
- జనగామలో ‘శ్రీ శారదా స్వరలహరి’ స్థాపన
జనగామ, మన చౌరాస్తా : జనగామ కవులు, కళాకారులకు పెట్టింది పేరు. అలాంటి పేరున్న ఈ ప్రాంతంలో సంగీత ప్రియుల కోసం ‘శ్రీ శారదా స్వరలహరి’ పేరుతో ఓ కొత్త వేదిక ఆవిర్భవించింది. ఆదివారం పట్టణంలోని గౌతమి మోడల్ స్కూల్ ఆవరణలో ఈ సంస్థ ఆవిర్భావోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ సభకు సంస్థ కన్వీనర్ ఎస్.విష్ణుచరణ్ నేతృత్వం వహించగా ప్రముఖ కవి, రచయిత చింతపట్ల సుదర్శన్ ముఖ్య అతిథిగా.. నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెట్లట్ల రవీందర్ రావు విష్ట అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చింతపట్ల సుదర్శన్ మాట్లాడుతూ పాట పుట్టుక, దాని ప్రయాణం.. పాట చేసే మేలును సంగీత ప్రియులకు క్లుప్తంగా వివరించారు. యువ, ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడంతో పాటు రిటైర్ అయి శేష జీవితం గడిపే సంగీత ప్రియులను ఒక్క తాటిపైకి తెచ్చి ప్రస్తుత ఒత్తిడి జీవితం నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా ఈ ‘శ్రీ శారదా స్వరలహరి’ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాయకులు ఎస్బీఐ మేనేజర్ దుర్గాప్రసాద్, మాతో సురేందర్ రెడ్డి, డి.అరవింద్రాచారి, ఎస్.వి.ఎస్ గిరి, పి.అనిల్ బాబు, కొండ శ్రీనివాస్, శ్రీశైలం, రాజ్‌కుమార్, ఎం.ఎస్ రెడ్డి, భగవాన్ రెడ్డి, రమేశ్‌తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా కార్యక్రమానికి ముందు గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే జనగామ సోషల్ వెల్ఫేర్ ఆర్ట్ టీచర్ వేణుమాధవ్ ‘వేణు’ గానం, నెల్లుట్లకు చెందిన ఎబొనైజర్, కెజియా ఆలపించిన మృదంగ గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




