- పాలకుర్తి ఎమ్మెల్యే వర్సెస్ జడ్పీటీసీలు
- తొలి సభలో ఫొటోలు.. ఈసారి నిలదీతలు
- అసహనం వ్యక్తం చేసిన యశస్వినిరెడ్డి
జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : జనగామ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభసగా సాగింది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించగా.. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే పాలకుర్తి, నర్మెట, కొండకండ్ల జడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాస్, శ్రీనివాస్ నాయక్, జ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు రావడం లేదని, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు పడిందో తెలపాలని డిమాండ్ చేశారు. ఇందుకు డీఏవో వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో లాగా అందరికీ రైతు బంధు ఇస్తుందని, కానీ కటప్ గురించి తమకు సమాచారం లేదని తెలిపారు. దీంతో జడ్పీటీసీలు ఎన్ని ఎకరాల వరకు ఎన్ని డబ్బులు వచ్చాయో సరైన వివరాలు కావాలని మళ్లీ డిమాండ్ చేశారు. ఇందుకు ఎమ్మెల్యే యశస్విని సమాధానం ఇస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెట్లకు, గుట్టలకు, అనర్హులకు రైతు బంధు ఇచ్చారని, ఈ పథకంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అసలైన అర్హులకు రైతు బంధు వస్తుందన్నారు. అసలైన అర్హతలు ఉండి రైతు బంధు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పకుండా అందరికీ రైతు బంధు వస్తుందన్నారు. కటప్ గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో పాలకుర్తి జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్ గతంలో అక్రమాలు జరిగాయని, మీరు ఎలా అంటారు? మేము ఏమి అడుతున్నాం.. ? మీరు ఏమి చెబుతున్నారు.. ? మీకు అవగాహన ఉండి మాట్లాడుతూ ఉన్నారా? ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో .. ఎమ్మెల్యే కలుగజేసుకుని ‘ముందు మీరు కామన్ సెన్స్ నేర్చుకుని మాట్లాడండి.. నేను ఎలా మాట్లాడుతున్నా.. మీరు ఎలా మాట్లాడుతున్నారు..’ అంటూ అసహనం వ్యక్తం చేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
తొలి సభలో ఫొటోలు.. ఈసారి నిలదీతలు..
పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్వినిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక గతంలో జరిగిన జడ్పీ సమావేశానికి తొలిసారిగా వచ్చారు. ఆ సమయంలో పార్టీలకతీంగా పలువురు జడ్పీటీసీలు ఆమెను కలిసి ఫొటోలు దీగేందుకు ఎగబడ్డారు. కానీ శుక్రవారం సమావేశానికి వచ్చిన ఆమెపై బీఆర్ఎస్కు చెందిన జడ్పీటీసీలంతా మూకుమ్మడిగా వాదనకు దిగడంతో ఎమ్మెల్యే అసహనంతో సభ మధ్యలోనే వెళ్లిపోయారు. ఏదీ ఏమైనా ప్రజా సమస్యలపై చర్చి పరిష్కార మార్గాలు చూపాల్సిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఇష్టారీతి వ్యహరించి సమయం వృథా చేయడం తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదని ప్రజలు అంటున్నారు.
ప్రభుత్వం పోయినా.. రౌడీయిజం పోలే..
– ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినా.. ఇంకా ఆ పార్టీ లీడర్లకు గుండాయిజం, రౌడీయిజం పోలేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విమర్శించారు. జడ్పీ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. జడ్పీ మీటింగ్ నిర్వహణ సరిగా లేదని, బీఆర్ఎస్ లీడర్లు రౌడీల్లా విరుచుకుపడుతున్నారు. ప్రజలు ఇప్పటికే బుద్ది చెప్పినా వారు ఇంకా మారలేదన్నారు. రాబోయే రోజుల్లో మరింత గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.