
- జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి
జనగామ, మన చౌరాస్తా : జనగామ జిల్లా పేరును మార్చొద్దని జిల్లా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని చౌరాస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు మాట్లాడుతూ జనగామ జిల్లా పేరు మార్చే ఉద్యమాలు చేయొద్దని కుల సంఘాలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా పేరు మార్చే చర్యలు చేపట్టొద్దని కోరారు.
జనగామ అనే పేరు ఒక చారిత్రక నేపథ్యం ఉన్నదని, ఈ గడ్డపై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగి, నల్ల నర్సింహులు, చుక్క సత్తయ్య, బమ్మెర పోతన, పాల్కూరు సోమనాథుడు ఇంకా ఎందరో మహనీయులు జన్మించారన్నారు. ఒక చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ ప్రాంతానికి జనగామ పేరు కొనసాగుతూ వస్తుందని, అటువంటి పేరును మార్చడం అంటే తల్లి పేరును మార్చడమే అవుతుందన్నారు. ఒక వేళ మహనీయుల పేర్లు పెట్టాలనుకుంటే జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులకు లేదా కొత్త మండలాలకి పెట్టాలని కోరారు. జనగామ జిల్లా పేరు మార్చాలని ఆలోచన ఏ కుల సంఘం కూడా చేయకూడదని జనగామ జేఏసీ పక్షాన చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నట్టు రాజు పేర్కొన్నారు.
కార్యక్రమంలో టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల సురేష్, బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఆసర్ల సుభాష్, వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లరావు, టీజీవీపీ పట్టణ అధ్యక్షుడు వెంపటి అజయ్, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అప్రోచ్ తదితరులు పాల్గొన్నారు.