిగా అంతరించిపోతున్న తరుణంలో ఆ వృత్తిని చివరి వరకు నిలబెట్టిన దేవయ్య మరణం సామాజిక వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఆయనకు ప్రజా సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు.





