- ముత్తిరెడ్డి, పల్లా, పోచంపల్లి.. మండల, నాగపురి, జల్లి..
జనగామ అంతా లొల్లి లొల్లి..! - చీలిన జనగామ బీఆర్ఎస్ లీడర్లు
- ఒకటి కాదు.. రెండు కాదు.. ఆరు గ్రూపులు
- బీఆర్ఎస్లో ‘గ్రూప్ ఫైట్’కు చెక్ పడేనా..
- లీడర్ల మధ్య సఖ్యత కుదిరేనా!
- కార్యకర్తలను తొలుస్తున్న ప్రశ్నలెన్నో..!
ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది జనగామ బీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కనుసన్నల్లో కొనసాగిన లీడర్లంతా ఆయనకు వ్యతిరేకంగా మారి.. అటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలుగా చీలిపోయారు. దీంతో జనగామ బీఆర్ఎస్ మూడు గ్రూపులుగా విడిపోయింది. అయితే లోకల్ గళంతో పాటు ‘బీసీ’ కార్డుతో కారు పార్టీలోని మరో ముగ్గురు లీడర్లు ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగపురి కిరణ్‌కుమార్, తెలంగాణ ఉద్యమకారుడు, మద్దూరు మాజీ జడ్పీటీసీ జల్లి సిద్ధయ్య వేరు కుంపటి పెట్టారు. దీంతో కారు పార్టీ ఇప్పుడు ఆరు గ్రూపుగా వీడిపోయింది.
టికెట్ తెచ్చిన తంటా..
ఇటీవల రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా 115 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఆపిన నాలుగింటిలో జనగామ ఒకటి కావడం విశేషం. మొదటి నుంచి జనగామ టికెట్ ముచ్చటగా మూడో సారి తనకే వస్తుందని, కేసీఆర్ సర్వేలో జనగామ టాప్ టెన్‌లో ఉందని ధీమాతో ఉన్నారు. మొదటి లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో ముత్తిరెడ్డికి అనుకోని విధంగా షాక్ తగిలినట్టు అయ్యింది. ఈ పరిణామాలతో స్థానికంగా రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే జనగామ టికెట్ కన్ఫం అయ్యిందని ప్రచారం జోరందుకుంది. ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గీయులంతా పల్లా గుటికి చేరడంతో పార్టీ లీడర్లు చీలిపోయారు. ఇంకో వైపు మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మద్దతు ఇచ్చే వారు కూడా వేరుకుంపటి పెట్టారు. ఈ ముగ్గురు టికెట్ కోసం గట్టి లాబింగ్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో పల్లా, ముత్తిరెడ్డి మధ్య వార్ మరింత పెరిగింది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగడంతో పార్టీ పరువు బజారున పడినట్టు అయ్యింది. ఈ పరిణామాలను గమనించిన మంత్రి కేటీఆర్ జనగామ లీడర్లపై గుర్రు మీద ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన కేటీఆర్ జనగామపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని ఇద్దరు ఎమ్మెల్సీలు పల్లా, పోచంపల్లికి కేటీఆర్ స్వయంగా వారింగ్ ఇచ్చినట్టు ముత్తిరెడ్డి నిన్నటి ప్రెస్ మీట్లో ప్రకటించారు. ఇదే సమయంలో జనగామ లీడర్లను కలుపుకుని సమన్వయంతో ముచ్చటగా మూడో సారి తానే ఎమ్మెల్యే అవుతానన్నారు. అయితే గ్రూపులుగా చీలిన లీడర్లు ఒక్కటవుతారా అనేది ప్రశ్నార్థకమే..?
చిన్న బాస్.. ఆశీస్సులు ఉన్నవారికే..!
జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసు రోజురోజుకు పెరుగుతోంది. 115 అసెంబ్లీలకు అభ్యర్థలను ప్రకటించిన సీఎం కేసీఆర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఒకటైన పాలకుర్తి సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కెటాయించగా.. మరో నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను పక్కన పెట్టి ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక జనగామ టికెట్‌ను పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఈ టికెట్‌పై ఆశవాహులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి జనగామ టికెట్‌పై కోసం పోటీ పడుతున్నారు. మరో వైపు లోకల్ లీడర్, బీసీ నినాదంతో ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, నాగపురి కిరణ్‌కుమార్, జల్లి సిద్ధయ్య, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన రెడ్డి ఉమాదేవి.. ఇలా ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎవరెన్ని ఆశలు పెట్టుకున్నా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులు ఉన్న వారికే దక్కే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఇందు కోసం లీడర్లు పడరాని పాట్లు పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. చిన్న బాస్ మెప్పు కోసం ఇటీవల కేటీఆర్ విదేశీ టూర్ ముగించుకుని వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ పత్యేక యాడ్స్ వేశారు. ఇది పార్టీ వర్గల్లో చర్చనీయాంశంగా మారింది. మరో వైపు కేటీఆర్ సన్నిహితుడుగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కూడా సైలెంట్‌గా సీటు రేసులో సాగుతున్నారు. అసలు జనగామ టికెట్ ఆపింది.. పోచంపల్లి కోసమే అనే ప్రచారం కూడా ఉంది. ఏదీ ఏమైనా.. చిన్న బాస్ చల్లి చూపు ఎవరి మీద పడుతుందో.. వేచి చూడాలి మరి..!
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)