- కొమ్మూరిపై సమగ్ర సర్వే తర్వాతే అధ్యక్ష పదవి!
- పార్టీ మారేవాళ్లకు పగ్గాలా ఎలా?
- లోకల్ లీడర్లను గుర్తించాలని విమర్శలు
- చెక్ పెట్టే పనిలో ప్రతాప్‌రెడ్డి
జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు రోజురోజుకూ మలుపు తిరుగుతోంది. ఇటీవల పార్టీ హైకమాండ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని జనగామ డీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించిన విషయం తెలిసిందే.. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అధ్యక్షులను కెటాయించిన హైకమాండ్ జనగామను మాత్రం హోల్డ్‌లో పెట్టింది. జిల్లాలో సగ్ర సర్వే తర్వాతే కొమ్మూరికి డీసీసీ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే ఆయన నియామకాన్ని పార్టీ సీనియర్ లీడర్లు, పొన్నాల వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి ధర్మ సంతోష్ కొమ్మూరిపై నిరసన గళం విప్పారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని పార్టీ మారే వ్యక్తలకు ఇవ్వడం సరికాదని విమర్శలు చేశారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. స్థానికంగా ఉండి పార్టీ సేవలందించిన లోకల్ లీడర్లు ఎవరికి డీసీసీ బాధ్యతలు ఇచ్చినా కలిసి పనిచేస్తామన్నారు. దీనిపై హైకమాండ్ పునరాలోచించాలని రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెరపైకి స్థానిక లీడర్ల పేర్లు
జనగామలో రాజకీయాల్లో దాదాపు అన్ని పార్టీల్లో స్థానికేతరులే రాజ్యమేలుతున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ డీసీసీ పీఠానికి స్థానిక లీడర్లే నియమించాలంటూ సంతోష్‌రెడ్డి కొందరి పేర్లను తెరపైకి తెచ్చారు. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ లీడర్లు మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణరెడ్డి, రెడ్డి, మహేందర్‌రెడ్డి, కంచె రాములుతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవర్గానికి చెందిన మహిళా నాయకురాలు సింగపురం ఇందిరకు పేర్లను తెరపైకి తెచ్చారు. వీరిలో ఎవరికి పదవి ఇచ్చినా కలిసి పనిచేస్తామన్నారు.
అంతా డబుల్ రోల్..!
ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న జనగామలో సీనియర్ నేతల అధిపత్య పోరుతో పార్టీ భ్రష్టు పట్టిస్తున్నారని కొందరు సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇప్పటికే జిల్లాలో పొన్నాల, కొమ్మూరి, జంగా వర్గాలుగా విడిపోయిన లీడర్లు పార్టీలో పలు శాఖల్లో కూడా ఇద్దరు ఇద్దరు తామంటే తామే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ పొన్నాల వర్గంగా ముందుకు సాగుతున్నారు. అయితే జంగా వర్గం నుంచి కూడా చెంచారపు బుచ్చిరెడ్డి (జంగా వర్గం) తానే పట్టణ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నారు. మండల అధ్యక్షుడిగా అడవికేశ్వాపూర్కు చెందిన కొన్నె మహేందర్‌రెడ్డి (పొన్నాల వర్గం), ఎర్రగొల్లపహాడ్‌కు చెందిన చిర్ర సత్యనారాయణరెడ్డి (జంగా వర్గం) తామంటే తామంటూ ముందుకు సాగుతున్నారు. ఇక యూత్ కాంగ్రెస్‌కు తానే ప్రెసిడెంట్ అంటూ ఎం.డి మాజీద్ (పొన్నాల వర్గం), ఎం.డి అష్షు (జంగా వర్గం) ఎవరికి వారు తిరుగుతుండగా.. బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా వేమల్ల రాజనర్సింహులు (పొన్నాల వర్గం), కొత్త ప్రభాకర్‌రెడ్డి (జంగా వర్గం) చెప్పుకుంటున్నారు. ఈ డబుల్ రోల్ రాజకీయాలతో పార్టీ క్యాడర్ అయోమయంలో గురవుతోంది. అయితే కాల పరిమితి ముగిసిన ఈ కమిటీలన్ని ప్రస్తుతం రద్దయినట్టే లెక్క.. వీటన్నింటిని మళ్లీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న కొమ్మూరి నేతృత్వంలోనే వేయాల్సి ఉంటుంది.
జంపింగ్‌లు షురూ..!
కొమ్మూరికి డీసీసీ పీఠం ఖరారు కావడంతో పార్టీలోని ప్రత్యర్థి వర్గం లీడర్లు జంపింగ్‌లు షురూ చేశారు. జంగా రాఘవరెడ్డి జనగామను వదిలి వరంగల్‌కు వెళ్లడంతో ఆయన వర్గం లీడర్లు ఇప్పటికే కొమ్మూరి పంతన చేరారు. ఇక నిన్న మొన్నటి వరకు పొన్నాల వర్గంగా చెప్పుకుంటున్న పిట్టల సతీశ్, ఉడుత రవి యాదవ్ వర్గానికి లీడర్లు మోటె శ్రీను, పట్టూరి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ఆకుల లక్ష్మయ్య, బండారి శ్రీనివాస్ తదితరులు కొమ్మూరి టీంలో చేరారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది జనగామ కాంగ్రెస్‌లో ఇంకెన్ని రాజకీయ సమీకరణలు జరుగుతాయో వేచి చూడాల్సిందే..!
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)