
- ఎరికి చెప్పుకుంటావో చెప్పుకో..
- నీ కోసం రూ.10 లక్షలైనా ఖర్చు పెడతా!
- జర్నలిస్టుకు కాంగ్రెస్ కార్యకర్త బెదిరింపు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : ‘నేను నిన్న జరిగిన మీటింగ్‌లో పాల్గొన్నా.. మీ పేపర్లో నా ఫొటో ఎందుకు పెట్టలేదు.. నేనంటే ఏమనుకుంటావ్.. నేను తల్చుకుంటే నిన్ను అంకుశంలో రాంరెడ్డిని కొట్టినట్టు బట్టలు ఊడదీసి కొడుతా.. అందుకు రూ.10 లక్షలు ఖర్చు అయినా పెడుతా..’ అంటూ ఓ కాంగ్రెస్ నేత జర్నలిస్టుపై రుసరుసలాడాడు. జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. జర్నలిస్టును దుర్భాలాడుతూ బెదిరింపులకు పాల్పడిన సదరు కార్యకర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
జనగామకు చెందిన మహమ్మద్ అబిద్ ఫైసల్ ఖురేషి మున్సిఫ్ (ఉర్దూ) దినపత్రికకు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా అధ్యక్షతన రంజాన్ పండుగపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ రోజు జరిగిన సమావేశానికి సంబంధించిన వార్త మున్సిఫ్ దిన పత్రికలో మరుసటి రోజు ప్రచురితమైంది. ఈ వార్తకు సంబంధించి జనగామకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మహ మ్మద్ అజార్ ఈ నెల 27న (గురువారం) సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో సదరు రిపోర్టర్ కు ఫోన్ చేశాడు. కలెక్టర్ సమావేశంలో ఉన్నా.. తన ఫొటో ఎందుకు వార్తలో రాలేదుని దుర్భాషలాడాడు. విలేకరి ఫ్యామిలీని సైతం వదలలేదు. ‘నా గురించి నీకు తెలియదు అంకుశం సినిమాలో రాంరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తా.. అందుకు రూ.10 లక్షలు అయినా ఖర్చు చేస్తా..’ అంటూ బెదిరించినట్టు బాధితుడు పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో వాపోయాడు. దీంతో భయాందోళనకు గురైన సదరు విలేకరి అబిద్ ఫైసల్ ఖురేషి శుక్రవారం స్థానికంగా ఉన్న జర్నలిస్టులకు విషయాన్ని వివరించారు. వారి సలహా మేరకు తనను బెదిరించిన అజార్‌పై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పైరవీల పేరుతో దందా..!
కాంగ్రెస్ కార్యకర్తగా చలామణి అవుతున్న అజార్ తీరుపై పలు విమర్శలు ఉన్నాయి. ఆయన నిత్యం కొందరు ప్రభుత్వ అధికారులు, పోలీసులతో అంటకాగుతూ పలు సెటిల్మెంట్లు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉంటూ నిత్యం పోలీస్ స్టేషన్ వచ్చే వారిని పసిగట్టి పోలీసులు తనకు సన్నిహితులని ప్రచారం చేసుకుంటూ వారి సమస్యలు తీరుస్తానని నమ్మబలికి డబ్బులు దండుకుంటాడనే కొందరు లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు. పోలీసులకు సైతం తాను విలేకరిని అని చెప్పుకుంటూ స్టేషన్లో తిరుగుతుంటాడనే ఆ వర్గాలు చెబుతున్నాయి.
జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి
జనగామలో జర్నలిస్టులపై జరుతున్న దాడులు, బెదిరింపులను అడ్డుకోవాలని పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో టీవీ 9 జర్నలిస్టు కాసాని ఉపేందర్‌పై జరిగిన దాడి మరువకముందే తాజాగా మున్సిఫ్ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ అబిద్ ఫైసల్ ఖురేషిపై బెదిరింపు ఘటన జరుగడాన్ని జర్నలిస్టు నేత తీవ్రంగా ఖండించారు. జరిగిన ఘటనలపై పోలీసులు విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, మరో మారు ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నేతలు జాల రమేష్, ఎస్.భిక్షపతి, ఉప్పలంచి నరేందర్, బొమ్మగాని శ్రీకాంత్ గౌడ్, చీల కిరణ్ కుమార్, జమాల్ షరీఫ్, ఉపేందర్, ఎజాజ్, తిప్పారపు ఉపేందర్, గుడికందుల కృష్ణ, గన్ను కార్తీక్, ఓంకార్, క్రాంతి పాల్గొన్నారు.