
- వీహెచ్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ
- వైభవంగా గురు పూజోత్సవం
జనగామ, మన చౌరాస్తా : సనాతన వైదిక సంస్కృతిలో గురువే నిత్య ఆరాధ్యుడని, పరబ్రహ్మ స్వరూపమని మోహనకృష్ణ భార్గవ అన్నారు. గురువారం ఆషాఢమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. భగవాన్ శ్రీవేద వ్యాస మహర్షి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ముందు ప్రధాన కలశస్థాపన చేసి వ్యాసుల వారు, నవబ్రహ్మలు, సప్తర్షులను, గురుపరంపరా ఆచార్యులను ఆవాహన చేసి అష్టోత్తర శతనామాలతో, మహా నీరాజనం, మహా మంత్రపుష్పాలతో ఆరాధన నిర్వహించారు. భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని వేదవ్యాస మహర్షిని ఆరాధించారు.
అనంతరం విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనకృష్ణ మాట్లాడుతూ మహర్షులు చూపిన బాటలో ధర్మాన్ని అనుసరించడం ద్వారా విలువలతో కూడిన జీవితాన్ని పొందుతామన్నారు. గురువులను ఆరాధించాలని అన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు పాశం శ్రీశైలం, బచ్చు బాలనారాయణ, పట్టణ కోశాధికారి కుందారపు బైరునాథ్, కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, సభ్యులు ఉల్లెంగుల రాజు, అంచూరి రమేష్, కందాడి యాదగిరి, యెలసాని కృష్ణమూర్తి, రాంబాబు, చంద్రమౌళి, సత్యం, సంపత్ గౌడ్, వివేక్, పోచన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.