
బచ్చన్నపేట, మన చౌరాస్తా : కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచ్లు తలపెట్టిన చలో అసెంబ్లీ సందర్భంగా బచ్చన్నపేట మండలంలోని మాజీ సర్పంచ్ లు కోనేటి స్వామి , పర్వతం మధు, ప్రసాద్, ముసిని సునీత, రాజు గౌడ్ , మహమ్మద్ కలిలా బేగం, ఆజాం , శివరాత్రి రాజ నరసయ్య, పంజాల తార శ్రీధర్ గౌడ్, తాతిరెడ్డి భవాని శశిధర్ రెడ్డి లను పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ ఊరి అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి ఉన్న ఆస్తులు అమ్మి ఊరు బాగు కోసం పాటుపడితే నేడు ప్రభుత్వం మా పెండింగ్ బిల్లులను విడుదల చేయకుండా సర్పంచ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలరోజుల వ్యవధిలో పెండింగ్ బిల్లుని విడుదల చేస్తామని చెప్పి సంవత్సరకాలం గడుస్తున్నప్పటికీ సమస్యలు పట్టించుకోకపోగా తమ సమస్యలు చెప్పుకోవాలంటే అవకాశం కల్పించకుండా ఎక్కడికక్కడే అర్ధరాత్రి పోలీసులచే అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తమ పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేసి తమకు న్యాయం చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.